CSK vs MI: టీనేజర్‌గా ఐపీఎల్‌లో తిలక్ వర్మ రికార్డు! 3 ఫార్మాట్ ప్లేయర్ అంటూ రోహిత్ కితాబు
IPL 2022, Tilak Varma: తిలక్ వర్మపై (Tilak Varma) ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడి మానసిక వైఖరి అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు.
IPL 2022, Tilak Varma: యువ క్రికెటర్ తిలక్ వర్మపై (Tilak varma) ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడి మానసిక వైఖరి అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. అతడికి మూడు ఫార్మాట్లలోనూ రాణించగల సత్తా ఉందని వెల్లడించాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
ఈ సీజన్లో తిలక్ వర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. అరంగేట్రం ఐపీఎల్‌లోనే నిలకడగా బ్యాటింగ్ చేస్తూ అలరిస్తున్నాడు. ఐదు సార్లు ఛాంపియన్ ముంబయిలో మహామహులు విఫలమవుతంటే తిలక్ మాత్రం అదరగొడుతున్నాడు. 12 ఇన్నింగ్సుల్లోనే 40.88 సగటు, 132.85 స్ట్రైక్‌రేట్‌తో 386 పరుగులు చేశాడు. 2017లో ఒక టీనేజర్‌గా రిషభ్ పంత్ సృష్టించిన 366 పరుగుల రికార్డును బద్ధలు కొట్టాడు. 2019లో పృథ్వీ షా (16 ఇన్నింగ్సుల్లో 353), 2014లో సంజూ శాంసన్ (13 ఇన్నింగ్సుల్లో 339) ఆ తర్వాత ఉన్నారు.
'తిలక్ వర్మ తన మొదటి ఐపీఎల్‌లోనే అమేజింగ్‌గా ఆడుతున్నాడు. అంత ప్రశాంతంగా ఉండటం సులభం కాదు. అతడు త్వరలోనే టీమ్‌ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడతాడని అనుకుంటున్నా. అతడికి మంచి టెక్నిక్ ఉంది. టెంపర్‌మెంట్ ఉంది. అత్యున్నత స్థాయిలో ఆటగాళ్లకు కావాల్సింది ఇదే. అతడికి మరిన్ని అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నా. అందులోనూ అతడు పరుగుల దాహంతో ఉన్నాడు. అతడితో మాట్లాడితే పరుగులు చేయాలని ఎంత కసితో ఉన్నాడో, మ్యాచులను విజయవంతంగా ఎలా ముంగిచాలని అనుకుంటున్నాడో తెలుస్తుంది. తిలక్ సరైన దారిలోనే ఉన్నాడు. అతడిలాగే మెరుగై బెటర్ ప్లేయర్‌గా మారాలి' అని రోహిత్ అన్నాడు.
"Kitna bhi score karu, #MumbaiIndians ko jeetana hi hai." 💪
— Mumbai Indians (@mipaltan) May 13, 2022
Tilak tells us the constant mindset he carries into games & why this knock meant more! 🏟️💙#OneFamily #DilKholKe #CSKvMI @TilakV9 MI TV pic.twitter.com/p5GKuYReZO
CSK vs MI మ్యాచ్ ఎలా సాగిందంటే?
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 15.5 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ముంబై ఇండియన్స్ 14. ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి కూడా ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. కేవలం 33 పరుగులకే ఎంఐ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ (34 నాటౌట్: 32 బంతుల్లో, నాలుగు ఫోర్లు), హృతిక్ షౌకీన్ (18: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. విజయానికి కొద్ది దూరంలో షౌకీన్ అవుటయినా... టిమ్ డేవిడ్ (16 నాటౌట్: 7 బంతుల్లో, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు. చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరి మూడు వికెట్లు తీయగా... సిమర్ జిత్ సింగ్, మొయిన్ అలీలకు చెరో వికెట్ దక్కింది.