G Kishan Reddy: టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు, మన్నుతిన్న పాములా ప్రభుత్వం: కిషన్ రెడ్డి
హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జి. కిషన్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కావడం లేదని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పుడు చెబుతున్నారని, ఇన్నాళ్లు అధికారంలో ఉండి కూడా ఎందుకు ప్రక్షాళన చేయలేదని నిలదీశారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జి. కిషన్ రెడ్డి మాట్లాడారు. గ్రూప్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అవడంపై మంత్రి కేటీఆర్ మాటలు దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉన్నాయని అన్నారు.
నెల క్రితం వరకు టీఎస్పీఎస్సీతో తమకేమీ సంబంధం లేదని అన్న కేటీఆర్.. డిసెంబర్ 3 తర్వాత ఎలా ప్రక్షాళన చేస్తారని ప్రశ్నించారు? కేటీఆర్ పగటి కలలు కనటం మానుకోవాలని అన్నారు. మార్చి 12న లీకేజీ వ్యవహారం వెలుగులోకి వస్తే ఇప్పటిదాకా మన్ను తిన్న పాము లాగా కేటీఆర్ ఉన్నారని అన్నారు. నిరుద్యోగులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని.. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఉద్యోగాలు భర్తీ చేసేవారని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పేపర్లు లీక్ అయ్యాయని.. ఉద్యోగాల భర్తీ జరగలేదని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్ ఓటమి కూడా ఖాయమని చెప్పారు. ప్రగతి భవన్ నుంచి ఫాం హౌస్ కు కేసీఆర్ కుటుంబం పరిమితం కావటం ఖాయమని అన్నారు. కేసీఆర్ కు యువతపై నిజంగా ప్రేమ ఉంటే ఎప్పుడో ఉద్యోగాలను భర్తీ చేసేవారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కారణంగా 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు.
ప్రవళిక ఆత్మహత్య ఘటనపైనా మరోసారి స్పందన
వరంగల్ కు చెందిన విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య పాపం కేసీఆర్ ప్రభుత్వానికే తగులుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికి ప్రవళిక అత్యహత్యను వాడుకోవటం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ పరీక్షలు 17 సార్లు వాయిదా పడ్డాయని.. ఈ పరీక్షల వాయిదాలో కేసీఆర్ ప్రభుత్వానికి గిన్నీస్ రికార్డు ఇవ్వొచ్చని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం నీరు గార్చేసిందని అన్నారు. టీచర్లు, లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కుటుంబపార్టీ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ స్వతంత్య్రం లేదని.. ఆఖరికి ధర్నా చౌక్ కూడా ఎత్తేశారని గుర్తు చేశారు. దాని కోసం హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చిందని అన్నారు.
మూడో లిస్టుపై క్లారిటీ
బీజేపీ అభ్యర్థుల విషయంలో పార్టీ, అధిష్ఠానానిదే తుది నిర్ణయంగా ఉంటుందని అన్నారు. నవంబర్ ఒకటిన అభ్యర్థుల మూడో జాబితా ఉంటుందని, పార్టీ అధ్యక్షుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్ని జిల్లాలలో సమావేశాలు పెట్టి అభ్యర్థుల ఎంపిక విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఘటనపై కిషన్ రెడ్డి స్పందించారు. ఇది అప్రజాస్వామికమని దీన్ని ఖండిస్తున్నట్లుగా చెప్పారు. ఏ అభ్యర్థిపై అయినా దాడి జరగడం మంచి పద్ధతి కాదని అన్నారు.