IND vs IRE, Match Highlights: హుడా హుద్‌హుద్ తెప్పించినా! టీమ్‌ఇండియాకు హార్ట్ అటాక్ తెప్పించిన ఐర్లాండ్
IND vs IRE, 2nd T20, Malahide Cricket Club Ground: ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు చక్కని పోరాట పటిమ కనబరిచింది.
Sanju Samson and Deepak Hooda created highest T20 partnership for India: ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో మ్యాచులో 4 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లు విధ్వంసకరంగా ఆడినా 225 స్కోరును రక్షించుకుంది. ఐర్లాండ్ ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (40; 18 బంతుల్లో 5x4, 3x6), ఆండీ బాల్‌బిర్నీ (60; 37 బంతుల్లో 3x4, 7x6) దంచికొట్టారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో దీపక్ హుడా (104; 57 బంతుల్లో 9x4, 6x6) అంతర్జాతీయ క్రికెట్లో శతకం అందుకున్నాడు. పునరాగమనంలో సంజు శాంసన్ (77; 42 బంతుల్లో 9x4, 4x6) సత్తా చాటాడు.
భయపడలేదు.. భయపెట్టారు!
ఎదురుగా కొండంత టార్గెట్ ఉన్నా ఐర్లాండ్ భయపడలేదు! పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా చెలరేగింది. ఆ జట్టు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (40), ఆండీ బాల్‌బిర్నీ (60) మెరుపు ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్టిర్లింగ్‌ను ఔట్‌చేసి రవి బిష్ణోయ్ ఆ జోడీని విడదీశాడు. మరో పరుగు వ్యవధిలో గెరాత్ డిలానీ (0) రనౌట్ అయ్యాడు. అప్పటికీ ఆతిథ్య జట్టేమీ ఆగలేదు. హ్యారీ టెక్టార్ (39) దంచికొట్టడంతో 9 ఓవర్లకే స్కోరు 100 రన్స్ దాటేసింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ అందుకున్న బాల్‌బిర్నీని హర్షల్ పటేల్ పెవిలియన్ పంపించాడు. అయితే జార్జ్ డాక్రెల్ (34*; 16 బంతుల్లో 3x4, 3x6), మార్క్ అడైర్ (23*; 12 బంతుల్లో 3x4, 1x6) ఎదురుదాడికి దిగడంతో 18.3 ఓవర్లకే స్కోరు 200 మైలురాయి చేరుకుంది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ఉమ్రాన్ మాలిక్ 12 ఇచ్చి టీమ్‌ఇండియాకు గెలుపు అందించాడు.
ఇద్దరిదీ కసి.. కసి.. కసి!
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 13 వద్దే ఓపెనర్ ఇషాన్ కిషన్ (3) ఔటయ్యాడు. కానీ ఆ తర్వాతే మొదలైంది అసలు ఊచకోత! అంతర్జాతీయ క్రికెట్లో తమ సత్తా చాటాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న దీపక్ హుడా (104), సంజు శాంసన్ (77) చెలరేగారు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడిమరీ బౌండరీలు, సిక్సర్లు బాదేశారు. వీరిద్దరి బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే! మరో ఛాన్స్ లేదన్నట్టుగా దంచికొట్టారు.
సంజు, హుడా కలిసి రెండో వికెట్‌కు 87 బంతుల్లో 176 పరుగుల భాగస్వామ్యం అందించారు. టీమ్‌ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం సృష్టించారు. హుడా 27, సంజు 31 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకోవడంతో 13.3 ఓవర్లకే స్కోరు 150 దాటింది. 16.2వ బంతికి సంజూను అడైర్ బౌల్డ్ చేశాడు. ఆపై వరుస వికెట్లు పడుతున్నా హుడా తగ్గలేదు. 55 బంతుల్లో 100 కొట్టి టీ20ల్లో సెంచరీ బాదేసిన నాలుగో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అతడిని 212 వద్ద లిటిల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఎక్కువ బంతులేమీ లేకపోవడంతో మిగతా వాళ్లు దూకుడుగా ఆడబోయి త్వరగానే ఔటయ్యారు. జట్టు స్కోరును 225/7కు చేర్చారు.
What a thriller we've witnessed 😮#TeamIndia win the 2nd #IREvIND by 4 runs and seal the 2-match series 2️⃣-0️⃣ 👏👏
— BCCI (@BCCI) June 28, 2022
Scorecard ▶️ https://t.co/6Ix0a6evrR pic.twitter.com/6GaXOAaieQ