DK Aruna: నన్ను విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లే - రేవంత్‌పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు
DK Aruna Comments: డీకే అరుణ గురువారం (మార్చి 7) ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్నటి సభలో రేవంత్ టీమ్ మాట్లాడింది చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తొస్తున్నాయని ఎద్దేవా చేశారు.
Telangana News: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు సీఎం హోదాలో మాట్లాడినట్లు లేదని.. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఒక పక్క పెద్దన్న అంటూనే ఆ మరుసటి రోజే మోదీ - కేడీ అంటున్నారని విమర్శించారు. ఇది ఆయన కుసంస్కారానికి నిదర్శనమని డీకే అరుణ ఆక్షేపించారు. డీకే అరుణ గురువారం (మార్చి 7) ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ‘‘నిన్నటి సభలో రేవంత్ టీమ్ మాట్లాడింది చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తొస్తున్నాయి. మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎవరి సింపతి కోసం మాట్లాడుతున్నారో చెప్పాలి. మీ పాలన మీద మీకే నమ్మకం లేదు అందుకే దింపేస్తారంట, దింపేస్తారంట అంటున్నారు. కాంగ్రెస్ లోంచి ఎవరైనా మరో ఎకనాథ్ షిండేలా 40 మంది ఎమ్మెల్యేలతో వస్తే అప్పుడు దిగిపోతుందేమో.
కాంగ్రెస్ లో రేవంతే మరో ఏక్ నాథ్ షిండే అవ్వొచ్చు అనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కేసీఆర్ కూడా అహంకారపూరిత మాటలు మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నారో చూసాం. బీఆరెస్, బీజేపీ ఒక్కటే అంటూ తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది, మీకు గుర్తులేదా? 60 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ మహిళలకు మరుగుదొడ్లు కట్టించి ఇచ్చాము. రేవంత్ కు దమ్ముంటే ఇచ్చిన అరు గ్యారంటీలు అమలు చేసి చూపండి. మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిందో లేదో అప్పుడే అహంకారం వచ్చిందా? మోదీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే మైలేజీ వస్తుంది అనుకుంటున్నావేమో ఖబర్ధార్ రేవంత్ రెడ్డి. నోటికొచ్చినట్లు మాట్లాడితే వెంటపడి తరిమేస్తాం.
మొన్న మోదీని కలిసిన అపవాదాన్ని తొలగించుకునేందుకు రాజకీయ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. సీఎం రేవంత్ రెడ్డి, వాళ్ల పార్టీ అభ్యర్థి ఇద్దరు నాగర్ కర్నూల్ పార్లమెంట్ వాసులే. ఇక్కడికొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ది చెప్తారు’’ అని డీకే అరుణ మాట్లాడారు.
పాలమూరు ప్రాజెక్ట్ పైనా వ్యాఖ్యలు
‘‘డీకే అరుణ ఆనాడు పోరాడి జీవో తీసుకురాకపోతే పాలమూరు రంగారెడ్డి ఉండేది కాదు. పాలమూరు రంగారెడ్డి కోసం రేవంత్ రెడ్డి చేసింది ఏంటో చెప్పాలి. పాలమూరు అభివృద్ధికి కృషి చేసింది నేను. విద్యాలయాలు, సాగునీటి ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసింది మేము. కాంగ్రెస్ నాయకులకు పాలమూరులో ఓట్లు అడిగే హక్కు లేదు. 2014 పాలమూరు ప్రాజెక్ట్ డిసైన్ ఏంటి? ఇప్పుడున్న మార్చిన డిసైన్ కు కాంట్రాక్టర్ లకు వంత పాడుతున్నారా? పాలమూరు ప్రాజెక్ట్ ప్రతిపాదనలే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రాంతాల కోసం కదా? అదే లిఫ్ట్ ద్వారా కల్వకుర్తికి నీళ్లేందుకు తీసుకుపోతున్నారో చెప్పాలి. పాలమూరు అభివృద్ధి కోసమే పోరాడిందే నేను కదా ఈ విషయం జిల్లాలో ఎవర్ని అడిగిన చెప్తారు. పాలమూరుకు 60 శాతం నిధులు ఇస్తామని చెప్పినా మళ్ళీ ఎందుకు ఈ రాద్ధాంతం, అర్థం కాలేదు.
కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ ఏది?
అంత చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు కాంగ్రెస్ విభజన చట్టంలో ఎందుకు పెట్టాలోదో ముందు రేవంత్ సమాధానం చెప్పాలి. జిల్లా కోసం కొట్లాడిన నామీద విమర్శలు చేస్తే ఆకాశం వైపు ఉమ్మేసినట్లే. మీకు దమ్ముంటే కాళేశ్వరంపై ఇప్పటివరకు ఎందుకు సీబీఐ ఎంక్వయిరీ చేయలేదు. కేసీఆర్ తో కుమ్మకయ్యారా? అందుకే మేడిగడ్డపై సీబీఐ ఎంక్వయిరీ చేయడం లేదా? ఇదీ మా ప్రగతి. గత పదేళ్లలో భారత ఆర్థిక ప్రగతి కళ్ళకు కనడపడటం లేదా?
ప్రపంచమే మోదీవైపు చూస్తుంటే ఓర్చుకోలేక పోతున్నారా? ఇండియా కూటమిలో రాహుల్ నే ప్రధానిగా ఒప్పుకోవడం లేదు. తెలంగాణలో 12 పార్లమెంట్ స్థానాలు బరాబర్ గెలుస్తాం. తెలంగాణాలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతాడా? పాలమూరు అభివృద్ధి జరిగిందే మా వల్ల.. పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్లు, హైవేలు, విద్యాలయాలు, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వే లైన్ లు బ్రిడ్జి లు, కనపడటం లేదా? నిరుపేదలకు కనీసం రేషన్ కార్డులుకూడా ఇవ్వని చెతకాని ప్రభుత్వాలు మీవి. కేంద్రంలో ఉన్నది మోదీ సర్కార్ షేర్.. ప్రజారంజకపాలన అంటే మాది. మరి 60 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు ఏం చేసారో చెప్పాలి..? చిల్లర మాటలు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త ఖబర్ధార్’’ అని డీకే అరుణ హెచ్చరించారు.