Suryakumar Yadav: ఒక్క భారీ ఇన్నింగ్స్‌తో ఐదుగురి రికార్డులు అవుట్ - సూర్య ఇది చేయగలడా?
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ కొన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.
IND vs NZ 3rd T20I, Suryakumar Yadav Record: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 1వ తేదీన (బుధవారం) జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించి 1-1తో సిరీస్‌లో సమంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లకు చివరి మ్యాచ్ డూ ఆర్ డై అవుతుంది. రెండు జట్లతో పాటు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడడం ద్వారా ఎంతో మంది పెద్ద బ్యాట్స్‌మెన్‌లను దాటగలడు.
సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో మొత్తం ఏడు T20 ఇంటర్నేషనల్‌లు ఆడాడు. ఈ ఏడు మ్యాచ్‌ల్లో అతను 52 సగటు, 151.16 స్ట్రైక్ రేట్‌తో 260 పరుగులు చేశాడు. రెండు జట్ల మధ్య టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ పదో స్థానంలో ఉన్నాడు. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్ ఆడితే రాస్ టేలర్, కేఎల్ రాహుల్, టిమ్ సీఫెర్ట్, విరాట్ కోహ్లీ, బ్రెండన్ మెకల్లమ్‌ల రికార్డులను బద్దలు కొట్టగలడు.
ఇరు జట్ల మధ్య టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగుల స్కోర్‌లో బ్రెండన్ మెకల్లమ్ 261 పరుగులతో తొమ్మిది స్థానంలో, విరాట్ కోహ్లీ 311 పరుగులతో ఎనిమిదో స్థానంలో, టిమ్ సీఫెర్ట్ 322 పరుగులతో ఏడో స్థానంలో, కేఎల్ రాహుల్ 322 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నారు. రాస్ టేలర్ 349 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. 511 పరుగులతో రోహిత్ శర్మ టాప్‌లో కొనసాగుతున్నాడు. తర్వాతి మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా సూర్యకుమార్ యాదవ్ అందరి బ్యాట్స్‌మెన్ రికార్డును బద్దలు కొట్టగలడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు
రోహిత్ శర్మ - 511 పరుగులు.
కోలిన్ మున్రో - 426 పరుగులు.
కేన్ విలియమ్సన్ - 419 పరుగులు.
మార్టిన్ గప్టిల్ - 380 పరుగులు.
రాస్ టేలర్ - 349 పరుగులు.
కేఎల్ రాహుల్ - 322 పరుగులు.
టిమ్ సీఫెర్ట్ - 322 పరుగులు.
విరాట్ కోహ్లీ - 311 పరుగులు.
బ్రెండన్ మెకల్లమ్ - 261 పరుగులు.
సూర్యకుమార్ యాదవ్ - 260 పరుగులు.
సూర్యకుమార్ యాదవ్ 2022లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ప్రత్యేకించి అంతర్జాతీయ టీ20ల్లో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. గతేడాది టీ20లో అత్యధికంగా 1,164 పరుగులు చేశాడు. 2022లో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు చేశాడు.
అతని అద్భుతమైన ప్రదర్శనకు పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది కూడా టీ20లో మెరుపులు మెరిపిస్తున్నాడు. జనవరి 29వ తేదీన లక్నోలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించడంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 26 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు.