AIFF Ban: భారత్‌పై నిషేధాన్ని ఎత్తేసిన ఫిఫా- ఇండియాలోనే అమ్మాయిల ఫుట్‌బాల్ ప్రపంచకప్
భారత్ లోని ఫుట్ బాల్ ప్రియులకు శుభవార్త. ఏఐఎఫ్ ఎఫ్ పై విధించిన నిషేధాన్ని ఫిఫా ఎత్తేసింది. దీంతో అండర్-17 అమ్మాయిల ప్రపంచకప్ భారత్ లోనే జరగనుంది.
అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ ఎఫ్)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. ఫిఫా డిమాండ్లకు తగ్గట్లుగా ఏఐఎఫ్ ఎఫ్ చర్యలు తీసుకోవటంతో ఈ నిషేధం తొలగిపోయింది. పాలకుల కమిటీ(సీఓఏ)ను సుప్రీంకోర్టు రద్దు చేయడం, సమాఖ్యపై నియంత్రణ ఏఐఎఫ్ ఎఫ్ చేతికి రావటంతో ఫిపా బ్యూరో మండలి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం అండర్-17 అమ్మాయిల ప్రపంచకప్ భారత్ లోనే జరగనుంది.
ఏఐఎఫ్ ఎఫ్ కు కొత్త నియమావళి ఏర్పాటుతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సుప్రీంకోర్టు గతంలో సీఓఏను నియమించింది. అది సమర్పించిన నియమావళి ముసాయిదాలో, ఎన్నికల నిర్వహణలో ఫిఫా కొన్ని అభ్యంతరాలు చెప్పింది. అయితే సీఓఏ పట్టించుకోకపోవటంతో.. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో ఈనెల 16న ఏఐఎఫ్ ఎఫ్ పై ఫిఫా నిషేధం విధించింది. అండర్-17 ప్రపంచకప్ ను భారత్ లో నిర్వహించబోమని తెలిపింది. దీంతో ఈ నిషేధాన్ని తొలగించేలా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆ శాఖ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టుల సీఓఏను రద్దు చేసింది. దీంతో ఫిఫా నిషేధాన్ని ఎత్తివేసింది.
ప్రణాళిక ప్రకారం అండర్-17 అమ్మాయిల ప్రపంచకప్ అక్టోబర్ 11-30 తేదీల్లో భారత్ లోనే జరుగుతుందని ఫిఫా తెలిపింది. బ్యూరో మండలి ఏఐఎఫ్ ఎఫ్ పై నిషేధాన్ని వెంటనే తొలగించాలని నిర్ణయించిందని చెప్పింది. ఏఐఎఫ్ ఎఫ్ కు ఎన్నికల నిర్వహణపై తదుపరి చర్యల గురించి త్వరలోనే చర్చిస్తామని ఫిఫా వెల్లడించింది.
FIFA lifts suspension of All India Football Federation
— FIFA Media (@fifamedia) August 26, 2022
More here 👉 https://t.co/GV7VBP7TC9 pic.twitter.com/tfGdy9UrnK
"ఏఐఎఫ్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలను చేపట్టేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌ను రద్దు చేసినట్టు ఫిఫా ప్రకటించింది. ఏఐఎఫ్‌ఎఫ్ పరిపాలన, రోజువారీ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది." అని అధికారిక ప్రకటనలో తెలిపింది.
"ఏఐఎఫ్‌ఎఫ్, ఏఎఫ్‌సీ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటాయి. ఏఐఎఫ్‌ఎఫ్ ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి ప్రయత్నిస్తాయి." అని పేర్కొంది.
ఈ మధ్య కాలంలో ఇతరుల ప్రభావంతో నడుస్తున్న ఏఐఎఫ్‌ఎఫ్ అధికారాలను సస్పెండ్ చేస్తున్నట్టు ఫిపా ప్రకటించింది. U-17 మహిళల ప్రపంచ కప్ ప్రణాళిక ప్రకారం భారత్ నిర్వహించడం లేదని పేర్కొంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఫిఫా 85 ఏళ్ల చరిత్రలో ఏఐఎఫ్‌ఎఫ్‌ని మొదటిసారి నిషేధించింది.