హుజురాబాద్ ఉపఎన్నికల హడావుడి ముగిసింది. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమయింది. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. విపక్ష పార్టీలకు అసలు బలం లేకపోవడంతో  ఆరు స్థానాలూ టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం అవడం ఖాయమే. దీంతో ఆశావహులందరూ సీఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగతా వారి సంగతేమో కానీ ప్రస్తుతం అందరి దృష్టి పాడి కౌశిక్ రెడ్డిపైనే ఉంది. వా‌స్తవంగా అయితే ఆయన ఈ పాటికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కావాల్సి ఉంది.కానీ ఆయన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. 


Also Read : సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన.. కేడీసీసీ బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి


హుజురాబాద్‌లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని భావించిన పాడి కౌశిక్ రెడ్డి తర్వాత రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ లో చేరారు. ఆయన చేరిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో ఆయనను ఎమ్మెల్సీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. గవర్నర్ కోటాలో ఖాళీ ఉండటంతో అప్పటికప్పుడు కేబినెట్  భేటీలో ఆయన పేరును ఖరారు చేసి.. తీర్మానాన్ని గవర్నర్‌కు పంపారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై గవర్నర్‌కు అభ్యంతరాలు ఉన్నాయి. సామాజిక సేవలు చేసిన వారికి , ఇతర రంగాలలో ప్రముఖులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం సంప్రదాయంగా వస్తోందని ఆమె ఓ సందర్భంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 


Also Read : డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాల సీజ్.... పోలీసు శాఖకు హైకోర్టు కీలక ఆదేశాలు


అప్పట్నుంచి గవర్నర్ వద్దనే కౌశిక్ రెడ్డి ఫైల్ పెండింగ్‌లో ఉంది. సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్సీ ఫైల్ ను ఎందుకు ఆమోదించలేదని ఫాలో అప్ చేయలేదు. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీగానే ఉంది కానీ భర్తీ కాలేదు. నిజానికి గవర్నర్ అలా పెండింగ్‌లో పెడితే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తే ఆమోదించే అవకాశం ఉంది. ఇటీవల ఏపీలోనూ ఇలా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఇద్దరిపై కేసులు ఉండటంతో గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. సీఎం జగన్ వెల్లి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిన తర్వాత ఆమోద ముద్ర వేశారు. గవర్నర్‌కు ఉన్న అభ్యంతరాలను క్లియర్ చేస్తే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అవుతారు.  అయితే మూడు నెలలు దాటిపోయినా అలాంటి ప్రయత్నం సీఎం కేసీఆర్ చేయలేదు. 


Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపే యోచన చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలన్న కేబినెట్ ప్రతిపాదనను ఉపసంహరించుకుని ఆయనను ఎమ్మెల్యే కోటాలో పంపే చాన్స్‌లు ఉన్నాయని అంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపాలనుకున్న నేతను గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే వరకూ కౌశిక్ రెడ్డికి టెన్షన్ తప్పదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


Also Read: ఢిల్లీకి ఈటల ! హైకమాండ్ ఇక కేసీఆర్‌ను నేరుగా ఢీకొట్టే బాధ్యతలిస్తుందా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి