Chandra Shekhar: తెలంగాణ బీజేపికి షాక్, రాజీనామా చేసిన మాజీ మంత్రి
Chandra shekhar: తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెబుతూ రాజీనామా చేశారు.
Chandra shekhar: తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా జోరుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ మాజీ మంత్రి చంద్రశేఖర్ భారతీయ జనతాపార్టీకి గుడ్ బై చెబుతూ రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు. ఈ సందర్భగా ఆయన బీజేపీ, అధికార బీఆర్‌ఎస్ పార్టీలపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. బీజేపీలో చేరి నేతలు మోసపోతున్నారని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు పోటీ అని భావించి అనేకమంది ఉద్యమకారులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ వత్తాసు పలుకుతోందని చంద్రశేఖర్ విమర్శించారు. పని చేసేవారిని ప్రోత్సహించడం లేదంటూ పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈటల రాజేందర్ బుజ్జగించే ప్రయత్నం చేసినా చంద్రశేఖర్ వెనక్కి తగ్గలేదు. పార్టీని వీడి విషయంలో పునరాలోచన లేదన్నారు. బీజేపీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని, ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరిగినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
గతంలో చంద్రశేఖర్ టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో పనిచేశారు. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మేల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి అసెంబ్లీకి, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. ఇక నేను ఉండలేనంటూ పార్టీని వీడి బయటకు వచ్చేశారు. వికారాబాద్‌లో 2021 జనవరి 18న నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ సమక్షంలో చంద్రశేఖర్ బీజేపీలో చేరారు.
ఆ సమయంలో చంద్రశేఖర్‌కు సముచిత స్థానం కల్పిస్తామన్న ముఖ్య నేతల హామీ ఇచ్చారు. అయితే తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తన తరువాత పార్టీలో చేరిన వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం. గతంలో బండి సంజయ్ పార్టీలో ప్రాధాన్యం ఉండేలా బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారట. అయితే ఇప్పుడు ఆయనే పదవిలో లేకపోవడంతో చంద్రశేఖర్ ఆశలు నీరుగారిపోయాయి.
ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. వికారాబాద్ నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసిన చంద్రశేఖర్‌ను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అధిస్టానం సైతం ఆసక్తి చూపుతోంది. అయితే, తనను నమ్ముకున్న నాయకులకు స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వాలని చంద్రశేఖర్ కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు హామీ లభిస్తే కాంగ్రెస్‌లో చేరాలని చంద్రశేఖర్ భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరితే వ్యక్తిగత గౌరవంతో పాటు సరైన ప్రాధాన్యం ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial