India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 22 స్వర్ణాలతో 61 పతకాలు సాధించింది.
బర్మింగ్‌హామ్‌లో 11 రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022 ముగిశాయి. CWG 2022 పతకాల పట్టికలో భారత బృందం నాలుగో స్థానంలో నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో భారత్ మొత్తం 61 పతకాలతో (22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలు) తన కామన్వెల్త్ గేమ్స్ ప్రస్థానాన్ని ముగించింది.
రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో భారత్ అత్యధిక పతకాలు సాధించింది. రెజ్లింగ్‌లో 12, వెయిట్‌లిఫ్టింగ్‌లో 10 పతకాలు భారత్‌కు దక్కాయి. బలమైన ఆస్ట్రేలియా 178 పతకాలు (67 స్వర్ణాలు, 57 రజతాలు, 57 కాంస్య పతకాలు) గెలుచుకోవడం ద్వారా CWG 2022 పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లాండ్ (176), కెనడా (92) ఉన్నాయి.
పతకాల పరంగా కామన్వెల్త్ గేమ్స్ 2018 రికార్డును బద్దలు కొట్టడంలో భారత్ విఫలమైంది. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2018 ఎడిషన్‌లో భారత్ మొత్తం 66 పతకాలను గెలుచుకుంది. ఆ గేమ్స్‌లో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత్ తన 200వ స్వర్ణాన్ని గెలుచుకోగలిగింది.
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు భారత్‌కు 200వ బంగారు పతకాన్ని అందించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఇప్పుడు మొత్తం 203 బంగారు పతకాలు ఉన్నాయి. ముఖ్యంగా గత ఆరు కామన్వెల్త్ గేమ్స్ (1998 నుంచి 2018 వరకు)లో భారతదేశ ప్రదర్శనను పరిశీలిస్తే, 2010 కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్ టీమిండియాకు అత్యుత్తమ ప్రదర్శన. న్యూఢిల్లీలో జరిగిన క్రీడల్లో భారత బృందం 101 పతకాలు సాధించింది.
CWG 2022 చివరి రోజున భారత్ 6 పతకాలను గెలుచుకుంది. ఇందులో 4 స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉన్నాయి. బ్యాడ్మింటన్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ సింగిల్స్‌లో స్వర్ణం సాధించగా, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ స్వర్ణం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో టెన్నిస్ క్రీడాకారులు ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖర్ వరుసగా స్వర్ణం, కాంస్య పతకాలు సాధించారు. భారత పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
View this post on Instagram