Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్ నుంచి ఔట్
Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు.
Indian Young Weightlifter Achinta Sheuli Is In Trouble: భారత యువ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అచింత షూలి(Achinta Sheuli) వివాదంలో చిక్కుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహక శిబిరం కోసం ప్రస్తుతం జాతీయ క్రీడా అకాడమీ(ఎన్‌ఐఎస్) పటియాలలో శిక్షణ పొందుతున్న అచింత , అక్కడి మహిళల వసతి గృహంలోకి రాత్రి పూట చొరబడడంతో అతణ్ని తక్షణం జాతీయ శిబిరం నుంచి తప్పించారు.
22 ఏళ్ల అచింత గురువారం రాత్రి మహిళల హాస్టల్లో ప్రవేశించాడు. అతనిని అదుపులోకి తీసుకున్న రక్షణ సిబ్బంది దీనికి సంబంధించిన వీడియోను అమ్మాయిల వీడియో సాక్ష్యాధారాలను ఉన్నతాధికారులకు అందించారు. దీంతో వెంటనే అతడిపై వేటు పడింది. "ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అతన్ని వెంటనే క్యాంప్ విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించాం. వీడియోను ఢిల్లీలోని సాయ్ ప్రధాన కేంద్ర కార్యాలయంతో పాటు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌కు కూడా పంపాం." అని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఇప్పటికైతే సాయ్ ఎలాంటి విచారణ ప్యానెల్ ఏర్పాటు చేయలేదని అన్నారు.
2022 కామన్వెల్త్ క్రీడల్లో అచింత రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలిచాడు. కానీ ఈ పనితో అచింత ఈ నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. ఆ రకంగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
తొలి నేపాల్ ప్లేయర్ సందీప్ లామిచానే కూడా అప్పట్లో ..
యువ ఆటగాళ్ళు ఇలాంటి తప్పులు చేసి ఆటకు దూరమవ్వటం, జైలుపాలవ్వటం ఇదే మొదలు కాదు. కొద్ది రోజుల క్రితం అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తొలి నేపాల్ ప్లేయర్ సందీప్ లామిచానే(Sandeep Lamichhane)ను దోషిగా తేల్చిన నేపాల్ కోర్టు(Nepal Court).. అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. లామిచానెకు జైలు శిక్ష విధించడంతో నేపాల్ క్రికెట్ సంఘం(Nepal Cricket Board) అతడిపై నిషేధం విధించింది. అత్యాచారం కేసులో దోషిగా తేలి, జైలు శిక్షకు గురైన సందీప్ లామిచానెను ఎలాంటి దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడకుండా సస్పెండ్ చేస్తున్నామని నేపాల్ క్రికెట్ సంఘం వెల్లడించింది. ఖాట్మండు జిల్లా కోర్టులోని ఏకసభ్య ధర్మాసనం 23 ఏళ్ల లామిచానెకు జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది. 2022 ఆగస్టులో ఓ హోటల్ గదిలో తనపై అత్యాచారం చేశాడని లామిచానెపై ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలు మైనర్.
ఈ కేసు విచారణలో జాప్యం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆరోపణల నేపథ్యంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన తర్వాత స్వదేశానికి వచ్చిన లామిచానెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాల అనంతరం నేపాల్ క్రికెట్ బోర్డు అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించింది. తరువాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన లామిచానె.. అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్, 2023 ఆసియాకప్‌లో నేపాల్ జట్టు తరఫున ఆడాడు. కానీ అతడిపై అత్యాచార ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా స్కాట్లాండ్ క్రికెటర్లు.. అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. 2018 వరకూ ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన లమిచానె ఆ తర్వాత నేపాల్‌కు వలసవెళ్లాడు. వన్డేలలో అత్యంత వేగంగా 50వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. నేపాల్ తరఫున 51వన్డేలు, 52టి20లు ఆడిన లమిచానె.. వన్డేలలో112 వికెట్లు, టీ20లలో 98 వికెట్లు పడగొట్టాడు.