Shahasra Chandra Darshan: వెయ్యి పున్నములు చూడడం అంటే ఏంటి!
వెయ్యి పున్నములు చూసిన దంపతులకు దశదానం చేసే సంప్రదాయం భారతదేశంలో ఉంది. అందుకే పది దానాలను మోదీ అమెరికా అధ్యక్ష దంపతులకు చేశారని చెబుతున్నారు. ఇంతకీ వెయ్యి పున్నములు చూడడం అంటే ఏంటి...
అమెరికా అధ్యక్షుడి ఆహ్వానంతో వైట్ హౌస్ కి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. మొత్తం భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అన్ని రాష్ట్రాల సంస్కృతిని కళ్లకు కట్టేలా ఓ విలువైన గంధపుచెక్క పెట్టెను మోదీ అమెరికా అధ్యక్షుడికి బహుకరించారు. అందులో పది రకాల వస్తువులున్నాయి. ఆ వస్తువులేంటి, అవెందుకు ఇచ్చారు, ఏంసందర్భంలో ఇస్తారో మరో కథనంలో చెప్పుకుందాం. అయితే ఈ బాక్సులో 'సహస్ర చంద్ర దర్శనం' అని రాసి ఉంచిన కార్డును కూడా ఉంచారు. ఇంతకీ సహస్ర చంద్ర దర్శనం అంటే ఏంటి?
సహస్ర చంద్రదర్శనం అంటే!
తెలుగు నెలలో ప్రతి నెలకు ఓ పౌర్ణమి, ఓ అమావాస్య ఉంటాయి. అంటే నెలకో పౌర్ణమి చొప్పున ఏడాదికి 12 పౌర్ణమిలు వస్తాయి.
- ఏడాదికి 12 పౌర్ణమిలు
- ఐదేళ్లకు 60 పౌర్ణమిలు
- 10 ఏళ్లకు 120 పౌర్ణమిలు
- 20 ఏళ్లకు 240 పౌర్ణమిలు
- 40 ఏళ్లకు 480 పౌర్ణమిలు
- 80 ఏళ్లకు 960 పౌర్ణమిలు
అంటే వెయ్యి పున్నమిలు చూడాలంటే..సహస్రచంద్రదర్శనం జరగాలంటే ఓ వ్యక్తి 82 లేదా 83 ఏళ్లు బతకి ఉండాలి. ఇలా వెయ్యి పున్నములు చూసిన వారు మనదేశంలో చాలామంది ఉన్నారు. వారిలో.... ఐదేళ్లపాటు దేశాన్ని పాలించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా రికార్డ్ క్రియేట్ చేసిన మాజీ ప్రధాని వాజ్‌పేయి ‘సహస్ర చంద్రన్ దర్శన్’ 2006లో పూర్తి చేసుకున్నారు. అంతకు ముందు RSS మాజీ చీఫ్ రజ్జూ భాటియా కూడా సహస్ర చంద్ర దర్శన్ పూర్తి చేసుకున్నారు. అయితే లెక్క పక్కాగా 82 ఏళ్లని కాదు కానీ 80 ఏళ్లు నిండగానే సహస్రచంద్రదర్శన్ హోమం నిర్వహిస్తారు.
ఉత్తర భారతదేశంలో ప్రత్యేకం
హిందూ సంప్రదాయం ప్రకారం 77 ఏళ్ల 7 నెలల 7 రోజుల వయసులో అడుగుపెట్టిన వారికి భీమ్ రథారోహణ్ నిర్వహిస్తారు
88 ఏళ్ల 8 నెలల 8 రోజుల వయసులో అడుగుపెట్టిన వారికి దేవ రథారోహణ్ నిర్వహిస్తారు
99 ఏళ్ల 9 నెలల 9 రోజుల వయసు వారికి దివ్య రథారోహణ్ నిర్వహిస్తారు
సహస్ర చంద్ర దర్శన్‌ను ఉత్తర భారతం, నేపాల్, కర్ణాటక, ఏపీల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు.
50 నిండినప్పటి నుంచీ వయసుని బట్టి హోమాలు, శాంతులు
పురుషులకు 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి చేస్తారు. 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి నిర్వహిస్తారు. వాస్తవానికి 50 ఏళ్లు నిండినప్పటి నుంచీ ప్రతి ఐదేళ్లకు ఏదో ఒక హోమం, శాంతి జరపించాలంటారు పండితులు.
శ్లోకం
వయోవస్థా శాంతయః పంచాశత్ వర్షమారభ్య పంచభిః
పంచభిః వర్షైర్యుక్తాః।
(అన్యమతేన - షష్టితమ వర్షమారభ్య దశభిర్దశభిర్వర్షైః శాంతిరుక్తాః)
శ్లోకం
వైష్ణవీ వారుణీ చైవ తతశ్చోగ్రరథీ తథా ।
మహారథీ భీమరథీ ఐంద్రీచైవ విశేషతః ॥1॥
చాంద్రీదార్శనికీ రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తథా
మహామృత్యుంజయీ శాంతిః క్రమశశ్చ ప్రకీర్తితాః ।
అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్ప్రయత్నతః ॥2॥
Also Read: ఆరుద్ర కార్తె ఆరంభం - ఎర్రటి ఈ పురుగులు కనిపిస్తే వానలు మొదలైనట్టే!
50 ఏళ్లకి వైష్ణవీ శాంతి, 55 ఏళ్లకి వారుణి శాంతి, అరవైఏళ్లకి ఉగ్రరథ శాంతి, 65 ఏళ్లకి మృత్యుంజయ శాంతి, 70 ఏళ్లకి భీమరథీ శాంతి, 75 ఏళ్లకి ఐంద్రీ శాంతి, 80 ఏళ్లకి సహస్ర చంద్ర దర్శన శాంతి, 85 ఏళ్లకి రౌద్రీ శాంతి, 90 ఏళ్లకి కాలస్వరూప శౌరి శాంతి, 95 ఏళ్లకి త్ర్యంబక మహారథి శాంతి, 100 ఏళ్లకి శతాబ్ది మహామృత్యుంజయ శాంతి నిర్వహిస్తారు. ఎందుకుంటే వయసు 50 దాటేసరికి ఆరోగ్యం నెమ్మదిగా బలహీనమవుతుంది. దానికి తోడు గ్రహచార గోచార స్థితుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి.. ఇలాంటి సమయంలో ఆరోగ్యం, మనశ్సాంతి కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటారు పండితులు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.