తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఫైర్ మీద ఉన్నారు. ఆ ఫైర్ కేంద్రం మీదనే. పెద్ద ఎత్తున పెట్రో పన్నులను కేంద్రం వసూలు చేసుకుంటూ.. తమను మాత్రం తగ్గించాలని ఒత్తిడి చేస్తూండటమే దీనికి కారణం. అసలే అప్పులు ఎక్కువై.. ఆదాయం సరిపోక తంటాలు పడుతూంటే కొత్తగా కేంద్రం ఈ కష్టాలు తెచ్చి పెట్టడం వారికి నచ్చడం లేదు. అందుకే గత మూడు రోజులుగా అటు ఏపీ.. ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు వారు నేరుగా కేంద్రంతోనే తలపడేందుకు ఓ వేదిక సిద్దమయింది. అదే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం. ఈ నెల 14వ తేదీన తిరుపతిలో ఇది జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి అధ్యక్షత వహిస్తారు. అందుకే ఈ దూకుడు కేంద్రం ముందు తెలుగు రాష్ట్రాలు ప్రత్యక్షంగా చూపిస్తాయా లేదా అన్నదానిపై ఆసక్తి ఏర్పడుతోంది.


Also Read : నెల్లూరులో వైసీపీ మైండ్ గేమ్.. నిరసనలతో టీడీపీ, సిగ్గు.. ఎగ్గు.. బుద్ధి లేదంటూ ఫైర్


దేశంలో అగ్గి పెడతామని ఇప్పటికే హెచ్చరించిన కేసీఆర్ !


తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మీద చాలా సీరియస్‌గా ఉంది. కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనబోనని చెబితే... తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం అది టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనడం లేదని ప్రచారం చేస్తూ రైతల్ని మభ్య పెడుతున్నారని కేసీఆర్ మండిపడుతున్నారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ పన్నుల ఇష్యూ కూడా ఉంది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని.. సెస్‌ల రూపంలో వసూలు చేస్తున్నారు. ఆ సెస్‌లు తీసివేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా విభజన సమస్యలు అనేక అంశాలపై ఆదిారం, సోమవారం రెండు రోజుల పాటు నిర్వహించిన మీడియా సమావేశాల్లో కేసీఆర్ ఘాటుగా స్పందించారు. దేశంలో అగ్గిరేపుతామని ప్రకటించారు. ఈ కారణంగా పధ్నాలుగో తేదీన తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ విశ్వరూపం చూపించేందుకు అవకాశం ఉందన్న అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.


Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్‌.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు 


కేంద్రంపై విరుచుకుపడుతున్న ఏపీ సర్కార్ !


ప్రత్యేకహోదా, విభజన హామీల అంశం సుదీర్ఘంగా ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ఆ అంశాలపై పెద్దగా పట్టించుకోలేదు. కానీ పెట్రోల్, డీజిల్ పన్నుల తగ్గింపు అంశానికి వచ్చే సరికి కేంద్ర ప్రభుత్వంపై మండి పడుతోంది. కేసీఆర్ మాదిరిగా ప్రెస్‌మీట్ పెట్టకపోయినా ప్రభుత్వం అధికారికంగా భారీ పత్రికా ప్రకటనలు ఇచ్చింది. కేంద్రం పెట్రో పన్నులతో ప్రజల్ని పిండేసిందని.. ఆ పన్నుల్లో న్యాయబద్దంగా ఇవ్వాల్సిన వాటా రాష్ట్రాలకు ఇవ్వడం లేదని నేరుగా ఆరోపించింది. రెండు రోజులుగా మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్‌మీట్ పెట్టి కేంద్రంపై విమర్శలు చేశారు. తాము ధరలు తగ్గించబోమని.. కేంద్రమే సెస్‌లు తీసేయాలని డిమాండ్ చేశారు.


Also Read : తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు.. 74 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు..


తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతారా ? 


తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఏపీ విషయంలో గతంలో మాట్లాడినట్లుగా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లివ్వాలని తాను గతంలో అన్నానని.. ఇప్పుడు కూడా అంటున్నానని స్పష్టం చేశారు. గోదావరిలో నీరు ఉన్నందున గోదావరి నీరు తీసుకెళ్లాలని చెప్పానంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న నీటి వివాదాలను కేంద్రం డ్రామాగా కేసీఆర్ తేల్చేశారు. బేసిన్లు, భేషజాలు లేవన్నానని గుర్తు చేశారు. అంటే కేసీఆర్.. ఏపీతో జల వివాదాల అంశాన్ని తేలిక చేసుకుని.. కేంద్రంపై పోరాటానికి ఏపీ సీఎం జగన్‌ను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఒక్క జల వివాదాలు, విభజన సమస్యలు , వివాదాలు మినహా రాజకీయంగా అన్ని విషయాల్లోనూ తెలంగాణ సర్కార్‌తో  పరస్పరం సహకంరించుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఇద్దరి సీఎంల మధ్య మంచి అవగాహన ఉందని అంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు కేంద్రంపై పోరాటానికి ఇద్దరూ కలిసి వెళ్లే అవకాశాలు ఏర్పడ్డాయని భావిస్తున్నారు.  ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయడం కన్నా.. తమ ఎదుటకు ... సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం రూపంలో తమ ఎదుటకు అవకాశం వస్తోంది. వీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు.


Also Read: Anantapur News: అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత


సదరన్ కౌన్సిల్ భేటీలో గళమెత్తకపోతే రాజకీయమని ప్రజలు భావించే అవకాశం !


దక్షిణాది విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న అభిప్రాయం చాలా కాలంగా ఉంది. తమిళనాడు సీఎంగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక అంశాలపై లేఖలు రాశారు. తోటి దక్షిణాది సీఎంలకూ లేఖలు రాశారు. వాటికి జగన్, కేసీఆర్ స్పందించిన దాఖలాలు లేవు. కేంద్రం విషయంలో స్టాలిన్‌కు ఎలాంటి రిజర్వేషన్లు లేవు కాబట్టి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన కేంద్రాన్ని నిలదీస్తారు. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు.. నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అంతా చాయిస్ లేదు. కేంద్రంతో సహకారం కోసం వీలైనంత స్నేహంగా కేంద్రంతో ఉండేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలేదని.. చేయి దాటిపోయిందని రెండు ప్రభుత్వాలే తమ చేతల ద్వారా చెబుతున్నందున... కేంద్రాన్ని నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ సదరన్ కౌన్సిల్ సమావేశంలో  ఇద్దరు సీఎంను కేంద్రాన్ని నిలదీయకపోతే... బయట ప్రజల్ని మభ్య పెట్టేందుకే రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం.. అందరిలో ఏర్పడుతుంది. అది రాజకీయంగా ఇద్దరు ముఖ్యమంత్రులకూ మంచిది కాదు.


Also Read: కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని మోదీకి గులాంగిరీ.. ఇప్పుడు పోరాటమంటూ చెవుల్లో పూలు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి


ఎజెండా సిద్ధం చేసుకున్న  జగన్ - ఖరారు కానీ కేసీఆర్ టూర్ !


సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆతిధ్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి సీఎం జగన్ ఓ సారి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ... లెవనెత్తాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకహోదా సహా విభజన హామీలు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు... పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలు ఇలా అన్నింటినీ ప్రస్తావించనున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ టూర్‌పై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఆయన తిరుపతి వెళ్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే జరగబోతోంది.. అత్యున్నతస్థాయి సమావేశం కనుక .. అధికారులు ఎజెండా సిద్ధం చేస్తున్నారు. మరో ఐదు రోజులే గడువు ఉన్నందున కేసీఆర్ టూర్ ఖరారయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ కాకపోతే కేటీఆర్ అయినా హాజరవుతారు. ఎవరు హాజరైనా కేంద్రతో వారు వ్యవహరించబోయే విధానం ఎలా ఉంటుందనేదే అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. 


Also Read: ఆయన కంఠంలో ‘ఉక్కు’ తూటా! స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోపోరుకు సిద్ధమైన శంకరరావు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి