SL Vs BAN: టైమ్డ్ అవుట్ ఓ సిగ్గుమాలిన చర్య, షకీబుల్‌పై మాథ్యూస్ ఆగ్రహం
ODI World Cup 2023: 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్‌డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
ఢిల్లీ: 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి శ్రీలంక(Sri Lanka) క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్(Angelo Mathews) టైమ్‌డ్ ఔట్(Timed Out)గా పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక, బంగ్లాదేశ్(Bangladesh) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. రెండు నిమిషాల్లోగా అతను బంతిని ఎదుర్కోకపోవడంతో మాథ్యూస్‌ను అంపైర్లు టైమ్ ఔట్‌గా ప్రకటించారు. దీంతో అతడు ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతవరకూ ఏ ఒక్క బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వలేదు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan).. మాధ్యూస్‌ను టైమ్డ్ అవుట్ అంటూ అప్పీల్ చేశాడు. అంపైర్లు రెండుసార్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని కోరినా షకీబుల్ హసన్ నిరాకరించడంతో ఏంజెలో మాధ్యూస్ కోపంగా పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు ఈ ఘటనపై మాథ్యూస్ స్పందించాడు. బంగ్లాదేశ్ కాకుండా మరే ఇతర జట్టు మైదానంలో ఉన్నా ఇలా టైమ్డ్ అవుట్ కోసం అప్పీల్ చేసి ఉండేది కాదని అన్నాడు.
తన టైమ్డ్ అవుట్‌పై స్పందించిన ఈ శ్రీలంక ఆల్‌రౌండర్.. బంగ్లా కాకుండా మరే జట్టైనా టైమ్డ్ అవుట్‌కు అప్పీల్ చేసి ఉండేది కాదని అన్నాడు. ఈ అవుట్ తర్వాత ఏంజెలో మాథ్యూస్... మ్యాచ్ జరుగుతున్నంత సేపు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్‌పై చాలా అసహనం ప్రదర్శించాడు. మ్యాచ్ తర్వాత విలేకరులతో మాట్లాడిన మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదంపై స్పందించాడు. బంగ్లాదేశ్ జట్టును, షకీబుల్ హసన్‌ను తాను చాలా గౌరవిస్తానని... తానైతే అలా టైమ్డ్ అవుట్‌కు అప్పీల్ చేసే వాడిని కాదని హసన్ అన్నాడు. ఇది చాలా సిగ్గుమాలిన చర్య అని, మరేదైనా జట్టు ఉండి ఉంటే అసలు అలా చేసి ఉండేదే కాదని ఏంజెలో మాథ్యూస్ అన్నాడు. షకీబ్‌పై మాథ్యూస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా క్రికెట్ ఆడటం సిగ్గుచేటన్నాడు. తాను కావాలని సమయం వృథా చేయలేదని, తాను సమయానికే క్రీజులోకి వచ్చానని... అది అందరూ చూశారని, కానీ తన హెల్మెట్ పట్టీ విరిగిపోవడంతో బాల్‌ను ఎదుర్కొనేందుకు ఆలస్యమైందని మాథ్యూస్ తెలిపాడు.
హెల్మెట్ పాడవ్వడంతోనే తాను బంతిని ఎదుర్కొనేందుకు ఆలస్యమైందని మాథ్యూస్ తెలిపాడు. షకీబ్, బంగ్లాదేశ్‌ల చర్య సిగ్గుచేటన్నాడు. నేను నిర్ణీత సమయం కంటే ఐదు సెకన్ల ముందే క్రీజులోకి వచ్చానని మాథ్యూస్ తెలిపాడు. అప్పీల్‌ను ఉపసంహరించుకోవాలని తాను షకీబ్‌ను కోరానని... కానీ అతను స్పష్టంగా దానిని తిరస్కరించాడని మాథ్యూస్ తెలిపాడు. తాను సమయానికే క్రీజులోకి వచ్చాననేందుకు తమ వద్ద వీడియో రుజువు కూడా ఉందన్నాడు. తన హెల్మెట్‌లో సమస్య ఉంటే దానికి తాను ఏమీ చేయలేనని.. ఎందుకంటే ఇది ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన ప్రశ్న అని మాథ్యూస్ అన్నాడు. స్పిన్నర్ అయినా హెల్మెట్ లేకుండా తాను ఎలా ఆడతానని ప్రశ్నించాడు.
42 బంతుల్లో 41 పరుగులు చేసిన సదీర సమరవిక్రమ(Sadeera Samarawickrama)ను షకీబ్ అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కి వచ్చాడు. మైదానంలోకి అడుగుపెట్టే సమయంలో మాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ విరిగిపోయింది. అతడు కొత్త హెల్మెట్ కోసం డ్రెస్సింగ్ రూం వైపు సిగ్నల్ ఇచ్చాడు. అలా అతడు క్రీజులోకి రావడం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే బంగ్లా జట్టు ‘టైమ్‌డ్ ఔట్’ కోసం అప్పీల్ చేసింది. ఆ అప్పీల్‌ను పరిశీలించిన అంపైర్.. మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. హెల్మెట్ బాగా లేని కారణంగా ఆలస్యమైందని మాథ్యూస్ వాదించినప్పటికీ.. అంపైర్లు ఔట్ ఇచ్చేశారు. దీంతో క్రీజులోకి రాకముందే అతడు ఔటై పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.