BWF World Championships 2022: పీవీ సింధు! నీ మెరుపుల్లేని ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఏం బాగుంటుంది!!
PV Sindhu: పీవీ సింధు! ప్రపంచం మెచ్చిన షట్లర్! అంతర్జాతీయ స్టార్లకు సులువుగా షాకులిచ్చేస్తుంటుంది. అందుకే బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆమె దూరమవ్వడం తీరని లోటు!
BWF World Championships 2022: పీవీ సింధు! ప్రపంచం మెచ్చిన షట్లర్! ప్రత్యర్థుల పాలిట కిల్లర్! ఇండియన్స్ అమితంగా ఇష్టపడే ప్లేయర్! ఆమె ఆడితే దేశమంతా ఎగిరి గంతులేస్తుంది. ఆమె పతకం గెలవడం సర్వ సాధారణమే అని తలుస్తుంది. ఆమె ఓడితే మనసులు గెలిచావని సరిపెట్టుకుంటుంది. సూపర్ 200, సూపర్ 300తో పోలిస్తే మెగా టోర్నీల్లో ఆమె ఆట మరింత రాటుదేలుతుంది. అంతర్జాతీయ స్టార్లకు సులువుగా షాకులిచ్చేస్తుంటుంది. అందుకే బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆమె దూరమవ్వడం తీరని లోటు!
కామన్వెల్త్‌లో జోరు
కొన్ని రోజుల క్రితమే ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధు (PV Sindhu) అదుర్స్ అనిపించింది. మహిళల సింగిల్స్‌లో స్వర్ణం ముద్దాడింది. మెగా టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. శతకోటి భారతీయులను మురిపించింది. అయితే ఈ పతకం వెనక అకుంఠిత దీక్ష, పట్టుదల దాగున్నాయి. క్వార్టర్ ఫైనల్ నుంచే ఆమె కాలి మడమ నొప్పెడుతున్నా అలుపెరగని పోరాటం చేసింది. ఎంతో ఇబ్బంది పడుతున్నా, దూకుడుగా కదల్లేకున్నా నొప్పి నివారణ మందులు వాడి ముందుకు సాగింది. ఫిజియోలు, ట్రైనర్ల సహకారంతో సెమీస్, ఫైనల్ గెలిచేసింది.
కాలి మడమలో గాయం
బర్మింగ్ హామ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే పీవీ సింధు వైద్యుల వద్దకు వెళ్లింది. అవసరమైన ఎక్స్‌రేలు, స్కానింగులు తీయించుకుంది. కాలి మడమలో చిన్న చీలిక వచ్చిందన్న వైద్య నిపుణులు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో తనకెంతో ఇష్టమైన, ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి తప్పుకుంది. 'కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన సంతోషంలో ఉన్నప్పటికీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలగుతున్నా. క్వార్టర్ ఫైనల్ నుంచే నేను ఇబ్బంది పడ్డాను. కోచులు, ఫిజియోల సాయంతో స్వర్ణం గెలిచాను. హైదరాబాద్ వచ్చాక వైద్యుల్ని కలిశాను. స్కానింగ్‌లో ఎడమకాలి మడమలో స్ట్రెస్ ఫ్రాక్చర్ వచ్చిందన్నారు. కొన్నాళ్లు విశ్రాంతి అవసరం అన్నారు. త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తాను' అని సింధు ట్వీట్ చేసింది.
ఐదు పతకాల వనిత
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పీవీ సింధుకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మహిళల సింగిల్స్‌లో ఆమె ఏకంగా ఐదు పతకాలు గెలిచి సరికొత్త రికార్డులు సృష్టించింది. 2013, 2014లో కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. 2017 ఫైనల్లో ఆమె నజోమి ఒకుహరతో నువ్వేనేనా అన్న రీతిలో ఫైట్ చేసింది. స్వల్ప తేడాతో స్వర్ణం మిస్ చేసుకుంది. 19-21, 22-20, 20-22 తేడాతో రన్నరప్‌గా నిలిచి రజతం ముద్దాడింది. 2018 ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో 19-21, 10-21 తేడాతో ఓడటంతో రజతం అందుకుంది. 2019లో ఆమె అత్యుత్తమ ఆటను బయటకు తీసుకొచ్చింది. అత్యంత తెలివైన, టెక్నికల్‌గా బలమైన నజోమీ ఒకుహరను 21-7, 21-7 తేడాతో చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. సగర్వంగా స్వర్ణ పతకం ధరించింది.
View this post on Instagram