India vs Pakistan Hockey: పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్, అజేయంగా సెమీస్ చేరిన హాకీ టీమ్
IND vs PAK Hockey Asian Champions Trophy 2023: చెన్నై వేదికగా సొంతగడ్డపై బుధవారం జరిగిన హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత జట్టు చిత్తు చేసింది.
IND vs PAK Hockey Asian Champions Trophy 2023 :
ప్రతిష్ఠాత్మక ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాకిస్తాన్ జట్టుపై భారత్ విజయం సాధించింది. చెన్నై వేదికగా సొంతగడ్డపై బుధవారం జరిగిన హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత జట్టు చిత్తు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై 4-0 తేడాతో భారత్ గెలిచింది. దాంతో లీగ్ దశను ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా ముగించింది. భారత్ ఇదివరకే సెమీస్ చేరగా, పాక్ జట్టు వేరే టీమ్స్ ఫలితాలపై ఆధారపడింది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరు జట్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా హాకీ జట్టు మూడు విజయాలు, ఓ డ్రా కలిపి 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉండగా.. నేడు జరిగిన మ్యాచ్ సైతం నెగ్గి ఓటమి లేకుండా లీగ్ ముగించింది. ప్రత్యర్థి పాక్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నేటి మ్యాచ్ తో కలిపి లీగ్ స్టేజ్ లో కేవలం ఒక్క మ్యాచ్ నెగ్గింది. పాక్ మరో రెండు డ్రా చేసుకోగా, ఓ మ్యాచ్ లో ఓటమిపాలైంది. సెమీస్ చేరాలంటే నేటి మ్యాచ్ లో పాక్ కచ్చితంగా విజయం సాధించాల్సి ఉండగా.. కనీసం గోల్స్ ఖాతా కూడా తెరవలేకపోయింది.
హర్మన్ ప్రీత్ సింగ్ 15, 23 నిమిషాలలో గోల్ కొట్టి భారత్ ను అధిక్యంలో నిలిపాడు. 36వ నిమిషంలో గుర్జన్ సింగ్ గోల్ చేయడంతో భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యా్చ్ ముగియడానికి 5 నిమిషాల ముందు మన్ దీప్ సింగ్ మరో గోల్ గొట్టడంతో ప్రత్యర్థి పాక్ పై భారత్ 4-0 గోల్స్ తేడాతో పూర్తి ఆధిక్యం కనబరిచింది. అయితే భారత రక్షణ వ్యవస్థను ఛేదించలేక పాక్ జట్టు మొదట్నుంచీ ఇబ్బంది పడింది. దాంతో కనీసం మ్యాచ్ ముగిసేసరికి ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది. భారత్ చేతిలో ఓటమితో పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినట్లే.