Minister Jogi Ramesh : వైసీపీలో గ్రూపు రాజకీయాలు, మంత్రి జోగి రమేష్ లో టెన్షన్ టెన్షన్
ఆత్మకూరు ఏఎస్ పేటలో గ్రూప్ రాజకీయాలు మంత్రి జోగి రమేష్ ను టెన్షన్ పెడుతున్నాయి. నాయకుల పరిచయ కార్యక్రమం రోజే గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టి పనిచేయాలని సూచించారు మంత్రి జోగి రమేష్. అయినా నాయకులు తీరు మారలేదు.
ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ అధికార వైఎస్సార్సీపీ ప్రచార జోరు పెంచింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించింది అధిష్టానం. మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, అంజాద్ బాషా, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్, నారాయణ స్వామి ఇన్చార్జులుగా మండలాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఏఎస్ పేట మండలానికి మంత్రి జోగి రమేష్ ఇన్ ఛార్జిగా వచ్చారు. అయితే ఏఎస్ పేట మండలంలో మూడు గ్రూపులు ఉన్నాయని ఆయన వచ్చినరోజే గ్రహించారు.
మంత్రి జోగి రమేష్, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఇద్దరూ ఏఎస్ పేట మండలానికి ఇన్ చార్జులుగా వచ్చారు. ఈ క్రమంలో అక్కడ మూడు వర్గాలున్నాయని, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి వేదికపైనే చెప్పారు. గ్రూపులన్నీ కలసి పనిచేయాలని పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని చెప్పారాయన. ఏఎస్ పేట మండలంలోని వైసీపీలో పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, పద్మజా రెడ్డి, రమేష్ రెడ్డి.. ఇలా మూడు గ్రూపులున్నాయి. ఎవరి రాజకీయాలు వారివే, ఎవరి నామినేటెడ్ పోస్టులు వారివే. పార్టీపై పెత్తనం ఒకరిదైతే, ఎంపీపీ మరొకరు. ఇలా ఎవరికి వారు తమ గ్రూపుల్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారందర్నీ కలిపే బాధ్యత మంత్రి జోగి రమేష్ పై పెట్టారు సీఎం జగన్.
నాయకుల పరిచయ కార్యక్రమం రోజే గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టి పనిచేయాలని సూచించారు మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి. కానీ స్టేజ్ పైనే నాయకులు ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. ఇక వీరిని ఒక్కటి చేయడం కొత్తగా ఇన్ ఛార్జి బాధ్యతలు తీసుకున్న జోగి రమేష్ వల్ల సాధ్యమవుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.
మంత్రుల్లో ఎవరు బెస్ట్ ?
ఆత్మకూరు నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డికి 92758 ఓట్లు పోల్ కాగా, టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యకు 70482 ఓట్లు పోలయ్యాయి. గౌతమ్ రెడ్డికి వచ్చిన ఓట్ల శాతం 53.22. మెజారిటీ 22276. అయితే ఈసారి మెజార్టీ లక్ష దాటాలని అధినాయకత్వం టార్గెట్ పెట్టింది. ఏ మండలంలో ఏ మంత్రి ఎంత బాగా పనిచేశారు, ఎంత బాగా ప్రచారం చేశారు, ఎంత బాగా ప్రజల్ని ప్రభావితం చేయగలిగారు అనేది తేలిపోతుంది. అందుకే ఇన్ ఛార్జ్ లుగా ఉన్న మంత్రులంతా హడావిడి పడుతున్నారు. తమ టాలెంట్ చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏఎస్ పేటకు ఇన్ ఛార్జిగా వచ్చిన జోగి రమేష్ ని, గ్రూప్ రాజకీయాలు భయపెడుతున్నాయి. స్థానిక వివాదాలను మంత్రి పరిష్కరించగలరా.. మండలంలో మంచి మెజార్టీ సాధించగలరా అనేది ముందు ముందు తేలిపోతుంది.