Janasena : కార్యకర్తలపై అక్రమ కేసులు - అత్యవసరంగా జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన పవన్ !
జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోరాట కార్యాచరణ ఖరారు చేయడానికి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
Janasena : పార్టీ నేతలపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులపై చర్చించి పోరాట కార్యాచరణ ఖరారు చేసుకునేందుకు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోపాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పీఏసీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల చైర్మన్లు, నియోజకవర్గ ఇంఛార్జీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు సహా నాయకత్వం అంతా పాల్గొంటారు.
ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశం
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సుమారు 4 గంటల పాటు కొనసాగనుంది. ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై లోతుగా చర్చిస్తారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలను ఆమోదిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ 3వ తేదీ సాయంత్రం మంగళగిరి చేరుకుంటారు. ఈ సమావేశం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తో పాటు ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహించేందుకు ప్రణాళికలను రెడీ చేయనున్నారు .
జనసేన కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులపై పోరాటం
ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో, జనసేన కూడా రాబోయే రెండు సంవత్సరాలు కీలకంగా భావించి ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టాలని భావిస్తోంది. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న విషయాన్ని డీజీపీకి వివరించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే జనసేన శ్రేణులు డీజీపీ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబు
జనసేన పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరం అనే భావన ప్రజల్లో పెరుగుతోందని దానికి అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉన్నదని జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించి సాధ్యమైనంత తొందరలో అన్ని నియోజక వర్గాలకు, మండలాలకు ఇంచార్జీలను, కమిటీలను ఏర్పాటు చెయ్యాల్సిన ఆవశ్యకతను పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళతానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాల పట్ల ఆకర్షితులై పవన్ కల్యాణ్ గారి భావజాలానికి అనుగుణంగా పని చెయ్యాలని జనసేన పార్టీలో చేరేందుకు వచ్చిన పలువురు నాయకులను నాగబాబు పార్టీ కండువాలతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు.