Revanth Reddy: ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Telangana : కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసే తీరును మార్చుకోవాల్సి ఉందని ఆ పార్టీ సీఎం రేేవంత్ రెడ్డి అన్నారు. ఓ మీడియా నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసే ఫార్మాట్ మార్చుకోవాల్సి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు... ఇప్పుడు 20-20 ఫార్మాట్ నడుస్తోంది. మేం ఫార్మాట్ ఆడాలి. లేదా ఫార్మాట్ మార్చుకోవాలన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఉంచడమో.. ఖతం చేయడమో తీరులో బీజేపీ రాజకీయం ఉంటుందన్నారు. మాకు మానవీయ స్పర్శ ఉంటుంది. మేం అలా చేయం.. అవసరాలు.. వ్యాపార రీతిలో బీజేపీ రాజకీయాలు ఉంటాయి.. కాంగ్రెస్ తాతతండ్రులను గుర్తుపెట్టుకుంటుంది.. వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.
దేశంలో స్విగ్గీ రాజకీయాలు
రాజకీయాల్లో తరాల అంతరం వచ్చేసిందన్నారు. గతంలో అమ్మమ్మనానమ్మలు వంట చేసేంత వరకు రెండు మూడు గంటలు వెయిట్ చేసేవాళ్లం.. లేదా మంచి హోటల్‌కు వెళ్లేవాళ్లం.. ఇప్పుడు స్విగ్గీలో అర్డర్ ఇస్తే రెండు నిమిషాల్లో ఆర్డర్ వస్తోంది.. మనం అమ్మ, అమ్మమ్మ, నానమ్మలపై ఆధారపడడం లేదు.. స్విగ్గీపై ఆధారపడుతున్నాం.. ఇప్పడు రాజకీయాల్లోనూ స్విగ్గీ రాజకీయాలు ఎక్కువయ్యాయి... సరళీకరణ (లిబరలైజేషన్) తర్వాత సిద్ధాంతపరమైన రాజకీయాలు, ఆలోచనలు, అనుసంధానత తగ్గిపోయింది. సరళీకరణ తర్వాత మాకు ఎంత త్వరగా ఉద్యోగం వస్తుంది.. ఎంత త్వరగా సంపాదిస్తాం అని ఆలోచిస్తున్నారని తెలిపారు. మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు మేమే వాల్ రైటింగ్ చేసేవాళ్లం..జెండాలు కట్టేవాళ్లం.. ప్రదర్శనలకు (ర్యాలీ) వెళ్లేవాళ్లం... మా జేబులోని డబ్బులు ఖర్చుపెట్టుకొని పని చేసేవాళ్లం.. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందని రేవంత్ ప్రశ్నించారు.
గాంధీలది త్యాగాల కుటుంబం
రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరైనా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అయ్యారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ కుటుంబం అంత త్యాగాలు ఎవరు చేశారో చెప్పండి.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారు.. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ పదేళ్లకుపైగా జైలు జీవితం గడిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ప్రధానమంత్రి పదవి స్వీకరించే అవకాశం వచ్చినా వదులుకున్నారు... మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీలకు ఉన్నత స్థానాల్లో అవకాశం ఇచ్చారు... పి.వి.నరసింహారావును ప్రధానమంత్రిని పని చేశారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు వేశాక ఆయన తుగ్లక్ రోడ్డు నుంచి ఇల్లు ఖాళీ చేయిస్తే వెళ్లడానికి ఆయనకు ఇల్లు లేదు.. దేశంలో మూలమూలన ఉన్న ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి.. కానీ అదే ఇందిరమ్మ మనవడికి ఉండడానికి ఒక్క గది లేదు. పైగా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.. ఆ రాష్ట్రం ఏటీఎం.. ఈ రాష్ట్ర ఏటీఎం అని ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోదీ అంటున్నారు.. ఎవరో కార్యకర్త, చిన్నాచితకా నేత అంటే వదిలేయవచ్చు.. గాంధీ కుటుంబానికి తెలంగాణ ఏటీఎం మోదీ అంటున్నారు. అది సరైంది కాదని స్పష్టం చేశారు.
దేశాభివృద్ది అన్ని రాష్ట్రాలు కలిస్తేనే !
అయిదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అని ప్రధానమంత్రి మోదీ చెబుతున్నారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లేకుండా ఎలా అది సాధ్యం అని రేవంత్ ప్రశ్నించారు. మహారాష్ట్ర నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం.. ఆర్థిక రాజధాని. రాజకీయంగా రెండో ప్లేస్‌లో ఉండవచ్చు... మహారాష్ట్ర నుంచి 17 భారీ పెట్టుబడులు గుజరాత్‌కు తరలించారు... ఈ విధానం సరైంది కాదు.. ప్రధానమంత్రి జడ్జిలా ఉండాలి.. ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోకూడదు. నేను ఫుట్‌బాల్ క్రీడాకారుడిని.. రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదు.. ఆయన గుజరాత్ తరఫున ఆడుతున్నారని విమర్శించారు. పెట్టుబడులకు వాతావరణం అనుకూలించాలి.. తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఫార్మాకు అనుకూలం.. ఐటీ, ఫార్మా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు హైదరాబాద్ వైపు చూస్తారు. కానీ వారిని అహ్మదాబాద్ వెళ్లాలని ఒత్తిడి చేస్తే ఎలా..? అని రేవంత్ ప్రశ్నించారు.