Venu Gopala Swamy Temple: శౌర్య ప్రతాపాలకు ప్రతీకగా నిలిచే గడ్డపై రుక్మిణీ, సత్యభామ సమేతంగా కొలువైన కన్నయ్య
శ్రీ కృష్ణుడి ఆలయాలు అనగానే మధుర, బృందావనం, ద్వారక అని చెప్పుకుంటాం..అయితే మన చుట్టుపక్కల రాష్ట్రాలు, జిల్లాల్లో కూడా చాలా విశిష్టమైన ఆలయాలున్నాయి..వాటిలో ఒకటి బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం..
Venu Gopala Swamy Temple Bobbli: దేశంలో అరుదైన దేవాలయాలకు నిలయం ఉత్తరాంధ్ర. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్యదేవాలయం, విశాఖ జిల్లా సింహాచలంలో లక్ష్మీ నారసింహస్వామి, శ్రీ మాహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన కూర్మనాథుడు కొలువైన శ్రీ కూర్మం, సిరిమానుపై భక్తులను అనుగ్రహించే విజయనగరం మహారాజుల ఇంటి ఆడపడుచు పైడితల్లి అమ్మవారు..ఇలా భక్తజనానికి అభయప్రదాతలైన ఎందరో వేలుపులు కొలువైన ఉత్తరాంధ్రలో మీరు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన మరో ఆలయం బొబ్బిలి వేణుగోపాలస్వామి. విజయనగరానికి దాదాపు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న బొబ్బిలిలో కొలువై ఉంది వేణుగోపాల స్వామి ఆలయం.
బొబ్బిలి రాజుల కులదైవం
బొబ్బిలి రాజవంశీకుల కులదైవం శ్రీ వేణుగోపాలస్వామి. బొబ్బిలి కోట సమీపంలో ఉన్న ఈ ఆలయంలో రుక్మిణీ, సత్యభామా సమేతుడిగా వేణుగోపాలుడు దర్శనమిస్తాడు. బొబ్బలి సంస్థానాధిపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందినది. బొబ్బిలి సంస్తానదీశులైన శ్రీరాజ, వెంకట శ్వేతా చలపతి రావు నిర్మించారు. దేవాలయ గోపురం, ప్రధాన ఆలయం కంటే ఎత్తులో ఉండే ఏకైక ఆలయం ఇది. ఆలయ గోపురం సుమారు 9 మీటర్ల ఎత్తు ఉంటుంది.
ఐదు అంతస్తుల గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణ
బొబ్బిలి సంస్థానాధిపతులు కుల దైవం అయిన ఈ వేణుగోవాలస్వామి ఆలయంలో ఐదు అంతస్తుల గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణ. తూర్పు ముఖంగా గర్భాలయం, అంతరాలయం, మండపం అనే మూడు భాగాలుగా, రెండు ప్రాకారాలను కలిగి ఉంది. ఆలయ గాలిగోపురం తూర్పువైపు అభిముఖంగా ఉండి, దాని కింది నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయం ప్రవేశ ద్వారం బయట కళ్యాణమండపం ఒకటి ఉంది. మొదటి ప్రకారంలో ధ్వజస్తంభం, గరుడాళ్వారు మండపం, రెండవ ప్రకారంలో ముఖమండపం, ఆరాధన మండపం, అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి.
Also Read: ఉత్సాహం, ధైర్యం, ఆదాయం, అభివృద్ధి - ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మామూలుగా లేదు!
గర్భాలయంలో రుక్మిణి-సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కొలువై ఉండగా..గర్భాలయం బయట శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక మందిరం ఉంది. గర్భాలయానికి వాయువ్వంలో ఆండాళ్, నైరుతి లో శ్రీరామ క్రత: స్థంభం ఉన్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న మండపంలో శ్రీ ఆంజనేయస్వామి, ఆళ్వార్లు, శ్రీ సీతారాములు, శ్రీ రామానుజులవారు, శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలున్నాయి. ఏటా వసంతోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. అలాగే మాఘశుద్ద ఏకాదశికి స్వామివారికి కల్యాణోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇంకా ధనుర్మాసం, శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతాయి. ధనుర్మాసంలో జరిగే పూలంగిసేవ చూడడం అదృష్టంగా భావిస్తారు. ఆలయానికి కొంత దూరంలో నారాయణ పుష్కరిణిలో తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది. స్వామివారిని హంసవాహనంపై పుష్కరిణిలో విహరింపచేస్తారు...ఉత్తరాంధ్రలో ఆలయాలు దర్శించుకునేవారు..ఈ ఆలయాన్ని అస్సలు మిస్ కావొద్దు...
శ్రీ కృష్ణ గాయత్రీ
ఓం దేవకీ నందనాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నోః కృష్ణః ప్రచోదయాత్
మూల మంత్రం : ఓం క్లీం కృష్ణాయ నమః