అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ ఎయిడెడ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని విద్యార్థి సంఘాలు ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య సుమారు గంటపాటు తోపులాట జరిగింది.  ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొంతమంది రాళ్లు రువ్వారు.  దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తలకు గాయమైంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన మరింత ఉద్ధృతం చేశారు. పరిస్థితి ఉద్ధృతంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసులకు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి వాహనంలో తరిలిస్తుండగా పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు.  



లాఠీఛార్జ్ చేయలేదు : డీఎస్పీ


చదువుకునే విద్యార్థులపై ప్రతాపం చూపుతారా? అంటూ పోలీసులను విద్యార్థులను నిలదీశారు. ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసే క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ గందరగోళంలో గుర్తుతెలియని వ్యక్తులు విసిరిన రాయి తగిలి జయలక్ష్మి అనే విద్యార్థిని తలకు గాయం అయ్యింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మాత్రం లాఠీఛార్జ్ చేయలేదని చెప్తున్నారు. గుంపులను మాత్రమే చెదరగొట్టమని డీఎస్పీ వీరరాఘవ రెడ్డి వెల్లడించారు. 


Also Read: నెల్లూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ... నామినేషన్లు తిరస్కరించారని ఆందోళన.. ఆర్వో తీరుపై టీడీపీ ఫిర్యాదు






నిరసన తెలపడం కూడా నేరామేనా : లోకేశ్


అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎయిడెడ్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని విమర్శించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థి ఉద్యమాలు అణచివేయాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయమన్నారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.


Also Read: కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని మోదీకి గులాంగిరీ.. ఇప్పుడు పోరాటమంటూ చెవుల్లో పూలు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి


విద్యార్థులపై పోలీసు జులుం చూపిస్తారా..? 


అనంత విద్యార్థులతో చెలగాటం ఆడొద్దని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అధికార మత్తులో విద్యార్థుల ఆందోళనలు భరించలేకపోతున్నారని విమర్శించారు. విద్యార్థులప్తె విద్యార్థులపై జులుం ప్రదర్శిస్తారా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఏమి రాజకీయాలు ఉంటాయని, తమ భవిష్యుత్తు కోసం ఆందోళనపడుతున్న విద్యార్థులను లాఠీలతో చెదరగొట్టడం అమానుషమన్నారు. 
అనంతపురం విద్యార్థులపై లాఠీఛార్జ్ ఘటనపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అమానుషమన్నారు. పోలీసులు విద్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండకూడదన్నారు. 


Also Read: ఆయన కంఠంలో ‘ఉక్కు’ తూటా! స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోపోరుకు సిద్ధమైన శంకరరావు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి