Olympics Boxing Semifinal: బాక్సర్ లవ్లీనాకు కాంస్యం... 3వ బాక్సర్‌గా రికార్డు... టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు 3వ పతకం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ కాంస్య పతకం సాధించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ కాంస్య పతకం సాధించింది. దీంతో ఆమె ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. 64-69 కిలోల విభాగంలో జరిగిన సెమీస్‌లో ఆమె ఓటమి చవి చూసింది. టర్కీ బాక్సర్, ప్రపంచ ఛాంపియన్ సుర్మెనెలి చేతిలో 0-5 తేడాతో లవ్లానా పరాజయం పాలైంది. మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థి సుర్మెనెలినే ఆధిపత్యం చెలాయించింది. దీంతో లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.
చెప్పినట్లుగానే పతకం తెచ్చింది
టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని పతకం ఖాయం చేసుకుంది బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్(23). సెమీ ఫైనల్లో గెలిచి పతకాన్ని మెరుగుపరుచుకుందామని భావించింది. కానీ, సెమీస్‌లో ఓడటంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆమె సెమీస్‌కు చేరుకోవడంతో అస్సాంలోని ఆమె కుటుంబసభ్యులపై అభినందనల వర్షం కురుస్తోంది.
దేశానికి ఒలింపిక్ పతకం తప్పకుండా తీసుకొస్తానని లవ్లీనా చెబుతుండేదని, ఎంతో నమ్మకంగా ఉండేదని... ఇప్పుడు అది నిజమైనందుకు సంతోషంగా ఉందని లవ్లీనా తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. టోక్యోకు వెళ్లే ముందు కూడా పతకంతోనే తిరిగి ఇంటికి వస్తానని చెప్పినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.
అస్సాం అసెంబ్లీ 30 నిమిషాలు వాయిదా
టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో దూసుకుపోతున్న లవ్లీనా బొర్గొహైన్ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను అస్సాం ప్రభుత్వం 30 నిమిషాలపాటు వాయిదా వేసింది. లవ్లీనా బుధవారం టర్కీకి చెందిన ప్రపంచ ఛాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలితో తలపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను ఉదయం 11 గంటల నుంచి 30 నిమిషాలపాటు వాయిదా వేసింది.
బౌట్ ముగిసిన తర్వాత, అసెంబ్లీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. లవ్లీనా మ్యాచ్ చూసేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక లైవ్ టెలికాస్ట్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా సభలోని సభ్యులందరూ, అసెంబ్లీ సిబ్బంది మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించారు. అస్సాం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణి, అలాగే రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొదటి మహిళా అథ్లెట్ కూడా లవ్లీనే కావడం విశేషం.
బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్‌కు పతకం ఖాయం కావడంతో ఆమె ఊరు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అస్సాంలోని గోల్‌ఘాట్ జిల్లాలో ఉన్న బరోముతియా అనే ఆ గ్రామానికి ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారు. చాలా ఏళ్లుగా దారుణమైన స్థితిలో ఉన్న 3.5 కిలోమీటర్ల మట్టి రోడ్డును పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ బాగు చేసే పనిలో ఉంది. లవ్లీనా ఒలింపిక్స్ నుంచి తిరిగొచ్చేలోపు తారు రోడ్డు వేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బిశ్వజిత్ ఫుకాన్ ఈ రహదారి నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా బొర్గొహైన్ 69 కిలోల విభాగంలో పోటీపడింది. గత నెల 30న జరిగిన క్వార్టర్స్ పోరులో చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్లో బెర్త్ ఖరారు చేసుకుంది. లవ్లీనా కంటే ముందు విజేందర్‌సింగ్, మేరీకోమ్‌లు మాత్రమే బాక్సింగ్‌లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టారు.