KTR Sircilla Tour: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గానికి రావడంతో టీఆర్ఎస్ శ్రేణులలో నూతనోత్సాహం కనిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగల్చగా.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అధికార పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు.


మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేశారు. సిరిసిల్ల పట్టణంలో కేడీసీసీ బ్యాంకు నూతన భవనాన్ని ఉదయం 11:30 గంటలకు  ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల నూతన కలెక్టరేట్ సముదాయానికి కేటీఆర్ చేరుకున్నారు. అటవీ భూముల సమస్యలపై అధికారులతో కలిసి కలెక్టరేట్ లో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అంతకుముందు నేటి ఉదయం సిరిసిల్ల పట్టణానికి చేరుకున్న కేటీఆర్‌కు టీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.


Also Read: భారత ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం.. కీలక సదస్సులలో దేశ ప్రతినిధులకు సైతం స్పెషల్ ప్రోటోకాల్స్ 


రాజన్న సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పర్యటనకు మంత్రి కేటీఆర్ వెళుతుండగా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ళలో మంత్రి కాన్వాయ్ వెళుతుండగా ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. నేరెళ్ల బాధితులు కోల హరీష్, బానయ్యలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకునే  ప్రయత్నం చేశారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ గట్టిగా నినాదాలు చేస్తున్న హరీష్, బానయ్యలను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ఏ ఇబ్బంది లేకుండా వెళ్లిపోయింది.


జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ఇటీవల జరిగిన ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటన బాధాకరం అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం జిల్లా కావడం, సర్పంచ్ భర్త ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంతో కేటీఆర్‌పై విమర్శలు వచ్చాయి.  


Also Read: ‘నిధివన్’ మిస్టరీ.. ఈ ఆలయంలో రాత్రి మంచాన్ని అలంకరిస్తారు.. ఉదయానికి అంతా చెల్లాచెదురు..  


జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల కిందట వరుస పర్యటనలు చేసిన కేసీఆర్ మరోసారి జిల్లాల పర్యటనతో టీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహపరచడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 29న వరంగల్‌లో టీఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభ జరగనుంది. వీలైతే అంతలోపే కనీసం 2 జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణుల సమాచారం.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి