జనగళమే యువగళంగా 200 రోజులు పూర్తి చేసుకున్న లోకేష్ పాదయాత్ర
జగన గళమే యువగళమై లోకేషుడిని నడిపిస్తున్న పాదయాత్ర మరో మైలు రాయి అందుకుంది. జనవరిలో ప్రారంభమైన యాత్ర నేటితో 200 రోజులు పూర్తి చేసుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. కుప్పం నుంచి జనవరి 27న పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్ ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పర్యటిస్తున్నారు. 200 రోజులుగా పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 16 వందలకుపైగా గ్రామాలను, సుమారు రెండు వందల వరకు మండలాలు, మున్సిపాలిటీలు కవర్ చేశారు. మొత్తంగా 2,710 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు.
పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45 రోజులు సాగింది పాదయాత్ర. అనంతపురం జిల్లాలోని 9నియోజకవర్గాల్లో 23 రోజులు యాత్ర చేశారు. కర్నూలు జిల్లాలోని 14నియోజకవర్గాల్లో 40రోజులపాటు నడిచారు లోకేష్. కడప జిల్లాలోని 7నియోజకవర్గాల్లో 16 రోజులు సాగింది. నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 31 రోజులు, ప్రకాశం జిల్లాలోని 8నియోజకవర్గాల్లో 17రోజులుపాటు ప్రజల్లో ఉన్నారు. గుంటూరు జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో 16రోజులు, కృష్ణాజిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 8 రోజులు సాగింది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న లోకేష్‌నాలుగు రోజుల్లో 2 నియోజకవర్గాల్లో టూర్ చేపట్టారు.
రెండు వందల రోజుల పాటు ప్రజల్లోనే ఉన్న లోకేష్... 60కిపైగా బహిరంగ సభల్లో మాట్లాడారు. వందకుపైగా ఇంటరాక్టివ్ భేటీల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఉండే సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారో లోకేష్ చెబుతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల వద్ద సెల్ఫీలు దిగుతూ ప్రభుత్వానికి ఛాలెంజ్‌లు చేశారు. సమస్యలను ఎత్తి చూపుతూ కూడా సల్ఫీలు దిగారు.
గతంలో లోకేష్ మాట్లాడితే విపరీతంగా ట్రోల్స్ వచ్చేవి. ప్రత్యర్థులు ఆయన మాటాల్లోని తప్పులను ఎత్తి చూపుతూ విమర్శలు చేసేవాళ్లు. పాదయాత్రలో లోకేష్ మాట తీరు మారింది. ప్రత్యర్థులపై పంచ్ డైలాగ్‌లతో విరుచుకుపడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను, టీడీపీ శ్రేణులను వేధిస్తోందని తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని వదిలి పెట్టబోమంటూ హెచ్చరిస్తున్నారు. రెడ్ డైరీని పట్టుకొని వారి పేర్లు రిజిస్టర్ చేస్తున్నామంటూ ఊరూరా చెబుతున్నారు.
నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతూ జగన్ సహా వైఎస్‌ఆర్‌సీపీ పెద్దలను టార్గెట్ చేశారు. ఏ నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేను, ఎంపీ చేసిన తప్పులు, తన వద్దకు వచ్చిన ఫిర్యాదులతో విమర్శలు చేస్తున్నారు. బాధితులకు తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు.
యాత్ర సందర్భంగా లోకేష్ అన్ని వర్గాల ప్రజలతే మమేకం అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. రైతులు, యువత, మహిళలు, ఇతర సామాజిక వర్గాల ప్రజలు, కూలీలు, ఉద్యోగులు, ఇలా అందరితో మాట్లాడుతున్నారు. ప్రతి వందల కిలోమీటర్లకు ఆ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలతో ప్రత్యేక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా 27 శిలాఫలకాలను ఆవిష్కరించారు.
యాత్ర సందర్భంగా లోకేష్ ఇచ్చిన హామీల్లో కొన్ని
* ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్
* పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు
* మొబైల్ ఫోన్‌కు కుల ధృవీకరణ పత్రాలు
* చేనేతలు, రజక వృత్తుల వారికి ఉచిత విద్యుత్
పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని పలు చోట్ల కేసులు రిజిస్టర్ అయ్యాయి. లోకేష్ యాత్ర సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు విషయంలో కూడా పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఈ గొడవల్లో కూడా పలువురిపై కేసులు పెట్టారు పోలీసులు. ఈ మధ్య గన్నవరంలో జరిగిన ఫ్లెక్సీ వివాదంలో 46 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. యాత్ర సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి.