Sania Mirza: నా రిటైర్ మెంట్ ప్రణాళికలో మార్పు ఉండొచ్చు: సానియా మీర్జా
అంతర్జాతీయ టెన్నిస్ లో 2022 తన చివరి సీజన్ అని చెప్పిన స్టార్ క్రీడాకారిణి సానియా.. ఇప్పుడు అందులో కొంత మార్పు ఉండే అవకాశం ఉందని తెలిపింది. గాయం కారణంగా ప్రణాళికలో మార్పు చేయవచ్చని అభిప్రాయపడింది.
తన రిటైర్ మెంట్ ప్రణాళికలో కొంత మార్పు ఉండే అవకాశం ఉందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ముంజేతి గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు సానియా ప్రకటించింది. ఈ నెలారంభంలో కెనడియన్ ఓపెన్ లో ఆడినప్పుడు 35 ఏళ్ల సానియా గాయపడింది. ఆ తర్వాత కోలుకుని టొరంటోలో జరిగిన సిన్సినాటి ఓపెన్ లో మహిళల డబుల్స్ లో పాల్గొంది. అయితే మరలా ఇప్పుడు గాయపడిన నేపథ్యంలో తన రిటైర్ మెంట్ ప్రణాళికలపై తాజా వ్యాఖ్యలు చేసింది.
అంతర్జాతీయ టెన్నిస్ లో 2022 తన చివరి సీజన్ అని.. ఈ ఏడాది ప్రారంభంలో సానియా ప్రకటించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తన పదవీ విరమణ ప్రణాళికలు మారవచ్చని.. ఆరు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన సానియా తెలిపింది.
ప్లాన్ మారొచ్చు
ముంజేతి గాయం కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరమయ్యానని.. అందుకే యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగానని సానియా చెప్పింది. ఇలా జరిగుండాల్సింది కాదని తెలిపింది. దీనివల్ల తన రిటైర్ మెంట్ ప్రణాళికలో మార్పు ఉండొచ్చని.. ఎప్పటికప్పుడు దీని గురించి వివరాలు తెలియజేస్తానని పేర్కొంది.
తిరిగొచ్చి టైటిల్
డబుల్స్ లో వరల్డ్ మాజీ నెంబర్ వన్ అయిన సానియా మీర్జా.. 2018 జనవరి నుంచి ప్రసూతి సెలవుల్లో ఉంది. మరలా 2020 జనవరిలో తిరిగొచ్చి తన భాగస్వామి ఉక్రెయిన్ కు చెందిన నడియా కిచెనోక్ తో కలిసి హోబర్ట్ టైటిల్ గెలుచుకుంది. అయితే టోక్యో ఒలంపిక్స్ లో అంకితా రైనాతో జోడీ కట్టిన ఈ ఛాంపియన్ అంతగా రాణించలేదు. ఉక్రెనియన్ జంట నడియా-ల్యుడ్మైలా చేతిలో ఓడిపోయి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.
వింబుల్డన్ కు వీడ్కోలు
ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ లో సానియా, ఆమె చెక్ భాగస్వామి లూసీ హ్రాడెకా మూడో రౌండ్లో నాకౌట్ అయ్యారు. క్రొయేషియాకు చెందిన భాగస్వామి మేట్ పావిక్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్ సెమీఫైనల్లో నీల్ స్కుప్స్కీ -డెసిరే క్రావ్జిక్ చేతిలో ఓడిపోయిన తరువాత సానియా వింబుల్డన్ కు వీడ్కోలు పలికింది.
మహిళల టెన్నిస్ లో భారత్ తరఫున సానియా మీర్జా విశేషంగా రాణించారు. ముఖ్యంగా డబుల్స్ లో ఎన్నో టైటిల్స్ అందుకున్నారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత కొంతకాలం ఆటకు విరామం ఇచ్చారు. తిరిగొచ్చాక ఒక్క టైటిల్ మినహా అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 35 ఏళ్ల ఈ టెన్నిస్ ప్లేయర్ రిటైర్ మెంట్ పై ఆలోచన చేశారు. 2022 చివరి సీజన్ అంటూ ప్రకటించిన సానియా గాయం కారణంగా ఇంకా ముందుగానే ఆటకు విరమణ ప్రకటించే అవకాశం ఉంది.