Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్: రైతుల పిటిషన్‌పై ఏజీకి హైకోర్టు కీలక ఆదేశాలు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల ఆందోళనల వేళ ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ స్పందించిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై స్పష్టత ఇచ్చారు.
కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు ఏకంగా మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే, రిట్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు తీసుకుంది. రైతుల తరఫున న్యాయవాది సృజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మాస్టర్ ప్లాన్‌ను కోర్టుకు సమర్పించారు. రైతులను పక్కనపెట్టి రీక్రియేషన్ జోన్‌గా ప్రకటించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. దీంతో మాస్టర్ ప్లాన్ అంశంపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాత పిటిషన్‌ను హైకోర్టు పాస్ ఓవర్ చేసింది.
మరోవైపు, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం మరింతగా ముదురుతుంది. మాస్టర్ ను ప్లాన్ రద్దు చేసే వరకు ఆందోళనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుండి కామారెడ్డి కౌన్సిల్ సభ్యులకు ఈ ప్రతిపాదనలను పంపించనున్నారు.
ఇంతకుముందే స్పందించిన కలెక్టర్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల ఆందోళనల వేళ ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ స్పందించిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై స్పష్టత ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ (ముసాయిదా) దశలో ఉందని ఇంకా ఎవరూ ఫైనలైజ్ చేయలేదని చెప్పారు. రైతులు ఇతరుల మాటలు నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ విషయంలో అభ్యంతరాల స్వీకరణకు ఇంకా గడువు ఉందని.. ఆ తర్వాత అందుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. భూములు పోతాయని కొంత మంది రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
2000 సంవత్సరంలోని పాత మాస్టర్ ప్లాన్‌ను కూడా కలెక్టర్ చూపించారు. ఎవరి భూములు వారికే ఉన్నాయని అన్నారు. ఆందోళనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కారకులైన వ్యక్తులపైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు.
‘‘చాలా మంది రైతులకు మాస్టర్ ప్లాన్ పైన అపోహలు ఉన్నాయి. 61.55 కిలో మీటర్లను కవర్ చేస్తూ ఓ ప్రతిపాదన ఉంది. 191 జీవోను గతేడాది నవంబర్ 30న విడుదల చేశాం. అభ్యంతరాలు స్వీకరించేందుకు దానికి 60 రోజుల టైం ఉంటుంది. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయి. డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్‌పై వచ్చిన అభ్యంతరాలపై పరిశీలన చేస్తున్నాం. మేం ఎవరి భూములు తీసుకోవట్లేదు. అందరి అభిప్రాయాలను స్వీకరిస్తాం. జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పొచ్చు.
2000 సంవత్సరంలో పాత మాస్టర్ ప్లాన్ చూడండి. వారి భూములు పోయాయా? రైతుల పేరు మీదే భూములు ఉన్నాయి. ఇప్పటికి వారు రైతుబంధు తీసుకుంటున్నారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూ సేకరణ కాదు. అభ్యంతరాలు తెలిపే హక్కు రైతులకు ఉంది. అభ్యంతరాలు రాసుకొని అధికారులు రిమార్క్స్ చేస్తారు. ఇది ప్రతిపాదన మాత్రమే మెుదటి స్టేజ్‌లోనే ఉంది. ఇండస్ట్రియల్ జోన్ ప్రకటించిన మాత్రన పంట పొలాలను లాక్కోరు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు.