Sakshi Malik: రెజ్లింగ్‌కు సాక్షి మలిక్ కన్నీటి వీడ్కోలు, కారణమేంటంటే!
Sakshi Malik: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ అనుచరుడు. తమ పోరాటానికి విలువ లేకుండా పోయిందంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్న రెజ్లర్లు. రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మలిక్ .
ఇక బరిలోకి దిగటం తన వల్ల కాదంటూ భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ (Sakshi Malik) కెరియర్‌కు వీడ్కోలు పలికింది. అయితే అది ఆడలేకో, ఓటమి భయంతోనో కాదు. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) కొత్త అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) ఎన్నిక అవటమే ఆమె ఇటువంటి సంచలన నిర్ణయానికి కారణం. సంజయ్ సింగ్ ఎన్నిక జరిగిన కొద్ది సమయం తరువాత కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్‌గా క్రీడాకారిణిలను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ అనుచరుడు సంజయ్‌సింగ్ ఎన్నికవడంతో సాక్షి ఈ నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ సమాఖ్యకు జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి , కామన్‌వెల్త్ స్వర్ణ పతక విజేత అనితా షెరాన్‌పై యూపీకి చెందిన సంజయ్ అలవోకగా గెలిచారు. . సంజయ్‌కు 40 ఓట్లు రాగా అనితకు ఏడు ఓట్లు మాత్రమే లభించాయి. అలాగే అనిత వర్గానికి చెందిన ప్రేమ్‌చంద్ కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నారు. మొత్తంమీద 15 స్థానాల్లో 13 స్థానాలను సంజయ్ వర్గం తన ఖాతాలో వేసుకుంది.
అయితే సంజయ్‌సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికవడాన్ని రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా 40 రోజుల పాటు రోడ్లపై ధర్నాలు చేపట్టామని, ఆ సమయంలో తమకు దేశవ్యాప్తంగా ప్రజలు అండగా నిలిచారని మీడియా సమావేశంలో వీరు గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ బిజినెస్ అనుచరుడు విజయం సాధించాడని.. అందుకే తాను క్రీడల వదిలేస్తున్నట్లు ఈ సందర్భంగా సాక్షీ మాలిక్ పేర్కొన్నారు. ఇకపై తాను మళ్లీ తాను బరిలోకి దిగబోనని ప్రతిజ్ఞ చేస్తూ షూస్‌ను టేబుల్‌పై పెట్టి మధ్యలోనే కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వెళ్లిపోయారు. తాము ఎవరిపై పోరాడామో వారి అనూచారులే తిరిగి అధ్యక్ష పదవిలోకి రావడాన్ని సమర్థించబోమని బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ పేర్కొన్నారు. తాము మహిళా అధ్యక్షురాలు కావాలని డిమాండ్ చేశామనీ, అధ్యక్షురాలు మహిళ అయితే ఇటువంటి వేధింపులు జరిగేవి కావన్నారు. ఇంతకుముందు మహిళల భాగస్వామ్యం ఉండేది కాదు, ఇప్పుడు కూడా ఆ వర్గం ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేదన్నారు.. తాము ఇప్పటివరకు పూర్తి శక్తితో పోరాడాం, ఇకపై కూడా పోరాడతాం అన్నారు. అలాగే కొత్త తరం కుస్తీ యోధులు కూడా బరిలోనే కాదు ఇక్కడ కూడా పోరాడాలన్నారు.
గతంలో ఏం జరిగిందంటే..
గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్.. తమను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో బజరంగ్, వినేశ్, సాక్షి మాలిక్ వంటి స్టార్ రెజర్లు జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు నాయకత్వం వహించారు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పలువురు రెజ్లర్ లను లైంగికంగా వేధించారని, అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వారు నిరసనను విరమించారు. ఈ క్రమంలో పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ సస్పెండ్ చేసి.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సహాయకుడు లేదా బంధువు ఎవరూ రెజ్లింగ్ సంస్థ తదుపరి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడరని కూడా రెజ్లర్లకు హామీ ఇచ్చింది. దీంతో బ్రిజ్ భూషణ్ కుమారుడు ప్రతీక్, అల్లుడు విశాల్ సింగ్ ఎన్నికల పోటీలో పాల్గొనలేదు. అతని సహాయకుడు సంజయ్ సింగ్ నామినేషన్ మాత్రం క్లియర్ అయ్యింది.