(Source: ECI/ABP News/ABP Majha)
Etela Fires On Revanth Reddy : రేవంత్ రెడ్డి నీకు నాకు పోలికా, సీఎం కావాలనే కల కల్ల అయ్యిందనే ఏడుపు - ఈటల రాజేందర్
Etela Fires On Revanth Reddy : రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకోవాలని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ ఏ ఒక్కరినైనా బ్లాక్ మెయిల్ చేశారని చూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు.
Etela Fires On Revanth Reddy : 'సీఎం కేసీఆర్ అనేక దుర్మర్గాలు చేస్తున్నారు, వాటి మీద పోరాటం చెయ్యి, కొట్లాడాలి అంటే మాదగ్గరికి రా కొట్లాడం' అంటూ రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఈటల రాజేందర్ మీడియా మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారన్నారు. రేవంత్ ఏడుస్తూ కూడా సంస్కారం లేకుండా నీ అమ్మ, నీ అబ్బ అని మాట్లాడారన్నారు.
"రేవంత్ రెడ్డి సూటిగా అడుగుతున్నా.. మీరు ఏ ఉద్యమంలో జైలుకు పోయారు. నీకు నాకు పోలిక ఏంటి. నీ చరిత్ర ఏంటి, నా చరిత్ర ఏంటి. నేను నా జీవితంలో RTA ద్వారా ఒక్క దరఖాస్తు కూడా పెట్టలేదు. కన్స్ట్రక్షన్ బిల్డింగుల దగ్గర ధర్నా చెయ్యలేదు. ఈటల రాజేందర్ ఏ ఒక్కరినీ అయినా బ్లాక్ మెయిల్ చేశారని చెప్పిస్తే ముక్కు నేలకు రాస్తా. రేవంత్ ఏ ప్రోగ్రామ్ ప్రకటించినా హౌజ్ అరెస్ట్ చేస్తారు. నిన్న ఎలా రైట్ రాయల్ గా పంపించారు ఇందులో ఉన్న మతలబు ఏంటి? రేవంత్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకో. పిచ్చి వేషాలు బంద్ పెట్టు." - ఈటల రాజేందర్
అకాల వర్షాలతో రైతులకు నష్టం
రైతులపై మూడు సార్లు ప్రకృతి ప్రకోపించిందని ఈటల రాజేందర్ అన్నారు. ఒక్కసారి కూడా కేసీఆర్ పరిహారం అందించలేదని ఆరోపించారు. ఫసల్ బీమా ఉంటే కనీసం లాభం జరిగేదని, అది కూడా లేకుండా చేశారన్నారు. సీఎం పరిహారం ఇస్తా అని ప్రకటించి వచ్చాక కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. మళ్లీ నిన్న వేల ఎకరాల పంట నష్టం జరిగిందని, వెంటనే ఎకరానికి 20 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈటల. ఐకేపీ సెంటర్స్ లో నాని పోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మక్కలు కొనాలి అని డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకుడు కన్నీళ్లు పెట్టరు
"మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. జాతీయ పార్టీల నిర్ణయాలు దిల్లీలో జరుగుతాయి. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. సూరత్ కోర్టు తీర్పుపై ఇది చీకటితీర్పు అని అందరికంటే ముందు స్పందించింది కేసీఆర్. ఇది ఎక్కడి ప్రేమ, ఎక్కడ కలయిక. రేవంత్ రెడ్డి ధీరుడు లెక్క కొట్లడుతాడు అనుకున్న ఎప్పుడు ఏడవడు అనుకున్నా. రాజకీయ నాయకుడు కన్నీళ్లు పెట్టరు. రేవంత్ ఏడుస్తూ కూడా సంస్కారం లేకుండా నీ అమ్మ, నీ అబ్బ అని మాట్లాడారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే నెలల తరబడి జైల్లో ఉన్నాను. కపిటేశన్ ఫీ, డైట్ ఛార్జీలు, యునివర్సిటీ నిర్ణయాలు ఎదిరించి కొట్లాడాను. మేము ఉద్యమంలో కొట్లడుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు రేవంత్. చంద్రబాబు పంచన చేరారు. కరీంనగర్ మీటింగ్ కి తెలంగాణ వ్యతిరేకులు ఎలా వస్తారని ప్రశ్నిస్తే టీడీపీ మీటింగ్ కి తుపాకీ తీసుకొని వచ్చింది సంగతి నువ్వు మర్చిపోవచ్చు కానీ.. మేము మర్చిపోలేదు. అశోక్ అనే ఉద్యమకారుడు తుపాకీ గుంజుకున్న సందర్భం ఇంకా గుర్తుకు ఉంది." -ఈటల రాజేందర్
ఓటుకు నోటు కేసులో జైలుకు
ఉద్యమంలో నేను కరీంనగర్, మహబూబ్ నగర్ జైల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మాకు, మీకు ఏం పోలిక అంటూ మండిపడ్డారు. మీరు ఓటుకు నోటు కేసులో జైలుకు పోయారు తప్ప ప్రజలకోసం కాదని ఎద్దేవా చేశారు. 2014 కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం కాదా? పార్టీ ఫిరాయించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2019లో 90 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు ఉన్న తరువాత కూడా కేసీఆర్ పక్క పార్టీ వారిని లాక్కున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో 19 ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని గుర్తుచేసారు. తెలంగాణలో కాంగ్రెస్ ను భూ స్థాపితం చేయాలని చూస్తుంది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. హుజూర్ నగర్ లో పద్మావతిని, నాగార్జునసాగర్ లో జనారెడ్డిని, మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని, కొడంగల్ లో నిన్ను ఎన్ని డబ్బులు వెచ్చించి ఓడించారో నీకు తెలియదా? అని నిలదీశారు.
సీఎం కావాలనే కల కల్లలు
"రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి అన్నీ ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఇది మునుగోడు అంతా చర్చ జరుగుతుంది. మునుగోడులో కూడా రేవంత్ రెడ్డి మహిళల మీటింగ్ లో ఏడ్చాడు. మరి డిపాజిట్ వచ్చిందా? కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జనారెడ్డి, చివరికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా BRS తో పొత్తు పెట్టుకుంటాం అన్నారు. ఇవన్నీ తెలిసి రేవంత్ రెడ్డి ఆశలు అడియాశలు అయ్యాయని ఏడ్చాడు కావచ్చు. ఆయన ఏడ్చింది.. నాకోసం కాదు. ముఖ్యమంత్రి కావాలనే కల కల్లలు అయ్యాయని ఏడ్చారు. నాకు ధైర్యం ఉంది. ఆత్మ విశ్వాసం ఉంది. ప్రమాణాలు చేసే కల్చర్ నాది కాదు. నా మీద విమర్శ చేస్తే నీవే పలచబడతావు. నీ పార్టీ, BRSతో జతకట్ట బోతున్నావా ? లేదా ? చెప్పాలి. నా పంచాయితీ కేసీఆర్ తో నీతో కాదు." - ఈటల రాజేందర్