'యాభై దెయ్యాలు సార్...! అవి నన్ను బెదిరిస్తున్నాయి సార్! భయపెడుతున్నాయ్' అని పోలీస్ స్టేషన్‌లో అధికారులకు బండ్ల గణేష్ మొర పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఏమిటి? నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? అనేది తెలుసుకోవాలి అంటే ప్రేక్షకులు 'డేగల బాబ్జీ' చూడాలి. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా, టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ఇది. ఈ రోజు (సోమవారం) ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ట్రైలర్ విడుదల చేశారు. అందులో డైలాగే పైన బండ్ల గణేష్ చెప్పినది.
ఓ హత్య కేసులో డేగల బాబ్జీపై అనుమానంతో అరెస్ట్ చేస్తారు. బాబ్జీ కథేంటి? స్టేషన్‌లో అతడికి ఎటువంటి ప్రశ్నలు వేశారు. ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? బాబ్జీ ఏం చెప్పాడు? అనేది కథగా తెలుస్తోంది. ట్రైలర్ అంతా బండ్ల గణేష్ ఒక్కరే కనిపించారు. సినిమాలో కూడా ఆయన ఒక్కరే కనిపిస్తారని, మిగతా పాత్రల వాయిస్ మాత్రమే వినిపిస్తుందని దర్శకుడు వెంకట్ చంద్ర చెప్పారు.
పవన్ కల్యాణ్ గురించి ఓ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడటానికి ముందు 'ఈశ్వరా... పరమేశ్వరా' అని స్పీచ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 'డేగల బాబ్జీ'లో 'ఈశ్వరా... పరమేశ్వరా' అని డైలాగ్ కూడా ఉంది. ఈ సినిమాలో బండ్ల గణేష్ కుమారుడి పాత్రకు పవన్ పేరు పెట్టినట్టు ఉన్నారు. 'బావా... నేను ఎక్కడ ఉన్నానో పట్టుకో చూద్దాం! ఎందుకు బావా ఆ దేవుడు మనల్ని పేదోళ్లుగా పుట్టించాడు. పవన్‌ని జాగ్రత్తగా చేసుకుంటావా?' అని ట్రైలర్ మధ్య మధ్యలో ఫిమేల్ వాయిస్‌లో డైలాగులు వినిపించాయి. 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టినప్పటి నుంచి మేం ఏడుస్తున్నాం', 'అసలు మా అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా?' అని బండ్ల గణేష్ చెప్పిన డైలాగులు ఎమోషనల్ గా ఉన్నాయి.
తమిళంలో ఆర్. పార్తిబన్ నటించిన 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కు ఈ సినిమా రీమేక్. తమిళంలో పార్తిబన్ చేసిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ పోషించారు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. "తెలుగు తెరపై తొలిసారి ఒకే ఒక్క నటుడిగా చేస్తున్న సినిమా ఇది" అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.