Tim Southee Injury: ప్రపంచకప్ ముంగిట కివీస్‌కు భారీ షాక్ - సర్జరీకే మొగ్గుచూపిన స్టార్ పేసర్
వన్డే వరల్డ్ కప్ ముంగిట న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఆ జట్టు స్టార్ పేసర్ లేకుండానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
Tim Southee Injury: వన్డే వరల్డ్ కప్ దగ్గరపుడుతున్న తరుణంలో న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తప్పేట్టు లేదు. ఆ జట్టు స్టార్ పేసర్ టిమ్ సౌథీ ఈ ప్రపంచకప్ ఆడేది అనుమానంగానే ఉంది. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన సౌథీ త్వరలోనే శస్త్రచికిత్స చేయించుకునేందుకు మొగ్గు చూపడంతో రెండున్నర వారాలు మాత్రమే మిగిలున్న మెగా టోర్నీ వరకు పూర్తిగా కోలుకోగలుగుతాడా..? అన్నది అనుమానంగానే ఉంది.
ఇటీవలే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ సౌథీ కుడిచేతి బొటనవేలికి గాయమైంది. స్కాన్ చేసి చూడగా బొటనవేలి లోపల ఎముక విరిగినట్టు తేలింది. దీంతో సౌథీకి సర్జరీ అనివార్యమైంది. ప్రస్తుతం కివీస్ లోనే ఉన్న సౌథీ త్వరలోనే శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకవేళ అతడు సర్జరీకి వెళ్తే వన్డే వరల్డ్ కప్‌లో ఆడేది అనుమానమే..
కానీ కివీస్ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాత్రం ఇప్పుడే సౌథీ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడని చెప్పలేమని అన్నాడు. అతడికి జరుగబోయే సర్జరీ విజయవంతం కావాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు చెప్పాడు. అయితే వరల్డ్ కప్ ప్రారంభం నాటికి సౌథీ సర్జరీ ముగించుకుని పూర్తి ఫిట్‌నెస్‌తో మ్యాచ్‌లు ఆడతాడని గ్యారీ స్టెడ్ భావిస్తున్నప్పటికీ అది అంత ఈజీ అయితే కాదు. బొటనవేలు విరిగి, సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక బౌలర్ అంత ఈజీగా కోలుకోవడం కష్టమే. అందునా సౌథీ కుడిచేతి వాటం బౌలరే. బంతి గ్రిప్ దక్కాలంటే బొటనవేలే కీలకం. అలాంటిది సర్జరీ చేసుకున్న వారం రోజులకే అతడు బరిలోకి ఎలా దిగుతాడు..? అనేది ఆసక్తికరంగా మారింది.
JUST IN: Tim Southee will undergo surgery on the thumb he dislocated and fractured during the #ENGvNZ ODI series.
— ESPNcricinfo (@ESPNcricinfo) September 20, 2023
A decision on his availability for the World Cup will be taken next week once the results of the surgery are known #CWC23 pic.twitter.com/o3Mpy0edql
వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ అక్టోబర్ 05న మొదలుకానుంది. 2019 వన్డే వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరుగబోయే మ్యాచ్‌తోనే ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. అంతకంటే ముందే కివీస్.. ఈనెల 29న హైదరాబాద్‌లో పాకిస్తాన్‌తో, అక్టోబర్ 2న సౌతాఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.
ఇదిలాఉండగా సౌథీ పూర్తిగా కోలుకోక వరల్డ్ కప్‌కు దూరమైతే మాత్రం అది న్యూజిలాండ్‌కు భారీ షాకే. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇదివరకే కివీస్ ప్రకటించింది. ఇందులో నలుగురు పేసర్లు ఉన్నారు. వీళ్లలో సౌథీ అత్యంత కీలకం. సౌథీ బౌలర్ గానే కాక బ్యాటర్‌గా కొన్ని పరుగులు కూడా రాబట్టగలడు. మరి సౌథీ వరల్డ్ కప్ నాటికి కోలుకుంటాడా..? అన్నది త్వరలోనే తేలనుంది.
వన్డే ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్డ్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాథ్యూ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్