Harpreet Singh Bhatia: చాలా గ్యాప్ వచ్చింది - ఒక్క మ్యాచ్ ఆడి మరొకటి ఆడేందుకు పదేండ్లు పట్టింది - ఎవరీ భాటియా?
IPL 2023: ఐపీఎల్-16లో శనివారం లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ తరఫున ఆడాడు హర్‌ప్రీత్ సింగ్ భాటియా.
Harpreet Singh Bhatia: మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినోళ్లు ఎంతమంది ఉన్నారో.. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక కనుమరుగైన వారూ అంతకు రెట్టింపుస్థాయిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రికెటర్ మాత్రం ఈ రెండు కోవల్లోకి రాడు. తన పేరు వల్ల ఆ క్రికెటర్ కెరీర్ దాదాపు క్షీణించింది. అతడెవరో కాదు.. శనివారం లక్నో వేదికగా ముగిసిన లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో పంజాబ్ తరఫున ఆడిన హర్‌ప్రీత్ సింగ్ భాటియా.
భాటియాకు ఇదే ఐపీఎల్ డెబ్యూ కాదు. ఈ లీగ్‌లో అతడు 2010 లోనే ఎంట్రీ ఇచ్చాడు. కానీ సుమారు పదిన్నర సంవత్సరాల (10 సంవత్సరాల 332 రోజులు) తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడాడు. లక్నో - పంజాబ్‌తో మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్.. 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో సికిందర్ రజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చేసింది 22 పరుగులే అయినా ఆకట్టుకున్నాడు. 2010లోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి పదిన్నర సంవత్సరాల తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడిన భాటియా గురించి ఆసక్తికర విషయాలివిగో..
ఎవరీ హర్‌ప్రీత్ సింగ్ భాటియా..
మధ్యప్రదేశ్‌లోని దుర్గ్ (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) ప్రాంతానికి చెందిన హర్‌ప్రీత్ సింగ్.. 2009లో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతూ దేశవాళీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో ఐసీసీ అండర్ - 19 క్రికెట్ వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో అతడు కూడా సభ్యుడు. ఐపీఎల్ లో భాటియా 2010లోనే ఆడాడు. ఆ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. 2012లో పూణే వారియర్స్‌కు మారిన భాటియా, ఆ ఏడాది మే 19న కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఆరు పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
‘పేరు’ తెచ్చిన తంటా..
హర్‌ప్రీత్ సింగ్ భాటియా ఐపీఎల్ లో ఇన్నాళ్లు కనిపించకుండా ఉండటానికి ఓ ఇంట్రెస్టింగ్ (అతడికి మాత్రం ట్రాజెడీ) స్టోరీ ఉంది. 2012లో ఇండియా అండర్ - 19 క్రికెటర్ హర్మీత్ సింగ్ అనే ఓ క్రికెటర్ ముంబైలోని అంధేరి స్టేషన్ వద్ద కారు నడుపుతూ నిబంధనలను ఉల్లంఘించడంతో చిక్కుల్లో పడ్డాడు. అది అతడి అరెస్టుకూ దారి తీసింది. కానీ ఇందుకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసేప్పుడు కొన్ని వార్తా సంస్థలు.. ‘హర్మీత్ సింగ్’కు బదులుగా ‘హర్‌ప్రీత్ సింగ్’అని రాశాయి. ముఖ్యంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI కూడా తప్పుగా ట్వీట్ చేసింది. ఇది భాటియా ఐపీఎల్, భారత జాతీయ జట్టు ఆశలను దాదాపు ముగించింది. ఈ వార్త దావనంలా వ్యాపించి ఐపీఎల్ ఫ్రాంచైజీలకూ అందింది.
Incident of driving car into Andheri Railwy Stn platform involved U19 cricketer Harmeet Singh,not Harpreet Singh as reported earlier #Mumbai pic.twitter.com/CjeI1rxubT
— ANI (@ANI) February 22, 2017
2013 సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో హర్‌ప్రీత్ సింగ్ కూడా పేరిచ్చాడు. కానీ వేలంలో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా అతడిని కొనడానికి సాహసించలేదు. అయితే తర్వాత అసలు విషయం తెలిసి ఓ ఫ్రాంచైజీ ఓనర్ మాట్లాడుతూ.. ‘వాస్తవానికి మేము అతడి (హర్‌ప్రీత్)ని వేలంలో కొనుగోలు చేయాలనుకున్నాం. కానీ హర్‌ప్రీత్ అరెస్టు వార్తలతో అతడిని కొంటే అది ఫ్రాంచైజీకి బ్యాడ్ ఇమేజ్ వస్తుందని మేం ఆ పని చేయలేకపోయాం. కానీ వేలం ముగిసిన తర్వాత అసలు విషయం తెలిసింది...’ అని గతంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పాడు.
నన్ను బద్నాం చేశారు : భాటియా
ఆ సమయంలో హర్‌ప్రీత్ మానసికంగా చాలా కుంగిపోయాడు. హర్‌ప్రీత్ విషయంలో ANI తర్వాత తన తప్పు తెలుసుకుని జరిగింది చెప్పి వివరణ ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని భాటియా వాపోయాడు. వివరణ ఇచ్చినంత మాత్రానా తనకు జరిగిన నష్టాన్ని ఎవరు పూరిస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. 2013లో భాటియా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘నేను ఐపీఎల్ గురించి మాట్లాడటం లేదు. అది పోయింది. ఇప్పటికీ మీరు నా పేరును గూగుల్ లో వెతికితే నా పేరు మీద వచ్చే మొదటి సెర్చ్ నన్ను అరెస్టు చేశారనే వస్తుంది..’అని చెప్పాడు.
10 years and 332 days later, Harry Paaji is back in the middle in the IPL! ❤
— Punjab Kings (@PunjabKingsIPL) April 15, 2023
Sadda 🦁 @HarpreetCricket makes his #PBKS debut. 👏🏻#LSGvPBKS #JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL pic.twitter.com/HApMEKu93K
ఏదేమైనా 3,981 రోజుల తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడిన భాటియా .. తన అనుభవంతో సికందర్ రజాకు సహకరించి పంజాబ్ విషయంలో కీలక భూమిక పోషించడం శుభపరిణామం. వాస్తవానికి భాటియా 2017లో ఆర్సీబీ అతడిని తీసుకున్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. 2022 ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్.. భాటియాను రూ. 40 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటికైనా అతడి కెరీర్ ఊపందుకుంటే అది అతడికి కొంతలో కొంతవరకైనా మేలు చేసేదే.