IPL 2024, SRH vs KKR Final : ఐపీఎల్ టైటిల్ పోరులో ఇరు జట్ల బలాలివే!
SRH vs KKR Final Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. లీగ్ దశలో పాయింట్స్ టేబుల్‌లో టాపర్లుగా నిలిచిన సన్‌రైజర్స్ , కోల్‌కతాలు టైటిల్ పోరులో కదం తొక్కనున్నాయి.
SRH vs KKR Final strength and weakness of two teams: ఐపీఎల్(IPL) 2024 టైటిల్ సమరానికి హైదరాబాద్- కోల్‌కత్తా సిద్ధమయ్యాయి. లీగ్ దశను తొలి రెండు స్థానాలతో ముగించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) చెన్నైలో కప్పు కోసం తలపడనున్నాయి. అటు హ్యట్రీక్ కొట్టాలని కోల్‌కతా ఉవ్విళ్లూరుతుండగా రెండోసారి కప్పు గెలవాలని సన్‌రైజర్స్ చూస్తోంది. బలాబలాల్లో సమవుజ్జీల్లా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య చెపాక్‌లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
బ్యాటింగే బలం..... బౌలింగ్ ఓకే.....
ఈ సీజన్‌లో అభిమానులు సరికొత్త సన్‌రైజర్స్ జట్టును చూశారు. కమిన్స్ కెప్టెన్ అయ్యాక జట్టు బ్యాటింగ్‌లో దూకుడు జరిగింది. ఈ సీజన్ ఆరంభం నుంచి హైదరాబాద్ దూకుడుకు మారుపేరుగా ఉంటోంది. హెడ్, అభిషేక్, క్లాసెన్‌ల త్రయం ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించేసింది. అయితే ఓపెనింగ్ జోడిపైనే హైదరాబాద్ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీళ్లు త్వరగా ఓటైతే... క్లాసన్ మినహా మిగతావారు పెద్దగా రాణించింది లేదు. మార్‌క్రమ్ ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. క్వాలిఫయర్-2లో రాణించిన రాహుల్ త్రిపాఠి మరోసారి సత్తాచాటాల్సిన అవసరం ఉంది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఫర్వాలేదనిపిస్తున్నా కీలక మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మాద్ నిలకడగా రాణించింది లేదు. సీజన్ మెుదట్లో విఫమలమైన బౌలింగ్ విభాగం చివరి దశకు చేరుకొని సరికి గాడిన పడటం హైదరాబాద్‌కు సానుకూలంశం. నటరాజన్, భువనేశ్వర్, కమిన్స్, జయదేవ్ ఉనద్కత్‌లతో పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది. స్పిన్ విభాగంలో షాబాజ్ మినహా నాణ్యమైన స్పిన్నర్ లేడు. క్వాలిఫయర్-2లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు అభిషేక్ శర్మ, మార్‌క్రమ్ రాణించడం కలిసోచ్చింది. మరి ఫైనల్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. డెక్కన్ ఛార్జర్స్‌కో కలుపుకుంటే హైదరాబాద్ మెుత్తంగా నాలుగో ఫైనల్ ఆడబోతుంది. 2009, 2016 సీజన్లలో కప్పు ముద్దాడిన హైదరాబాద్.... 2018లో తుది మెుట్టుుపై బోల్తా పడింది. కప్పు గెలిచిన రెండు సందర్భాల్లోనూ హైదరాబాద్ జట్టుకు ఆసీస్ ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నారు. ఈసారి కూడా ఆసీస్ ఆటగాడే కెప్టెన్‌గా ఉండడంతో ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతోందని అభిమానులు ఆశిస్తున్నారు.
మూడోసారి... కప్పు అందేనా......
2012,2014లో కప్పు గెలిచిన కోల్‌కతా ఇప్పటి వరకు మరోసారి కప్పును ముద్దాడలేక పోయింది.ఈ సీజన్‌లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగిన కోల్‌కతా అదరగొట్టింది. సాల్ట్ దూరం కావడంతో బ్యాటింగ్ కొంత బలహీనపడినా నరైన్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్, రసెల్, రింకులతో బ్యాటింగ్ ఆర్డర్‌తో ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. సీజన్లో ఎంతో నిలకడగా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన జట్టయిన కోల్‌కతాను ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. పేసర్లు స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఎంత ప్రమాదకరమో చెప్పాల్పిన పని లేదు. కెప్టెన్‌గా రెండు కప్పులు అందించిన గంభీర్ మెంటర్‌గా మరో కప్పు అందించాలని చూస్తున్నాడు.కోల్‌కతాకు కోచ్ చంద్రకాంత్ పండిట్ అయినప్పటికీ.. వ్యూహ రచన అంతా మెంటార్ అయిన గంభీరే చూసుకుంటున్నాడు. ఫైనల్లో గంభీర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాడన్నది ఆసక్తికరం.
స్పిన్ మాయ చేసేది ఎవరు?
చెన్నై చెపాక్ స్టేడియం అనగానే అందరికీ స్పిన్నర్ల ఆధిపత్యమే గుర్తుకు వస్తుంది. ఇక్కడ జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ ఎలా రెచ్చిపోయారో తెలిసిందే. అయితే కోల్‌కతాకు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్న నేపథ్యంలో హైదరాబాద్‌కూ ఇబ్బందులు తప్పవు. రాత్రి మంచు ప్రభావం లేకుంటే స్పిన్నర్లను ఆడడం కష్టమే. మందకొడిగా ఉండే ఈ పిచ్‌పై భారీ షాట్లు ఆడడం కష్టమే. పిచ్‌ను ఏ జట్టు స్పిన్నర్లు సద్వినియోగం చేసుకుంటే వారిదే విజయం.
వర్షం ముప్పు.. రిజర్వ్ డే
ఐపీఎల్-17 ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఆదివారం రాత్రి జల్లులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం అయితే లేదు. ఒకవేళ అలా జరిగినా సోమవారం రిజర్వ్ డే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు.