విశాఖ ఉక్కు కర్మాగారాన్ని(Vizag Steel Plant) ప్రైవేటీకరణను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. ఇందుకోసం గతంలో జరిగిన సంఘటలను వివరించి ప్రస్తుతం జరుగుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం చేస్తున్న వారిలో స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. 1966లో ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారని నిన్న ఉదయం ట్వీట్ చేశారు. వారంలోగా స్టీల్ ప్లాంట్ పైన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తమ విధానం స్పష్టం చేయాలని, అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్న పవన్ కళ్యాణ్ డిమాండ్ల గడువు ముగిసింది.
‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో ముడిపడిపోయిందన్నారు. ఐదున్నర దశాబ్దాల కింద విశాఖ ఉక్కు ఉద్యమం ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో 32 మంది చనిపోయారని పేర్కొన్నారు. తన కంఠంలోకి తూటా దూసుకెళ్లినా.. పోరాటాన్ని కొనసాగించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన శంకరరావు గురించి పవన్ ట్వీట్ చేశారు. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కర్మాగారం పరిరక్షణకై మరోసారి పోరాటానికి సిద్ధమైన బయపల్లి శంకర్రావు ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి స్ఫూర్తి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
ఎవరీ శంకరరావు..
విశాఖ ఉక్కు చరిత్రకు ప్రత్యక్ష సాక్షి శంకరరావు. ఆయన తండ్రి డాక్టర్ రామారావు హోమియో వైద్యుడు. స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, విశాఖ ఉక్కు ఉద్యమనేత తెన్నేటి విశ్వనాథం పర్యవేక్షణలో నిర్వహించే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నడిచే ఫ్రీ క్లినిక్‌లో రామారావు సేవలు అందించారు. తండ్రి ప్రభావం, తెన్నేటి ప్రసంగాలతో ఆకర్షితులైన శంకరరావు విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నారు. 1966లో గవర్నమెంట్ పాలిటెక్కిక్ కాలేజీలో 4 ఏళ్ల ఎంఎల్ఈ డిప్లొమా కోర్సులో శంకరరావు చేరారు. అప్పుడు ఆయన వయసు 18 ఏళ్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మొదలైంది. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, ఎంవి చంద్రం తదితర ప్రముఖుల ఉపాన్యాలకు ఆకర్షితుడై ఉద్యమంలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించినా స్వచ్ఛందంగా బంత్ కొనసాగేది.
Also Read: నెల్లూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ... నామినేషన్లు తిరస్కరించారని ఆందోళన.. ఆర్వో తీరుపై టీడీపీ ఫిర్యాదు
హైదరాబాద్, వరంగల్, గుంటూరు, కాకినాడ నుంచి విద్యార్థులు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొనేవారు. నవంబర్ 1వ తేదీన శంకరరావు తన మిత్రులతో కలిసి బయటకు వచ్చారు. విద్యార్థుల ఆందోళనలో ఓ ఇన్ స్పెక్టర్ టోపీ కింద పడిపోగా ఆగ్రహంతో కాల్పులు జరిపారు. ఫైరింగ్ కు ఆర్డర్ ఇవ్వడంతో లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగం కాల్పుల వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ పోలీసు వదిలిన తూటా శంకరరావు గొంతులోంచి దూసుకెళ్లింది. ఆయన బావ విజయకుమార్ శంకరరావును జీజీహెచ్ కు తీసుకెళ్లారు. మొదట మార్చురీకి తీసుకెళ్లగా చనిపోయాడనుకుని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పొరపాటును గమనించిన వైద్యులు చికిత్స చేసి సాయంత్రం ఆపరేషన్ పూర్తి చేసి శంకరరావును బతికించారు. ఆపై మూడు నెలలు ఇంట్లో చికిత్స పొందారు.
తన కంఠం నుంచి తూటా దూసుకెళ్లడంతో తగిలిన గాయం బాధల్ని శంకరరావు నేటికీ అనుభవిస్తున్నారు. మిగతావారిలా ఆయన మెడను అటూఇటూ సరిగా తిప్పలేరు. ఆహారం తీసుకోవాలన్నా, నీళ్లు తాగాలన్న ఆయనకు ఇబ్బంది. గట్టిగా గుటక వేస్తే కానీ నీరు, ఆహారం కిందకు దిగదు. ఆంధ్రులకు అన్యాయం జరుగుతోంది అన్నందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగం కోల్పోయిన పట్టా రామ అప్పారావుతో కలిసి శంకరరావు పలు అనుభవాలు పంచుకున్నారు. తనను షిప్ యార్డులో, పాలిటెక్నిక్ కాలేజీలో అప్పట్లో అందరూ స్టీల్ ప్లాంట్ శంకరరావు, విశాఖ అమృతరావు అని పిలిచేవారంటూ ఉప్పొంగిపోయారు. షిప్ యార్డ్ జాబ్ నుంచి రిటైర్ అయిన శంకరరావు ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటానికి ఇలాంటి ఘటనలను స్ఫూర్తిగా నిలుస్తాయని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Also Read: వంశధార ప్రాజెక్టుకు మోక్షమెప్పుడు... 60 ఏళ్ల సమస్యకు ఎవర్ని నిందించాలి... ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కామెంట్స్