పెట్రోల్, డీజిల్‌పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పన్నులు తగ్గించాలన్న డిమాండ్లు, అటు రాజకీయ పార్టీలు, ఇటు సామాన్య ప్రజలు కూడా చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఆలోచిస్తున్నాయి.  సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నట్లుగా ఏపీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలన చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడల్లా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే ప్రభుత్వాలు రేట్లు తగ్గించకపోతే అటు ప్రజా వ్యతిరేకత నష్టంతో పాటు ఆర్థికంగానూ నష్టపోతాయని లెక్కలు వెల్లవుడున్నాయి.


Also Read : పన్నులు తగ్గించాలని ఆందోళనలు .. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ సెగ !


సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలు బంకులు మూతపడే ప్రమాదం !


కేంద్ర ప్రభుత్వ తగ్గింపుతో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా భారీగా పన్నులు తగ్గించింది. దీంతో తెలుగు రాష్ట్రాల రేట్లతో పోలిస్తే కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లు రూ. 12 నుంచి రూ. 18 వరకూ తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో తగ్గింపులు లేక ముందే తెలంగాణలో రూ. నాలుగు, కర్ణాటకలో రూ. ఆరు, తమిళనాడుతో పోలిస్తే రూ. ఐదు ఎక్కువ. అందుకే అప్పట్లోనే కొంత మంది సమీపంలో ఉన్న వారు పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించుకుని వచ్చేవారు. రాష్ట్రం మీదుగా ప్రయాణించేవాళ్లు బయటే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని వచ్చేవారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గేది. అయితే ఇప్పుడు ఆ తేడా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దాదాపుగా 300 పెట్రోల్ బంకులకు గిరాకీ పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.  పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ కంటే డీజిల్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. రవాణా వాహనాలే దీనికి కారణం. ఈ ధరల తేడా వల్ల సరిహద్దుల్లోని పెట్రోల్ బంకుల్లో  పూర్తిగా పడిపోయాయి. ఇది పెట్రోల్ బంకుల్ని నష్టాల్లోకి నెట్టేలా చేస్తున్నాయి.


Also Read : నాడు ఏం చెప్పారు ? నేడు ఏం చేస్తున్నారు ? పెట్రో ధరలను తగ్గించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం !


ప్రభుత్వానికీ వ్యాట్ ఆదాయం తగ్గుతుంది !


ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గితే ఆ మేరకు వ్యాట్ ఆదాయం కూడా ప్రభుత్వానికి తగ్గుతుంది. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి బడ్జెట్‌లో  పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను భారీగా తగ్గించారు. ఈ కారణంగా ఆగస్టులోనే తమిళనాడులో పెట్రోల్ రేటు రూ. నాలుగు వరకూ తగ్గింది. ఇప్పుడు కేంద్రం మరో ఐదు రూపాయలు తగ్గించింది. వీటి కారణంగా సరిహద్దుల్లో ఉన్న వారంతా ఇక తమిళనాడు బోర్డర్‌కు వెళ్లి  పెట్రోల్ కొట్టించుకుని వస్తున్నారు. వాణిజ్య వాహనాలన్నీ ట్యాంక్ ఫుల్ చేయించుకుని ఏపీలోకి వస్తున్నాయి. ఈ కారణంగా తమిళనాడు ఆదాయం పెరిగిందని..  వ్యాట్ తగ్గించడం వల్ల ఎలాంటి ఆదాయలోటు ఏర్పడలేదని తమిళనాడు ప్రభుత్వమే ప్రకటించింది. అంటే  ఆ మొత్తం ఏపీ ఆదాయం నుంచి జమ అయిందన్నమాట. ఇదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ సరిహద్దుల్లోనూ ఏర్పడుతుంది. అదే జరిగితే ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోతుంది.


Also Read : ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?


పొరుగు రాష్ట్రాల పెట్రోల్ బంకుల విస్తృత ప్రచారం 


తెలంగాణ, ఏపీ పొరుగు రాష్ట్రాల పెట్రోల్ బంకులు ఇప్పటికే...సరిహద్దు దాటితే పెట్రోల్ రేటు ఎంత పెరుగుతుందో పెద్ద ఎత్తున బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నాయి. తమ వద్ద కొంటే ఎంత తక్కువకు వస్తున్నాయో చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్లక ముందే పెట్రోల్, డీజిల్  కొట్టించుకోవాలని సలహా ఇస్తున్నాయి.  అందుకే ప్రభుత్వాలు వ్యాట్ తగ్గింపుపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని ఆలస్యం చేయడం మంచిది కాదని పెట్రోలియం డీలర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు.


 


Also Read : ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?


 
తగ్గించకపోతే స్మగ్లింగ్ జరిగే అవకాశం ! 


ఒక వేళ ప్రభుత్వాలు రేట్లను తగ్గించకపోతే పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తెచ్చినట్లుగా పెట్రోల్, డీజిల్‌ను కూడా తీసుకొచ్చి అమ్మినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లీటర్‌కు రూ. పదిహేను వరకూ లాభం అంటే స్మగ్లర్లకు అంత కంటే కావాల్సింది ఏముంటుంది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వాలు చురుకుగా ఆలోచించి పొరుగు రాష్ట్రాలతో సమానంగా రేట్లు ఉండేలా చూసుకోవాలని లేకపోతే రాష్ట్రానికే నష్టమని హెచ్చరికలు పంపుతున్నారు నిపుణులు.ఈ విషయంపై ప్రభుత్వాలు వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందంటున్నారు. 


Also Read : దిల్లీలో డేంజర్ బెల్స్.... కాలుష్యంతో తగ్గిపోతున్న ఆయుష్షు... వైద్య నిపుణుల వెల్లడి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి