(Source: ECI/ABP News/ABP Majha)
Utnoor ITDA Office: ఎస్టీ జాబితాలో ఇతర కులాలను చేర్చవద్దు, తుడుందెబ్బ హెచ్చరిక ! ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత
తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల ఆదివాసీలు సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల ఆదివాసీలు సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ముట్టడిలో పలువురు ఆదివాసీలు ఐటీడీఏ కార్యాలయంలోకి చోచ్చుకొని వెళ్ళెందుకు ప్రయత్నించగా.. పోలీసులు భారీ కేడ్ల మద్య ఆదివాసీలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు ఆదివాసీలకు మద్య తోపులాట జరిగింది. అయినా ఆదివాసీలు ఐటీడీఏ గేటును నెట్టుకొని ఐటీడీఏ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్ళారు. పలువురు ఆదివాసీలు ఆగ్రహంతో ఐటీడీఏ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. ఐటీడీఏ - ఎటిడబ్ల్యూఎసి చైర్మన్ కనక లక్కెరావ్ వాహనంతో పాటు ఓ ఐటీడీఏ వాహనాన్ని బండరాళ్ళతో ధ్వంసం చేశారు. దీంతో ఉట్నూర్ ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసిలు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి నిర్ణయించుకున్నారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఐటిడిఏ ముట్టడి కార్యక్రమానికి తుడుందెబ్బ పిలుపునివ్వగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యకుడు బుర్స పోచయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్, ఉయిక సంజీవ్ ల ఆధ్వర్యంలో ఆదివాసీలు వందలాదిగా ఐటీడీఏకు తరలివచ్చారు. ఐటిడిఏ ఎదురుగా ఏర్పాటు చేసిన ధర్నా శిబిరంలో పాల్గొన్న ఆదివాసిలు ప్రసంగాలు చేస్తుండగానే కొంతమంది ఆదివాసీలు ఐటిడిఏ వైపు ఆదివాసీల సాంప్రదాయ వాయిద్యాలతో తుడుందెబ్బ జెండాలను చేతపట్టుకుని కదిలారు.
అప్పటికి ఐటీడీఏ గేటు ముందు భారీగా పోలీసులు మోహరించారు. గేటు ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆదివాసీలు తొలగించుకుంటూ గేటును తోసి వేయడానికి యత్నించారు. పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికి వందలాది మంది ఆదివాసీలు ఒక్కసారిగా గేటును తోసివేసి ఐటీడీఏ కార్యాలయం ఆవరణలోకి చోచ్చుకువెళ్ళారు. ఈ తోపులాటలో ఓ ఆదివాసీకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఐటీడీఏ కార్యాలయం ప్రధాన గేటు మూసి వేయడంతో ఆదివాసీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలోనే ఒ ఆదివాసీ యువకుడు ఐటీడీఏ కార్యాలయం భవనం పైకి ఎక్కి అక్కడ ఉన్న ఏసీ మిషన్లను కిందికి తోసివేసాడు. మరికొందరు ఆగ్రహంతో ఐటీడీఏ కార్యాలయం కిటికీలు, తలుపుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు.
అక్కడే ఉన్న ఐటీడీఏ - ఎటిడబ్లూఎసి ఛైర్మన్ కనక లక్కేరావ్ వాహనంపై రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగోట్టారు. కార్యాలయం వెనుక పైపునా ఓ ఐటీడీఏ వాహనం అద్దాలను రాళ్ళతో ద్వంసం చేశారు. ఎటిడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కెరావ్ వాహానానికి నిప్పు పెట్టాలని పెట్రోలు పోశారు. పెట్రోలు పోస్తుండగా అక్కడ అడ్డుకుంటున్న సీఐ సైదారావుపై పెట్రోల్ పడింది. అయిప్పటికి ఆయన వారిని వారించి అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపు చేసెందుకు ఉట్నూర్ డిఎస్పి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకొని ఆదివాసులను బయటకు పంపించి మరోసారి గేట్లు మూసి వేశారు. దీంతో ఆదివాసీలు తిరిగి రోడ్డుపైన బైటాయించి రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో మూడు గంటలపాటు మంచిర్యాల - ఆదిలాబాద్ రహదారి మద్య రాకపోకలు నిలిచాయి.
మళ్ళీ ఆగ్రహంతో కొందరు అదివాసులు ఐటీడీఏలోకి చోచ్చుక పోవాలని యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎస్పి ఉదయకుమార్ రెడ్డి ఐటీడీఏ వద్దకు చేరుకుని పరిస్థితి గమనించి ఆదివాసీలను సముదాయించేందుకు యత్నించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రావాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని ఎస్పితో ఆదివాసీలు డిమాండ్ చేశారు. దింతో ఏస్పి ఫోన్ ద్వారా ఐటీడీఏ పిఓకు సమాచారం అందించగా.. ఇంచార్జీ పిఓ గా ఉన్న నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి హుటాహుటీన నిర్మల్ నుండి ఉట్నూర్ కి చేరుకొని ఆందోళనకు దిగిన ఆదివాసీలతో మాట్లాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోడు వ్యవసాయం చేస్తున్న 25 వేల మంది ఆదివాసీ గిరిజనులకు త్వరలో హక్కు పత్రాలు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామని నిర్మల్ కలెక్టర్, ఐటిడిఏ ఇంచార్జి పీఓ వరుణ్ రెడ్డి ఆదివాసీలకు హమీ ఇచ్చారు. దీంతో ఆదివాసులు ముందుగా ఎస్టి జాబితాలో కొత్తగా 11కులాలను చేర్చచాలని అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇంచార్జీ పిఓ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వ పరిది ఉన్నందున ప్రభుత్వానికి తుడుందెబ్బ డిమాండ్లు తెలియజేస్తామని, తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సమయం ఇవ్వాలని సూచించారు. పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలకు హక్కులు కల్పించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేలు పూర్తి చేశామని, అటవీ హక్కు పుస్తకాలు ముద్రణలో ఉన్నందున జాప్యం జరుగుతుందని, రెండు వారాల్లోగా పూర్తి చేసి హక్కు పత్రాలు జారీ చేస్తామని అన్నారు.
ఉట్నూర్ లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కావాల్సిన స్థలాన్ని గుర్తించడం జరిగిందని, ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. అలాగే దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన ఆదివాసులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆందోళనలు చేయొద్దని పిఓ తెలపడంతో ఆదివాసీలు రాస్తారోకో నిలిపి వేసి ఆందోళనను విరమించారు. కాని మళ్ళీ ఈ సమస్య పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా.. అటు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదివాసీలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య హెచ్చరించారు.