(Source: ECI/ABP News/ABP Majha)
రాహుల్ గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ హామీలపై చర్చకు రావాలి? కిషన్ రెడ్డి ఛాలెంజ్
Telangana News: కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీల అమలుకు నోట్ల ప్రింటింగ్ మిషన్లు ఇంట్లో ఉండాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీని చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Kishan Reddy challenges Rahul Gandhi: హైదరాబాద్: తుక్కుగూడ సభలో అవగాహన లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy ) మండిపడ్డారు. మీరు ఇచ్చిన హామీలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని సెటైర్లు వేశారు. తెలంగాణ కు ఇచ్చిన హామీలు గురించి మాట్లాడాలని, దమ్ముంటే రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) చర్చకు రావాలని సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ, అధికారంలోకి వచ్చాక హామీ ఎందుకు అమలు చేయలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మద్ధతు ధర అప్పుడు, ఇప్పుడు..
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వరికి మద్ధతు ధర కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.1350 నేడు రూ.2,200 దాటింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2014 వరకు చాలా తక్కువగా ఉంది. కనీస వేతనం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.12 వేలు ఉంటే మేం దాన్ని రూ.18 వేలకు పెంచాం. మీడియాతో పాటు పెద్ద పెద్ద పరిశ్రమలలో ఆదివాసీలు, దళితులు లేరు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ కంపెనీలు పెట్టారు. ఎస్సీలు, మహిళలలు, దళితులకు జాబ్స్ ఇవ్వాలని మీకు అప్పుడు తెలివి లేదా? ప్రస్తుతం మా హయాంలో మోదీ నాయకత్వంలో మేకిన్ ఇండియా. కొత్తగా వ్యాపారం చేసే వారిని ప్రోత్సహించాం. ముద్రలోన్ ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి లోన్స్ ఇచ్చాం.’
బీసీని ప్రధానిని చేసిన ఘనత మాదే
‘దేశంలో ఉన్నతాధికారులలో మంత్రుల కింద చేస్తున్న ఐఏఎస్, కార్యదర్శులుగా ఉన్న వారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రిక్రూట్ అయ్యారు. మేం అధికారంలోకి వచ్చాక ఎలాంటి రిక్రూట్ మెంట్ చేయలేదు. అన్ని వర్గాల వారికి ఐఏఎస్, కీలక పదవులు లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పిదమే. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించింది మేం. బీసీని ప్రధానిని చేసిన ఘనత మాదే. మీరు ఎప్పుడైనా బీసీని ప్రధానమంత్రిని చేశారా? అధికారంలో ఉన్నప్పుడు కేవలం మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించారు. దళితుడైన బాబు జగ్జీవన్ రామ్ ను ఓడించింది మీరు. బీఆర్ అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే ఓడించింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ నేతలకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 27 మంది బీసీలు తొలిసారి కేంద్ర మంత్రులుగా ఎన్డీఏ ప్రభుత్వంలోనే చేశారు.’
ఎప్పుడైనా బీసీని ముఖ్యమంత్రిని చేశారా. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మేం ఇటీవల ధైర్యంగా చెప్పాం. కానీ మీరు ఆలోచన కూడా చేయలేదు. ఉమ్మడి ఏపీలో పలు పర్యాయాలు ఛాన్స్ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు. చైనా బ్రాండ్‌ను రాహుల్ గాంధీ పొగుడుతున్నారు. ఇంత కంటే అవగాహనా రాహిత్యం దేశంలో ఎవరికి ఉండదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న వస్తువును సైతం చైనా లాంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న చరిత్ర మీది. చైనా లాంటి బ్రాండ్లు తెలంగాణలో తయారుచేస్తామని రాహుల్ చెబుతున్నారు. అంటే చైనా బ్రాండ్లు గొప్పవని ప్రచారం చేస్తున్నారా? దిగుమతుల కంటే ఎగుమతులపై ఎన్డీఏ సర్కార్ ఫోకస్ చేస్తోంది. కానీ మీరు పనిగట్టుకుని చైనా లాంటి విదేశీ బ్రాండ్లకు ప్రచారం చేయడం సిగ్గుచేటు - కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏ టీమ్, బీ టీమ్‌లు
‘బీజేపీ తెలంగాణలో ఎవరికో బీ టీమ్ అని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ పార్టీకి ఏ టీమ్, బీ టీమ్ లు అవసరం లేదు. గూట్లో రాయి తీయలోనోడు ఏట్లో రాయి తీస్తానన్నట్లుంది రాహుల్ గాంధీ వ్యవహారం. రేవంత్ రెడ్డి ఇంట్లో, సోనియా గాంధీ ఇంట్లో నోట్లు ముద్రించే మిషన్లు పెడితే తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు అమలు కావు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండే పరిస్థితిలో లేదు. అందుకే, తెలంగాణలో అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మభ్యపెడుతోంది. మోదీ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది. తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ హామీలపై ఢిల్లీలో అయినా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో చర్చించేందుకు సిద్ధమా అని’ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు కిషన్ రెడ్డి.