కేంద్ర ప్రభుత్వం ప్రజలకు దీపావళి కానుకగా పెట్రోల్‌పై రూ. ఐదు, డీజిల్‌పై రూ. పది తగ్గింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం బాటలోనే చాలా రాష్ట్రాలు కూడా అంతకంటే ఎక్కువగానే తగ్గింపు ఇచ్చాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు రూ. పదిహేను వరకూ తగ్గింది. అయితే కేంద్రం తగ్గింపు సరే.. రాష్ట్రాల్లో తగ్గింపు నిర్ణయం తీసుకోని ప్రభుత్వాలకు మాత్రం సెగ తగలడం ప్రారంభమయింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంకా తగ్గింపు నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగా ప్రతిపక్ష పార్టీలకు రాజకీయ అవకాశం లభించినట్లయింది. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఆందోళనలకు దిగుతున్నారు. 




Also Read : నాడు ఏం చెప్పారు ? నేడు ఏం చేస్తున్నారు ? పెట్రో ధరలను తగ్గించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం !


తెలంగాణలో ప్రభుత్వం పెట్రోల్ పై 35.20 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31 శాతం వ్యాట్‌తో పాటు ఒక్క లీటర్‌ మీద అదనంగా నాలుగు రూపాయల వ్యాట్ విధించింది. అలాగే రోడ్ల మరమ్మతుల నిధుల కోసమని లీటర్‌కు మరో రూపాయి సెస్ వసూలు చేస్తోంది.  అందుకే తెలంగాణకు.. ఏపీకి మధ్య పెట్రోల్ రేట్లలో రూ. రెండు, మూడు రూపాయల తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కేంద్రం పన్నులను తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించాలని సూచించింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంత వరకూ తగ్గిస్తామని కానీ.. తగ్గించే ఆలోచన చేస్తామని కానీ చెప్పడం లేదు.  


Also Read : ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?


తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికే నిరసనలు ప్రారంభించారు. కేంద్రం తగ్గించినట్లుగా రాష్ట్రం కూడా పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. పెట్రోల్, డీజిల్ పై 17 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారు.. తెలంగాణలో ఎందుకు తగ్గించరని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. 


 పెట్రోల్, డీజిల్ పై 17 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారు.. తెలంగాణలో ఎందుకు తగ్గించరు..?

పెట్రోలు, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ తగ్గించాలి¡ pic.twitter.com/B5WqHa90bt




 ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.


 



మరో వైపు తెలుగుదేశం పార్టీ పెట్రో ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై 16 - 17 రూపాయాలు తగ్గించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం స్పందించకపోతే వీరి నిరసనలు ఇంకా ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. 


Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి