తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెట్రోలు మంటలు మండుతున్నాయి. రెండు ప్రభుత్వాలు వేర్వేరు పద్దతుల్లో అయినా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఓ ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తప్పంతా కేంద్రానిదేనని తేల్చి చెప్పింది. పన్నులు తగ్గించబోమని నేరుగా చెప్పలేదు కానీ.. ఆ ప్రకటన ఉద్దేశం మాత్రం అదే. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి అవే అంశాలను చెప్పారు. ఆయన నేరుగా తాము పైసా కూడా తగ్గించబోమని తేల్చేశారు. పైగా కేంద్రం సెస్ తగ్గించాలని పోరాటం చేస్తామని ప్రకటించారు. దేశంలో అత్యధిక రాష్ట్రాలు కేంద్రం తగ్గింపు తర్వాత తగ్గింపు ప్రకటనలు చేశాయి. బీజేపీ ప్రభుత్వాలు మాత్రమే పంజాబ్ లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు.. ఒడిషా లాంటి రెండు కూటముల్లో లేని ప్రభుత్వాలు కూడా తగ్గించాయి. కానీ బీజేపీతో గల్లీలో కాకపోయినా ఢిల్లీలో అనధికార మిత్రపక్షాలుగా ఉంటాయనుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం పైసా కూడా తగ్గించకుండా భారతీయ జనతా పార్టీపై ఎదురు దాడి ప్రారంభించారు. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ప్రారంభించారు. దీంతో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై రాజకీయం రాజుకున్నట్లయింది.
Also Read : ఆయన కంఠంలో ‘ఉక్కు’ తూటా! స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోపోరుకు సిద్ధమైన శంకరరావు..
పెట్రో పన్నుల విషయంలో కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తూ ఏపీ ప్రభుత్వం పత్రికా ప్రకటనలు !
కేంద్రం పెట్రోల్‌పై రూ. ఐదు, డీజిల్‌పై రూ. పదిని దీపావళి కానుకగా తగ్గింపు ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రాలు కూడా తగ్గించాలని కేంద్రం కోరింది. కేంద్రం పిలుపు మేరకు మొదట బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో తగ్గింపులు ప్రకటించారు. తర్వాత వెసులుబాటును బట్టి ఇతర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఉపశమనం కల్పించాయి. కేరళ, తమిలనాడుల్లో ఇంతకు ముందే ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాయి కాబట్టి కేంద్రం ఇచ్చిన రిలీఫ్‌తోనే సరి పెట్టాయి. ఒడిషా కూడా తగ్గించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ ఏకంగా రూ. పది తగ్గించింది. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల వైపు ప్రజలు ఆశగా చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఇంత కన్నా అవకాశం ఏముంటుంది. తగ్గించాలంటూ రోడ్డెక్కుతున్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. అందులో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం రాష్ట్రాల నుంచి రూ. 3 లక్షల35వేల కోట్లు వసూలు చేసి .. రాష్ట్రాలకు మాత్రం కేవలం 19,475 కోట్లు మాత్రమే పంపిణీ చేస్తోందని ఆరోపించింది. చట్టం ప్రకారం 41శాతం పన్నులు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ.. సెస్‌ల రూపంలో వసూలు చేస్తూ ఆ మొత్తాన్ని కేంద్రమే వినియోగించుకుంటోందని ఆరోపించింది. ఇంత కంటే ఘోరం ఉంటుందా అని ప్రభుత్వం ప్రకటనలో ఆశ్చర్యపోయింది.
తెలంగాణ సీఎం కేసీఆర్‌దీ అదే మాట !
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆదివారం సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి పెట్రో అంశాలపై స్పందించినప్పుడు అవే లెక్కలు చెప్పారు. సెస్‌లు పేరుతో వసూలు చేస్తూ రాష్ట్రాలకు పన్నుల వాటా రాకుండా చేస్తున్నారని తక్షణం సెస్‌ల వసూలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాము పైసా పన్నులు పెంచలేదు కాబట్టి తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేశారు. సెస్‌ల వసూలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఇతర పార్టీలతో కలిసి ఆందోళనలు చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలది పెట్రో ధరల విషయంలో ఒకటే మాట అయినట్లయింది.
నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలు పెట్రో పన్నులు పెంచలేదా ?
రెండు ప్రభుత్వాలు తాము పన్నులు పెంచలేదని చెబుతున్నాయి. కానీ అది అవాస్తవం. పన్నులు రెండు ప్రభుత్వాలూ పెంచాయి. ఆంధ్రప్రేదశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ సారి అదనపు వ్యాట్‌ను పెంచుతూ జీవో జారీ చేశారు. తర్వాత అదనపు వ్యాట్‌ను రూ. నాలుగుగా నిర్ణయిస్తూ జీవో జారీ చేశారు. దీనికి అదనంగా రూపాయి సెస్ వసూలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం పెట్రో పన్నులు పెంచలేదు. కానీ తొలి సారి అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిలో 2015లో మాత్రం ఓ సారి పెంచారు. తర్వాత మళ్లీ పెంచలేదు. అయితే ప్రభుత్వాలకు వచ్చిన ఆదాయం మాత్రం రేట్లు పెరిగిన ప్రతీ సారి పెరుగుతూనే ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా పన్నులు పెంచాల్సిన పనిలేదు. ఉదాహరణకు కేంద్రం పన్నులు పెంచినప్పుడల్లా పెట్రోల్, డీజిల్ రేటు పెరుగుతూ ఉంటుంది. 100 రూపాయలు ఉన్నప్పుడు 30 రూపాయలు వ్యాట్ వసూలు చేస్తే 110రూపాయలు అయినప్పడు రూ.33 వసూలు చేస్తారు. అంటే ట్యాక్స్ అదనంగా వసూలు చేస్తున్నట్లే. అందుకే రెండు తెలుగు ప్రభుత్వాలకూ పెట్రో పన్నులపై ఆదాయం భారీగా పెరిగింది. ఇప్పుడు వాటిని కోల్పోవడానికి సిద్ధంగా లేరు. కేంద్రం తగ్గించిన వాటితోనే రాష్ట్రాల ఆదాయానికి కొంత గండి పడుతుంది. ఇంకా తగ్గించాలంటే నష్టపోతామని భావించినట్లుగా ఉంది.
Also Read: పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?
ముఖ్యమంత్రులపై విమర్శలు ప్రారంభించిన బీజే్పీ నేతలు !
పెట్రో ధరల విషయంలో ఏ ఇతర ప్రభుత్వాలూ విమర్శించనంతగా తమపై దాడి చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పెట్రో ధరల విషయం చేసిన విమర్శల్లో వ్యక్తిగత విమర్శలు ఉండటంతో బీజేపీ నేతలు ఎక్కువగా కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పెట్రో పన్నులు ఎంతెంత వసూలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్వీట్ చేశారు.
Also Read: ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?
కేంద్రం రాజకీయ ఆట ఆడుతోందని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అనుమానం !
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండటానికి అప్పోసప్పో చేసి పెద్ద ఎత్తున ప్రజలకు నిధులు ట్రాన్స్ ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ కారణంగా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయి. అదనపు ఆదాయం కోసం చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. కొత్తగా ఆదాయం కోల్పోయే పరిస్థితి లేదు. సరిగ్గా ఇదే పరిస్థితిని ఆసరా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమతో ఆటలాడుతోందని... రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోందని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారని అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించారనేది రాజకీయవర్గాల అంచనా.!
Also Read: తెలంగాణ రైతులకు అలెర్ట్... యాసంగిలో వరి వద్దు ప్రభుత్వం కొనదు... మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం
తెలుగు రాష్ట్రాల సీఎంలు బీజేపీపై కలిసి యుద్ధం ప్రకటిస్తారా ?
రైతు చట్టాలు, పెట్రో సెస్‌లు , విభజన హామీలు ఇలాంటి వాటిపై కేంద్రంతో కొట్లాడుతామని కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులందర్నీ ఢీల్లీకి తీసుకెళ్లి ధర్నా చేస్తామన్నారు. కలసి వచ్చేపార్టీలతో కలిసివెళ్తామన్నారు. ఏపీలో సీఎం జగన్ గెలిచిన మొదట్లో రెండు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయి. రాజకీయంగా ఇద్దరి మధ్య ఇప్పటికీ మంచి సబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ , జగన్ కలిసే బీజేపీపై పోరాటానికి వెళ్తారన్న చర్చ జరుగుతోంది. బీజేపీతో విబేధించడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే అది సహజంగానే ప్రజల్లో సానుభూతి పెంచుతుందన్న నమ్మకంలో ఆ పార్టీ నేతలు ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా " కేసీఆర్‌ను అరెస్ట్ చేసి బతికి బట్టకట్టగలవా " అని బండి సంజయ్‌ను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
ఈ పరిణామాలన్నింటిని చూస్తే పెట్రో పన్నులను కారణంగా చూపి ఇప్పటి వరకూ తమపై ఉన్న ప్రొ బీజేపీ అనే ముద్రను చెరిపేసుకుని.. ఢిల్లీ రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలన్న ఆలోచనతో కలసి కట్టుగా పోరాటం చేసేందుకు తెలుగు, రాష్ట్రాల అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న అభిప్రాయం మాత్రం బలంగా ఏర్పడుతోంది.
Also Read: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం... ఎంతెంత పెరిగాయంటే..!