YS Sharmila On TSPSC : టీఎస్సీఎస్సీ పేపర్ల లీకేజీ పెద్ద స్కామ్, సీబీఐతో దర్యాప్తు చేయించాలి - వైఎస్ షర్మిల
YS Sharmila On TSPSC : టీఎస్పీఎస్సీప పేపర్ల లీకేజీ పెద్ద స్కామ్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ స్కామ్ లో బోర్డ్ ఛైర్మన్ దగ్గర నుంచి మంత్రుల స్థాయిలో హస్తం ఉందని విమర్శించారు.
YS Sharmila On TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీ ది పెద్ద స్కాం అన్నారు. అందరూ కుమ్మక్కు అయ్యి చేసిన స్కామ్ అని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్ లో బోర్డ్ ఛైర్మన్ దగ్గర నుంచి మంత్రుల స్థాయిలో హస్తం ఉందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు కావాలనే లీక్ చేశారని మండిపడ్డారు. బోర్డు మొత్తాన్ని రద్దు చేయాలన్నారు. లీకేజీపై సిట్ తో దర్యాప్తు కరెక్ట్ కాదన్న షర్మిల...సిట్ ప్రభుత్వానికి అనుకూలంగా విచారణ చేస్తుందన్నారు. అందుకే సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు. TSPSC నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందని ఆక్షేపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం TSPSC లో రిజిస్టర్ చేసుకున్నారని గుర్తుచేశారు.
పేపర్ లీక్ పెద్ద స్కాం
"పేపర్ లీక్ అనేది ఒక పెద్ద స్కాం. బోర్డు ఛైర్మన్ కి, సెక్రటరీకి తెలిసే పాస్ వర్డ్ లు బయటకు ఎలా లీక్ అయ్యాయి. మూడో వ్యక్తికి పాస్ వర్డ్ లు ఎలా తెలిశాయి. అంగట్లో సరుకులు అమ్మినట్లు TSPSC పేపర్లు అమ్ముతున్నారు. ఒక్క AE పేపర్ కాదు అన్ని పేపర్లు లీక్ అయ్యి ఉంటాయి. గ్రూప్ 1 కూడా లీక్ అయ్యి ఉంటుంది. TSPSC విశ్వసనీయత ఏంటి?. రహస్యంగా ఉండాల్సిన సమాచారం బయటకు ఎలా వచ్చింది. ఇందులో అందరి హస్తం ఉంది. కావాలనే పేపర్లు లీక్ చేశారు. లీకుల వెనుక బోర్డ్ ఛైర్మన్ నుంచి మంత్రుల స్థాయి వరకు హస్తం ఉంది. పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిగ్గు పడాలి. TSPSC సర్వర్ ఎలా లీక్ అవుతుంది. కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద లేదు. "- వైఎస్ షర్మిల
నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గం. TSPSC అక్రమాలపై CBI దర్యాప్తు చేపట్టాలి. ఎనిమిదేండ్లుగా బయటపడని అక్రమాలను కూడా తేల్చాలి. ఈ కుంభకోణంలో ఉద్యోగులతో పాటు బోర్డు సభ్యులు, మంత్రుల హస్తం కూడా ఉంది. TSPSC నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయింది.
— YS Sharmila (@realyssharmila) March 17, 2023
1/2 pic.twitter.com/cNjYjtH1wd
తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం
పేపర్ల లీకేజీపై ముఖ్యమంత్రి ఇంత వరకు ఎందుకు స్పందించడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ ఒక మోనార్క్, ఒక నియంత అని మండిపడ్డారు. కేసీఆర్ ఒక తాలిబాన్ అని విమర్శించారు. తెలంగాణలో భారత రాజ్యాంగం అమలు కావడంలేదన్నారు. కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలు అవుతుందని మండిపడ్డారు. పేపర్లు సంతలో అమ్మినట్లు అమ్మడం కేసీఆర్ రాజ్యాంగమా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం కేసీఆర్ రాజ్యాంగం అన్నారు. ప్రతిపక్షాలను తొక్కడం కేసీఆర్ రాజ్యాంగమన్నారు. పేపర్ లీక్ పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. TSPSCకి వినతి పత్రం ఇస్తామని చెప్పినా అనుమతి ఇవ్వక పోవడం దుర్మార్గం అన్నారు.