Virat Kohli: ప్లీజ్! నన్ను అలా పిలవొద్దు, అభిమానులకు కోహ్లీ విజ్ఞప్తి
IPL 2024: తనను కింగ్ అని పిలవొద్దని హోస్ట్ డానిష్ సైత్, అభిమానులను కోహ్లీ కోరారు. కింగ్ అని పిలిపించుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నాడు. దీని గురించి డు ప్లెసిస్‌తో కోహ్లీ మాట్లాడాడు.
Virat Kohli at RCB Unbox event: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్ బాక్స్ 2024 కార్యక్రమం నిర్వహించారు. 2014లో నగరం పేరును Bangalore నుంచి Bengaluruగా స్పెల్లింగ్ మార్చారు. సిటీ పేరు అధికారికంగా మారిపోయినా ఆర్సీబీ జట్టును రాయల్ ఛాలెంజర్స్ Bangaloreగా వ్యవహరిస్తున్నారు. దాంతో కర్ణాటక ప్రజలు బెంగళూరు (Bengaluru)గా మార్చాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇన్ని రోజులకు ఆ విజ్ఞప్తి కార్యరూపం దాల్చింది. ఈ కార్యక్రమంలో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ కోహ్లీ, ఆర్సీబీ మహిళల టీమ్ కెప్టెన్ స్మృతీ మందాన పాల్గొన్నారు. ఆర్సీబీ కొత్త శకం మొదలైందని, ఇక నుంచి తమకు అన్నీ విజయాలేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆర్సీబీ లోగోతో పాటు కొత్త జెర్సీని ఆర్సీబీ ఫ్రాంచైజీ విడుదల చేసింది.
కోహ్లీ విజ్ఞప్తి...
ఐపీఎల్ 2024 మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి అన్‌బాక్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోహ్లీ ఎంట్రీతో చిన్నస్వామి స్టేడియంలో దద్దరిల్లింది. కింగ్ కోహ్లి అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే తనను కింగ్ అని పిలవొద్దని హోస్ట్ డానిష్ సైత్, అభిమానులను కోహ్లీ కోరారు. కింగ్ అని పిలిపించుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నాడు. దీని గురించి డు ప్లెసిస్‌తో కోహ్లీ మాట్లాడాడు. తనను కింగ్ అని పిలవడం మొదట మానాలని సూచించారు. దయచేసి నన్ను విరాట్ అని పిలవండి. నన్ను కింగ్ పదంతో పిలవొద్దని నేను ఫఫ్ డు ప్లెసిస్‌తో చెప్పానని కూడా కోహ్లీ అన్నాడు. తనను అలా పిలిచిన ప్రతిసారి ఇబ్బందిగా అనిపిస్తుందన్నాడు. కాబట్టి తనను విరాట్ అని పిలవాలని.... దయచేసి ఇక నుంచి తనను పిలవడానికి కింగ్ పదాన్ని ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశాడు.
తొలి పోరుకు సిద్ధం
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)లో తొలి మ్యాచ్‌లోనే కొదమ సింహాల పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చెన్నై చెపాక్ స్టేడియంలో కోహ్లీ టీం- ధోనీ టీం ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచులు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు గెలుపొందింది. ఇక్కడ మొత్తం ధోనీ జట్టు మానియానే నడుస్తుంది. మైదానమంతా పసుపుమయంగా మారుతుంది. 2008లో మాత్రమే బెంగళూరు.. చెన్నైని ఓడించింది. ఆ తర్వాత జరిగిన ఏడు మ్యాచుల్లోనూ చెన్నైపై ఆర్సీబీ గెలవలేదు. ఈ రికార్డే ఆర్సీబీ అభిమానులను సీజన్ ప్రారంభానికి ముందు కలవరపెడుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అయిపోవడంతో... అన్నా... ఒక్క టికెట్ ప్లీజ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వేడుకుంటున్నారు.