French Open 2025 Winner: మట్టి కోర్టు రారాజ్ కార్లోస్ అల్కరాస్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం, 43 ఏళ్ల రికార్డులు బద్దలు
French Open 2025 Final | ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్. 43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ జరిగిన ఫైనల్లో సినర్‌పై చారిత్రాత్మక విజయం సాధించాడు అల్కరాజ్.

ఫ్రెంచ్ ఓపెన్‌లో తిరుగులేని ఆటగాడు, స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ వారసుడు అనిపించుకున్నాడు అదే దేశానికి చెందిన కార్లోస్ అల్కరాస్. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ యానిక్ సినర్ (ఇటలీ)పై విజయం సాధించాడు. 4-6, 6-7 (4-7), 6-4, 7-6 (7-3), 7-6 (10-2) తేడాతో సినర్‌పై అల్కరాజ్ అద్భుత విజయాన్ని అందుకున్నాడు. దాంతో వరుసగా రెండో ఏడాది మట్టి కోర్టులో తనకు తిరుగులేదని నిరూపించుకుంటూ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. రఫెల్ నాదల్, గుస్తానో కుయెర్టన్ అనంతరం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెలబెట్టుకున్న ఆటగాడిగా అల్కరాస్ నిలిచాడు.
తొలి రెండు సెట్లు 4-6, 6-7 (4-7) తేడాతో కోల్పోయాక ఇంకేముంది ప్రత్యర్థి సినర్‌దే విజయమని అంతా భావించారు. మూడో సెట్ 6-4తో నెగ్గినా, నాలుగో సెట్లో 3-5 (0-40)తో ఉన్న సమయంలో అల్కరాస్ పుంజుకున్న తీరును మాటల్లో వర్ణించలేం. విజయం కోసం పరితపించిన డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాస్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం వీరోచితంగా తలపడ్డాడు. దాంతో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్ రికార్డు సమయం జరిగింది. ఏకంగా 5 గంటల 29 నిమిషాల పాటు జరగడతో ఈ మట్టి కోర్టు చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా జరిగిన ఫైనల్‌గా అల్కరాస్, సినర్ మధ్య జరిగిన మ్యాచ్ రికార్డులకెక్కింది. అల్కరాస్‌కు ఇది రెండో ఫ్రెండ్ ఓపెన్ టైటిల్ కాగా, కెరీర్‌లో అయిదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఐదు గంటలకు పైగా పోరాటం చేసి ఔరా అనిపించాడు.
Today's roller-coaster final is our Extraordinary Moment by @HaierOfficial 🎢#RolandGarros pic.twitter.com/5Af9R71449
— Roland-Garros (@rolandgarros) June 8, 2025
43 ఏళ్ల రికార్డు బ్రేక్
1982లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ రికార్డు బద్ధలైంది. తాజాగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోరు 5 గంటల 29 నిమిషాల పాటు జరిగింది. గతంలో మాట్స్ విలాండర్ 4 గంటల 47 నిమిషాల పాటు పోరాటం చేసి ప్రత్యర్థి గులెర్మో విలాస్‌పై విజయం సాధించాడు. ఆ రికార్డు 43 ఏళ్లకు అల్కరాజ్, సినర్ బ్రేక్ చేశారు. సినర్‌కు నిరాశే ఎదురుకాగా, అల్కరాజ్ తన టైటిల్ నిలబెట్టుకున్నాడు.
తొలి రెండు సెట్లలో సినర్ జోరు
ఇటలీకి చెందిన సినర్ తొలి రెండు సెట్లను 4-6, 6-7 (4-7)తో వరుసగా నెగ్గాడు. తొలి సెట్ ఈజీగా నెగ్గినా రెండో సెట్లో అల్కరాజ్ ఆట మొదలుపెట్టడంతో కాస్త శ్రమించాడు సినర్. ఇక మూడో సెట్ లో సైతం సినర్ జోరు చూసి అంతా అల్కరాజ్ ఓటమి ఖాయమనుకున్నారు. 5-3తో నిలిచిన సినర్ రెండు పాయింట్లు నెగ్గి సెట్ తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గుతాడనుకున్న సమయంలో అల్కరాస్ పుంజుకున్నాడు. మూడో సెట్ ఇద్దరి పరస్పర బ్రేకులతో ఆసక్తికరంగా సాగినా అల్కరాస్ భిన్నమైన ఆటతీరుతో మూడో సెట్ నెగ్గాడు. 4-1తో అల్కరాస్ ఆధిక్యంలోకి వెళ్లగా.. 9వ గేమ్‌లో సర్వీసు కోల్పోయాడు. తర్వాతి గేమ్‌లోనే బ్రేక్ సాధించి సెట్‌ను గెలుచుకుని ఓటమిని తప్పించుకున్నాడు. అక్కడి నుంచి ఏ దశలోనూ తగ్గకుండా నాలుగు, ఐదు సెట్లలో ట్రై బ్రేకర్ లకు వెళ్లినా పట్టువదలకుండా పోరాడి విజయం సాధించి టైటిల్ నిలబెట్టుకున్నాడు డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాస్.
వరుసగా రెండు సెట్లు ఓడిపోయి టైటిల్ నెగ్గడం అంటే ఆషామాషీ కాదు. కానీ స్పెయిన్ యువ సంచలనం అల్కరాస్ దాన్ని చేసి చూపించాడు. మరోవైపు మార్సెల్ గ్రానోలర్స్ (స్పెయిన్), హొరాసియో జెబలోస్ (అర్జెంటీనా) జోడీ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. 6-0, 6-7 (5), 7-5తో జో సలిస్‌బరీ, నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంటపై విజయం సాధించింది. ఇటలీకి చెందిన సారా ఎరాని, జాస్మీన్ పావోలిని ద్వయం మహిళల డబుల్స్ టైటిల్ సాధించింది. ఫైనల్లో 6-4, 2-6, 6-1తో అలెగ్జాండ్రా క్రునిచ్ (సెర్బియా), అనా దనిలినా (కజకిస్థాన్) జంటపై గెలిచింది.






















