(Source: Poll of Polls)
Komatireddy Venkat Reddy: చెరుకు సుధాకర్‌ను చంపేస్తారనే వ్యాఖ్యలపై కోమటిరెడ్డి క్లారిటీ, ఆడియో టేప్ ఎవరిదంటే?
చెరుకు సుధాకర్, ఆయన కొడుకు సుహాస్‌ను తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఒకటి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెందిన ఓ సంచలన ఆడియో వైరల్ అవుతున్న వేళ దానిపై ఆయన స్పష్టత ఇచ్చారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు సుహాస్‌ను తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఒకటి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలను కొంత మంది అలా వక్రీకరించారని చెప్పారు. తన మాటలను కట్ చేసి, మార్ఫింగ్ చేశారని చెప్పారు.
తాను తన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరినీ ఏమీ అనలేదని చెప్పారు. శత్రువును కూడా దగ్గరకు తీసే తత్వం తనది అని అన్నారు. గతంలో ఓ సారి చెరుకు సుధాకర్‌పై పోలీసులు పీడీ యాక్ట్ పెడితే తానే కొట్లాడానని గుర్తు చేసుకున్నారు. తనపై విమర్శలు వద్దనే సుధాకర్ కుమారుడికి చెప్పానని అన్నారు. తన మాటలను కట్ చేసి, కొన్ని అంశాలు మాత్రమే కలిపి గుర్తు తెలియని వారు లీక్ చేశారని చెప్పారు. ఫోన్ రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిప్పటి నుంచి చెరుకు సుధాకర్ తనను తిడుతూనే ఉన్నాడని అన్నారు. నన్ను తిట్టొదు అని మాత్రమే సుహాస్‌కు చెప్పానని అన్నారు. తనను సస్పెండ్ చేయాలని పదే పదే అనడం, తిట్టడం వల్లే బాధతో అలా మాట్లాడానని చెప్పారు.
ఫోన్ కాల్ రికార్డింగ్‌లో ఉన్నది ఇదీ
తన అనుచరులు చెరుకు సుధాకర్ ను చంపడానికి సిద్ధమయ్యారని కోమటిరెడ్డి, చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్‌తో ఫోన్లో మాట్లాడుతూ అన్నారు. చెరుకు సుధాకర్ ను చంపేందుకు తన అనుచరులు వంద కార్లలో తిరుగుతున్నారని, వారం కంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమంటూ సుధాకర్ కొడుకు సుహాస్‌కు ఫోన్ చేసి కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో వైరల్ అవుతోంది. ఈ ఫోన్ కాల్ లో కోమటిరెడ్డి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నట్లు ఉంది.
‘‘సుధాకర్‌ను చంపేందుకు వంద వాహనాల్లో నా అనుచరులు తిరుగుతున్నారు. నిన్ను కూడా చంపుతారు. నీ హాస్పిటల్ కూడా ఉండదు. నేను లక్షల మందిని సాయం చేశాను. వారందరినీ నేను కంట్రోల్ చేయలేను కదా. సుధాకర్ జైల్లో పడితే నేను ఒక్కడినేపోయాను. ఎవరూ పట్టించుకోకపోతే నేనే వెళ్లాను. నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పకపోతే చంపేయడం ఖాయం’’ అని ఓ ఆడియో వైరల్ అవుతుంది. ఇందులో వాయిస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలిఉందని నెటిజన్లు అంటున్నారు. చెరుకు సుధాకర్ కు కోమటిరెడ్డికి వివాదాలు ఉండడంతో ఆ వాయిస్ ఎంపీదే అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఆడియో నల్గొండ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనినైనా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటుందో లేక గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లా చెత్తబుట్టకే పరిమితం చేస్తుందో వేచిచూడాలి.