BRS MLAs Suspension: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్.. సెషన్ ముగిసేవరకు సస్పెన్షన్ వేటు!
తెలంగాణ అసెంబ్లీలో ఆందోళన చేపట్టిన కేటీఆర్ సహా 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసేవరకు శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సెషన్ ముగిసే వరకు బీఆర్‌ఎస్‌కు చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మూడో రోజున బీఆర్‌ఎస్ సభ్యులు వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెనక్కి తగ్గాలని, ఇది దొరల పాలన కాదని కేటీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ఘాటుగా హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి తీవ్రమవ్వడంతో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన సిఫారసు మేరకే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసేవరకు సస్పెండ్ చేశారని తెలుస్తోంది. సభలో లేని వారిని ఎందుకు సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
ఈ సస్పెన్షన్‌కు గురైన వారిలో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కౌశిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మితో పాటు మాధవరం కృష్ణారావు, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, జగదీశ్ రెడ్డి, అనిల్ జాదవ్, సుధీర్‌రెడ్డి ఉన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించకుండా అడ్డంకులు కలిగిస్తున్నందుకే వారిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించగా, స్పీకర్ దానికి ఆమోదం తెలిపారు.
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తన, కేసీఆర్ నివాసం వెలుపల పోలీసుల సమక్షంలో జరిగిన ర్యాలీ, కెసిఆర్ చనిపోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన బెదిరింపులు, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించాలని కోరుతూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని శాసనసభలో డిమాండ్ చేశారు.
తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్ నాయకుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత స్పీకర్‌ను గౌరవించకుండా అవమానపరిచే ధోరణిని ప్రతిపక్షం తక్షణమే మానుకోవాలని ఆయన హితవు పలికారు. సభను నడిపే స్పీకర్ సూచనలను పాటించకుండా, వెల్‌లోకి వచ్చి ఛాలెంజ్ చేయడం, సభ సాఫీగా సాగకుండా అడ్డంకులు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. స్పీకర్ పదవిని, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరమని డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యానించారు.
దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్ష నేతల వైఖరి ఉందంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళిత నాయకులు నిరసన తెలపగా పసుపు నీళ్లతో శుద్ధి చేసి అవమానించిన సంఘటనలు గుర్తులేదా అని ప్రశ్నించారు. అలాంటి వారే ఇప్పుడు న్యాయం కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల వరుస ఆందోళనలు, సభను అడ్డుకునే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో సంయమనంతో భరిస్తోందన్నారు. కానీ గతంలో సాగిన దొరతనం పోకడలను మళ్లీ సహించడానికి తెలంగాణ రాష్ట్రం ఏమాత్రం సిద్ధంగా లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు























