Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు ఒలింపిక్ బెర్తు , వరుసగా మూడోసారి ఘనత
Asian Wrestling Olympic Qualifiers: ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్ లో చెలరేగి 50 కిలోల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ బర్త్ దక్కించుకుంది భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ .
Vinesh Phogat secures Paris 2024 quota in womens 50kg event: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) వరుసగా మూడోసారి ఒలింపిక్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆసియా ఒలింపిక్స్ అర్హత పోటీల్లో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకోవడం ద్వారా వినేశ్ పారిస్ ఒలింపిక్స్ బెర్తును ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో లారా గనికీజీపై 10-0తో ఘన విజయం సాధించి వినేశ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే 53 కిలోల విభాగంలో అంతిమ్ పంగల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో భారత మహిళ రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. 2016 రియో గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న వినేశ్.. వరుసగా మూడోసారి ఒలింపిక్ బెర్తు సాధించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమంలో వినేశ్ కీలక పాత్ర పోషించింది.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ పైనా ఆరోపణలు..
సరిగ్గా వారం రోజుల క్రితం వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు సంజయ్ సింగ్(Sanjai Singh)పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు, తన సహాయ సిబ్బందికి అనవసరమైన అడ్డంకులు కలిగించడం ద్వారా తాను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్(Asian Olympic qualifying tournament) పోటీల్లో తాను పాల్గొనకుండా అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారన్నారు. తనను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమోనని భయంగా ఉందన్నారు.
రానున్న పారిస్ ఒలింపిక్స్‌లో తను ఆడకుండా అడ్డుకునేందుకు మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ , ఆయనకు డమ్మీగా ఉన్న సంజయ్ సింగ్‌లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. అక్కడ కోచ్‌లుగా నియమితులైన వారందరూ బ్రిజ్ భూషణ్ కు సన్నిహితులే అని, తనాపై ఉన్నకోపంతో మ్యాచ్ మధ్యలో ఇచ్చే తాగునీటిలో ఏదైనా కలిపి ఇచ్చే అవకాశం ఉందంటూ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. డోపింగ్ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని తాను భావిస్తున్నానన్నారు.
కిర్గిజ్‌స్థాన్‌లో జరగనున్న ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో కోసం తన వ్యక్తిగత కోచ్, ఫిజియోలకు అక్రిడిటేషన్‌లు నిరాకరించారని వినేశ్ చెబుతున్నారు. ఇందుకోసం సుమారు నెల రోజులుగా తాను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అయితే ఈ విషయంపై వినేశ్ ఆరోపణలను ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. ఎంట్రీలను పంపడానికి గడువు ముగిసిందని, వినేష్ అభ్యర్థన మెయిల్ మార్చి18న వచ్చిందని, అయితే అప్పటికే ప్లేయర్లు, కోచ్‌లు మరియు వైద్య సిబ్బంది ఎంట్రీలను వరల్డ్ గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కి పంపేసినట్టు తెలిపింది.
లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ తదితర రెజ్లర్లు తీవ్రంగా పోరాడారు. బ్రిజ్ భూషణ్ రాజీనామా తరువాత ఇటీవల డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ విషయంపై కూడా వీరు వ్యతిరేకంగా స్పందించారు. గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్స్(2019, 2022)లో ఫోగట్ 53 కిలోల విభాగంలో కాంస్య పతకంతో మెరిసింది. అంతేకాదు 2018 ఆసియా క్రీడల్లో 50 కిలోల విభాగంలో పోటీపడిన ఆమె ఏకంగా స్వర్ణ పతకం సాధించింది.