Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం, ఏ క్రీడలో అంటే?
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. సోమవారం 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. సోమవారం 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. 2023 ఆసియా క్రీడల్లో 2 భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఎయిర్‌రైఫిల్ పోటీల్లో రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ బృందం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్‌తో కూడిన బృందం ఫైనల్‌లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది.
10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్ మూడో స్థానం, తోమర్ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మెన్స్ ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది. ఆసియా పోటీల్లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. తొలి రోజు ఆదివారం భారత్‌కు ఐదు పతకాలు దక్కిన సంగతి తెలిసిందే. వీటిలో రోయింగ్‌లో రెండు రజతాలు, ఓ కాంస్యం.. షూటింగ్‌లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి.
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని షూటర్లు అందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రమిత జిందాల్, మెహులీ ఘోష్, ఆషి చోక్సీలతో కూడిన భారత త్రయం రజత పతకం సాధించింది. 1886 పాయింట్ల స్కోరుతో రెండో స్థానానికి పరిమితమైంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రమిత 631.9, మెహులీ 630.8, చోక్సీ 623.3 పాయింట్లు స్కోరు చేశారు. ఓవరాల్‌గా రెండో స్థానంతో పతకం దక్కించుకున్నారు. 1896.60 పాయింట్లతో స్వర్ణం నెగ్గిన చైనా టీమ్ ఆసియా క్రీడల రికార్డును అధిగమించింది. మంగోలియా కాంస్యం దక్కించుకొంది.
టీమ్ ఈవెంట్‌లో రజతం నెగ్గిన రమిత.. 10 మీ. ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్‌లోనూ పతకంతో మెరిసింది. ఫైనల్లో రమిత 230.1 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకొంది. చైనా షూటర్లలో హువాంగ్ యుటిన్ (252.7 పాయింట్లు) ఆసియా రికార్డుతో స్వర్ణం నెగ్గగా.. హన్ జియాయు (251.3) రజతం దక్కించుకొంది. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ మెహులీ (208.43) నాలుగో స్థానంతో నిరాశపర్చింది.
రాణించిన రోయర్లు
పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్లో అర్జున్ లాల్ జాట్-అరవింద్ సింగ్ జంట 6:28.18 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. చైనా ద్వయం 6:23.16 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా.. ఉజ్బెకిస్థాన్ జోడీ 6:33.42 సెకన్లతో కాంస్యం దక్కించుకొంది. కాక్స్‌డ్ ఎయిట్ టీమ్ ఈవెంట్‌లో చైనాకు గట్టిపోటీ ఇచ్చిన భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నీరజ్, నరేక్ష్ కల్వానియా, నీతిష్ కుమార్, చరణ్‌జీత్ సింగ్, జస్వీందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశీష్‌లతో కూడిన భారత జట్టు 5:43.01 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలినిచింది. చైనా 5:40.17 సెకన్లతో స్వర్ణం సాధించింది. ఇండోనేసియా మూడో స్థానం దక్కించుకొంది.
పురుషుల కాక్స్‌లెస్ పెయిర్ ఈవెంట్ ఫైనల్లో బాబులాల్ యాదవ్-లేఖ్ రామ్‌తో కూడిన భారత జంట 6:50.41 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం సాధించింది. హాంకాంగ్ స్వర్ణం దక్కించుకోగా, ఉజ్బెకిస్థాన్‌కు రజతం సాధించింది. మొదటి రోజు పోటీల్లో ఆతిథ్య చైనా 20 స్వర్ణాలు సహా మొత్తం 30 పతకాలతో టాప్‌లో ఉంది. 14 పతకాలతో కొరియా (5 స్వర్ణం), జపాన్ (2 స్వర్ణం) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.