Jayesh Ranjan IAS to opts VRS | వరుస బదిలీలు.. జయేశ్ రంజన్ వీఆర్‌ఎస్ నిర్ణయం వేనుక కారణమేంటి!
IAS బదిలీల వేళ మరో సంచలనం.. హెచ్‌ఎండీఏ నుంచి పర్యావరణ శాఖకు జయేశ్ రంజన్ షిఫ్ట్ | సీఎస్ పదవి చేజారిందా? వీఆర్‌ఎస్ వెనుక అసలు కథేంటి?

తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల తాజా బదిలీల వేళ జయేశ్ రంజన్ వీఆర్‌ఎస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కేటీఆర్‌తో కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కీలకంగా కనిపించేవారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఐటీ, పరిశ్రమల శాఖల నుంచి సీఎంవోకు, అక్కడి నుంచి హెచ్‌ఎండీఏకు, ఇప్పుడు పర్యావరణ శాఖకు బదిలీ కావడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉన్న జయేష్ రంజన్.. ముందే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) తీసుకోనున్నారు. ఈ పరిణామాల వెనుక కారణాలపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఐటీ శాఖ నుంచి పర్యావరణ శాఖకు..
తాజా బదిలీల్లో జయేశ్ రంజన్‌ను పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలో ఆయన నిర్వహించిన క్రీడలు, హెరిటేజ్ తెలంగాణ అదనపు బాధ్యతలను తొలగించారు.
2025 ఏప్రిల్‌లో ఐటీ, పరిశ్రమల శాఖల నుంచి తప్పించిన ప్రభుత్వం.. ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఈవోగా నియమించింది. అదే ఏడాది డిసెంబర్‌లో అక్కడి నుంచి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖకు బదిలీ చేసింది. ఇప్పుడు మరోసారి శాఖ మారడంతో ఆయనకు కీలక పెట్టుబడుల బాధ్యతలు దూరమయ్యాయన్న చర్చ మొదలైంది. అయితే, ఈ బదిలీలను ఉద్దేశపూర్వకంగా పదవీ ప్రాధాన్యం తగ్గించారనే చర్చా సెక్రటేరియట్ కారిడార్స్ లో నడుస్తోంది.
కేటీఆర్ హయాంలో కీలక అధికారి
జయేశ్ రంజన్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, పరిశ్రమల రంగాల్లో కీలక పాత్ర పోషించారు. అప్పటి మంత్రి కేటీఆర్‌తో కలిసి అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు ఆకర్షించడం, పెట్టుబడుల ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణను టెక్నాలజీ కేంద్రంగా ప్రచారం చేయడంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది.
2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనది కీలక బాధ్యతే. పెట్టుబడుల వ్యవహారాల్లో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే సీఎంవోలో బాధ్యతలు అప్పగించినట్లు అప్పట్లో భావించారు. అయితే, ఆ తర్వాత వరుసగా శాఖలు మారడం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.
వీఆర్‌ఎస్ వెనుక కారణమేంటి ? సీఎస్ పదవి దక్కకపోవడంతో అసంతృప్తా?
జయేశ్ రంజన్ వీఆర్‌ఎస్‌పై గత రెండు రోజులుగా గుసగుసలు నడుస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెబుతున్నారట. సర్వీస్ తర్వాత ఓ అంతర్జాతీయ సంస్ధలో సీనియర్ స్థాయి కెరీర్ లో చేరుతున్నట్టు సమాచారం. అయితే, ఏ సంస్థలో చేరబోతున్నారనే విషయంపై స్పష్టత లేదు.
2026 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నియామకం కూడా జయేశ్ రంజన్ పేరు వినిపించింది. ఆ పదవికి ఆయన పరిశీలనలో ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ, ప్రభుత్వం సంజయ్ జాజును నియమించింది. ఈ పరిణామం జయేశ్ రంజన్‌ను అసంతృప్తికి గురయ్యారనే చర్చ వుంది. ఆయన పదవీ విరమణ తేదీ 2027 సెప్టెంబర్ 30. అంతకంటే ముందే బయటకు రావాలనే నిర్ణయం అమలులోకి రావాలంటే సంబంధిత నిబంధనల ప్రకారం దరఖాస్తు, ప్రభుత్వ ఆమోదం అవసరం. ఇప్పటికే దరఖాస్తు చేశారా, ప్రభుత్వం ఆమోదించిందా అనే విషయాలను వేరుగా నిర్ధారించాల్సి ఉంది.
రాజకీయంగా ప్రాధాన్యం ఎందుకు?
కేటీఆర్ హయాంలో పెట్టుబడుల వ్యవహారాల్లో కీలకంగా ఉన్న అధికారి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు వీఆర్‌ఎస్ వైపు అడుగులు వేస్తుండటం రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్‌ఎస్ ఈ పరిణామాన్ని పాత ప్రభుత్వంతో సంబంధం ఉన్న అధికారుల ప్రాధాన్యం తగ్గుతోందనే కోణంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సీఎంవోలోనూ కీలక బాధ్యతలు ఇచ్చిందని గుర్తు చేయవచ్చు.
మొత్తానికి, వరుస బదిలీలు, సీఎస్ పదవి దక్కకపోవడం, వీఆర్‌ఎస్ వార్తలు కలిసి జయేశ్ రంజన్ వ్యవహారాన్ని ఆసక్తికరంగా మార్చాయి. అయితే, ఆయన నిర్ణయం వెనుక వ్యక్తిగత కారణాలే ఉన్నాయా, ఇతర అవకాశాలు ప్రభావం చూపాయా అన్నది తేలేలాలేదు.
ట్రెండింగ్ వార్తలు






















