క్షమాగుణానికి ప్రతీకగా ధాత్రిచెట్టు ( ఉసిరిచెట్టు) ను చెబుతారు. ఉసిరిచెట్టు లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తాం. సాధారణ రోజుల్లో మనం అసాక్షి భోజనాలు  చేస్తుంటాం. అంటే ... సమయం దాటాక తింటా, అతిథికి -బ్రహ్మచారికి పెట్టాకుండా తింటాం, ఒక్కోసారి బయటనుంచి తీసుకొచ్చి తింటాం, ఇంకోసారి నైవేద్యం లేకుండా తింటాం. ఇలా మొత్తం 9 రకాల భోజనాలు ఉన్నాయి. వాటిలో కేవలం రెండే రెండు ఆమోదయోగ్యం. ఒకటి ఇంట్లో వండుకుని తినేది, మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా మనం నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే. పైగా  నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచంపై కూర్చుని తినడంతో ఆ ఆహారంతో పాటూ శరీరంలోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. శ్రీమహాలక్ష్మి, విష్ణుమూర్తి స్వరూపంగా భావించే  ఉసిరిచెట్టుకింద భోజనం చేయడం వల్ల అదంతా స్వామివారి అమ్మవార్ల ప్రసాదం మాత్రమే కాదు.... అసాక్షి భోజనం ద్వారా మన శరీరంలో ప్రవేశించిన కలిపురుషుడిని తరిమేస్తుందని చెబుతారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తారు. పరబ్రహ్మ స్వరూపం అయిన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశం.



Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఆధ్యాత్మికత-ఆనందం-ఆరోగ్యం కలగలిపిన వనభోజనం



  • కార్తీక మాసంలో వన భోజనాల వల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం , ఆరోగ్యం అనే సందేశం కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజు నైమిశారణ్యంలో మునులంతా సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు  'కార్తీక పురాణం''లోప్రస్తావించారు. నాడు మహర్షులు ఆచరించిన వనభోజనాలని నేటికీ నలుగురితో కలసి ఆనందిస్తున్నారు.  

  • భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాం. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి , ఆ చెట్టుకింద వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ప్రత్యేకించి ఆదివారాలు , ఇతర సెలవు దినాల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యాన వనాల్లో , తోటల్లో , నదీ ప్రాంతాలు , సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు.

  • పచ్చని చెట్లు , ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు , బంధు మిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం మానసిక ఉల్లాసాన్నిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెబుతారు.

  • కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట , పాట కబుర్లకు చక్కటి వేదిక. పిల్లలు , పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు , నృత్యాలు , సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం.

  • ఆయా  వృక్షాల మీదుగా వచ్చే గాలులు , ముఖ్యంగా ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యలు చెబుతారు. ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం , ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది.


ఎవరూ మరచిపోలేనంత గొప్ప వన భోజనం చేసిన దేవుడెవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు- బలరాముడు. నిత్యం స్నేహితులతో వనభోజనానికి వెళ్లేవారు.  వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అయినప్పటికీ కృష్ణుడు ప్రత్యేకంగా స్నేహితులతో చెప్పేవాడట ...రేపు వనభోజనానికి వెళదాం అని. అంటే ఆ ప్రత్యేకత, విశిష్టత ఏంటో వాళ్లకి తెలియచేయడం కోసమే.  వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు. వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ కార్తీక వనభోజనాలని ఎంజాయ్ చేయండి.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం
Also Read: సోదరులకు భోజనం పెట్టి కానుకలిచ్చే వేడుక, కార్తీకమాసంలో రెండో రోజు 'భగినీ హస్త భోజనం'
Also Read:  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి