Muthireddy Daughter: నా తండ్రి అక్రమ స్థలం మున్సిపాలిటీకి ఇచ్చేస్తా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె
చేర్యాల పెద్ద చెరువు మత్తడి దగ్గర తన పేరున రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే భవానీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా ఓ స్థలం విషయంలో పోరాటం చేస్తున్న ఆమె కుమార్తె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలం.. తన తండ్రి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఆదివారం (జూన్ 25) మీడియా ముందుకు వచ్చారు. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని ఆమె తేల్చి చెప్పారు.
తండ్రి తరపున క్షమాపణలు కోరిన భవాని
సదరు స్థలాన్ని కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తామని భవానీ ప్రకటించారు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉంటూ ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం తప్పు అని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పారు. తన తండ్రి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాకముందే తన తండ్రికి రూ.వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. అలాంటి ఆయన ఈ పని చేయకుండా ఉండాల్సిందని అన్నారు. నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరున రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చేర్యాల ప్రజలకు క్షమాపణ కోరుతున్నానని అన్నారు. అంతేకాక, క్షమాపణ కోరుతూ ఉన్నట్లుగా రాసిన ఒక బోర్డును కూడా ఆ స్థలంలో పాతించారు.
చేర్యాల పెద్ద చెరువు మత్తడి దగ్గర తన పేరున రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే భవానీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఆ స్థలం 1,200 గజాల భూమి చుట్టూ ఉన్న ప్రహరీని ఆమె తొలగింపజేశారు.