Maha Shivratri 2022: శివరాత్రి గురించి పార్వతికి శంకరుడు చెప్పిన కథ ఇదే
ఈ ఏడాది (2022) మార్చి 1 మంగళవారం మహాశివరాత్రి. ఈ సందర్భంగా శివరాత్రి పర్వదినం గురించి పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పిన కథ మీ కోసం..
కైలాస పర్వతంపై భర్తతో పాటూ కూర్చున్న పార్వతీ దేవి.. అన్ని వ్రతాలకన్నా ఉత్తమమైన వ్రతమేదని అడిగింది. శివరాత్రి వ్రతం అని సమాధానం చెప్పిన శివుడు ఆ వ్రతం విశేషాలు తెలియజేశాడు. ఈ వ్రతాన్నిమాఘ బహుళ చతుర్దశి రోజు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా యమదండన నుంచి తప్పించుకోవచ్చంటూ ఈ కథ చెప్పాడు.
ఒకప్పుడు పర్వత ప్రాంతంలో వ్యాధుడు అనే వేటగాడు ఉండేవాడు. నిత్యం అడవికి వేటకు వెళ్లి సాయంకాలం లోపు ఏదో ఒక జంతువును కచ్చితంగా చంపి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఒకరోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంత వెతికినా ఏ జంతువు కనిపించదు. దీంతో ఆరోజు సమయం బాగాలేదనుకుని.. ఖాళీ చేతులతోనే ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో ఓ వాగు కనిపించడంతో ఓ ఆలోచన వచ్చింది. అక్కడికి నీరు తాగేందుకు జంతువులు కచ్చితంగా వస్తాయని భావించి వెంటనే ఆ దగ్గర్లోని చెట్టెక్కి అదేపనిగా చూస్తూ కూర్చున్నాడు. తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను, కాయలను విరిచి కింద పడేశాడు. అప్పుడు చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఆ సమయంలో ‘శివ శివ' అంటూ గజ గజ వణుకుతూ విల్లు ఎక్కి పెట్టి జంతువుల కోసం ఎదురుచూశాడు.
Also Read: సృష్టిలో మొదటి సైంటిస్ట్ శివుడేనా..!
ఎట్టకేలకు తెల్లవారుజామున ఓ లేడి కనిపించింది. వెంటనే బాణాన్ని ఎక్కు పెట్టాడు. అది చూసిన లేడీ ‘వ్యాధుడా నన్ను చంపకు' అని మనిషిలా మాట్లాడింది. వ్యాధుడు ఆశ్చర్యపోయి మనిషిలాగా మాట్లాడుతున్నావే.. ఎవరు నువ్వు అని అడిగాడు. దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ ‘నేను పూర్వ జన్మలో రంభను' అని సమాధానమిచ్చింది. పూర్వం నేను హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడిని పూజించుట మరిచిపోయాను. దీంతో ఆ పరమేశ్వరుడు నాపైన కోపంతో నువ్వు, నీ ప్రియుడు జింకలుగా పన్నెండేళ్లు గడిపి వ్యాధుడి బాణాన్ని ఎక్కుపెట్టాక శాపవిముక్తులు అవుతారని చెప్పినట్టు చెప్పింది. ఇప్పుడు నేను గర్భిణి కనుక నన్ను వదలేయ్ అని అడిగింది.
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే
మరో జింక కొద్దిసేపటి తర్వాత రావడంతో.. వ్యాధుడు సంతోషంగా విల్లు ఎక్కు పెట్టి బాణం విడిచే సమయంలో ఆ జింక కూడా అచ్చం మనిషి లాగా ‘ఓ వ్యాధుడా నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి మరో మగ జింక కొద్దిసేపట్లో వస్తుంది. దానిని చంపుకో.. లేదంటే నేను తిరిగి వస్తాను' అని వ్యాధుడికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు. అలా నాలుగు జింకలు వేడుకుని వెళ్లిపోతాయి. మరో జింక కోసం ఆశగా ఎదురుచూస్తుంటాడు వ్యాధుడు.
మర్నాడు నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపు.. లేదు నన్నే మొదట చంపమని మోకరిల్లుతాయి. ఆ జింకల నిజాయితీకి వ్యాధుడు ఆశ్చర్యపోయి ఇకపై హింస చేయనని విల్లు వదిలేసి వెళ్లిపోతాడు. అంతలో ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తుంది. శివరాత్రి సందర్భంగా ఉపవాసం, జాగరణం చేయడం, పైగా రాత్రందా బిల్వవృక్షం పైకి ఎక్కి దానికింద ఉన్న శివలింగాన్ని పూజించడంతో నీకు తెలియకుండానే పాపం పోయిందని చెబుతారు దేవదూతలు. అందుకే శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుందంటారు.