పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా దేశంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. కరోనా మొదటి దశ లాక్ డౌన్ సమయంలో రూ. 70 - రూ. 80 మధ్య ఉండే లీటర్ పెట్రోల్ ధరలు దీపావళి ముందు రోజు వరకూ రూ.115కి చేరుకుంది. ఎంత పెరిగినా నొప్పి భరిస్తూ వస్తున్నారు ప్రజలు. అయితే ఎప్పుడైనా ఆ నొప్పి నుంచి తిరుగుబాటు వస్తుందన్న భయమో.. ఓట్ల కాలం వచ్చేసిందన్న ఆలోచనో కానీ కేంద్రం పెట్రోల్‌పై రూ. ఐదు, డీజిల్‌పై రూ.పది తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు కూడా తమ వంతు పన్నులను తగ్గించాలని సూచించింది. ఈ సూచనతో అనేక రాష్ట్రాలు పన్నులు తగ్గిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల వైపు నుంచి మాత్రం అలాంటి సూచనలు ఏమీ రావడం లేదు. 


లీటర్ పెట్రోల్‌ ధరలో కేంద్ర, రాష్ట్రాల పన్నులే 60 శాతం !


పెట్రోల్, డిజిల్ ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు వసూలుచేస్తాయి. కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ,  స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ ,  రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, అదనంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ని వసూలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ వసూలుచేస్తూంటాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. తెలంగాణలో   ప్రభుత్వం పెట్రోల్ పై 35.20 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. ఉదాహరణకు లీటర్ పెట్రోల్ రూ. వంద ఉందనుకుంటే కేంద్రం పన్నులు, సెస్సులు, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు సెెస్సులు కలిపి రూ. అరవైకి పైగానే ఉంటాయి. అంటే పెట్రోల్ వాస్తవ రేటు రూ. 40కి అటూ ఇటూగానే ఉంటుంది.


Also Read : టీఆర్ఎస్ నేతలకు అప్పుడు మాత్రమే జోష్ వస్తుంది.. సీఎం కేసీఆర్‌కు RRR సినిమా మొదలైందా..!


కేంద్రం తగ్గింపుతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ధరలు ! 


కేంద్రం రూ. ఐదు తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఉదాహరణకు రూ.100 మీద వసూలు చేసే వ్యాట్‌ ఇప్పుడు రూ. 95కే లీటర్ పెట్రోల్ అమ్ముతారు కాబట్టి ఆ మాత్రానికే వ్యాట్ వసూలు చేయాలి. అందుకేహైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై రూ.12.79 చొప్పున తగ్గాయి. దీంతో లీటరు పెట్రోల్ లీటర్ ధర రూ.114.51 నుంచి రూ.108.18కి.. లీటరు డీజిల్ ధర రూ.107.40 నుంచి రూ.94.61కి తగ్గింది. ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.6.10 తగ్గి రూ.109.03కి చేరింది​. లీటర్ డీజిల్ ధర రూ.12.28 చొప్పున తగ్గి రూ.95.17కి చేరింది.


Also Read : వాళ్లు తిరగబడితే పారిపోతారు.. దమ్ముంటే ఆ పని చేస్తారా?


తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు తగ్గించాలని డిమాండ్ !


తెలంగాణలో ప్రభుత్వం పెట్రోల్ పై 35.20 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31 శాతం వ్యాట్‌తో పాటు ఒక్క లీటర్‌ మీద అదనంగా నాలుగు రూపాయల వ్యాట్ విధించింది. అలాగే రోడ్ల మరమ్మతుల నిధుల కోసమని లీటర్‌కు మరో రూపాయి సెస్ వసూలు చేస్తోంది.  అందుకే తెలంగాణకు.. ఏపీకి మధ్య పెట్రోల్ రేట్లలో రూ. రెండు, మూడు రూపాయల తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కేంద్రం పన్నులను తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించాలని సూచించింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంత వరకూ తగ్గిస్తామని కానీ.. తగ్గించే ఆలోచన చేస్తామని కానీ చెప్పడం లేదు. దీంతో రాజకీయ పార్టీలు, సామాన్యుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు తగ్గించాలనే డిమాండ్ వినిపించడం ప్రారంభమయింది.


Also Read: CM Jagan Tour: ఈ నెల 9న ఒడిశాకు ముఖ్యమంత్రి జగన్.. నవీన్ పట్నాయక్ తో భేటీ.. ఎందుకంటే?


 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దూకుడుగా పన్నులు తగ్గించిన ముఖ్యమంత్రులు !
   
కేంద్ర సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్రో రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకంటున్నాయి. ఒక్కో రాష్ట్రం గరిష్టంగా ఏడు రూపాయలు కూడా తగ్గించాయి. అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో కేంద్రం ప్రకటించిన తగ్గింపుతో కలిసి రూ. పన్నెండు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే పెట్రోల్‌పై రూ. ఏడు. డిజిల్‌పై రూ. రెండు అదనంగా తగ్గిచారు. అసోంలో రాష్ట్రం విధిస్తున్న పన్నుల్లో రూ. ఏడు తగ్గింపునుప్రకటించారు అక్కడి సీఎం. గుజరాత్, త్రిపుర  కర్ణాటక, గోవా, మణిపూర్ ప్రభుత్వాలు కూడా పై రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బీహార్ ప్రభుత్వం రూపాయి 30 పైసలు తగ్గించింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.2 తగ్గించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా తగ్గిస్తామని ప్రకటించింది. ఒడిషా సర్కార్ రూ. మూడు అదనంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతోంది.


Also Read : సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ భేటీకి ఆరు అంశాలతో ఏపీ రెడీ.. ప్రత్యేక హోదా ప్రస్తావించాలన్న సీఎం జగన్


ఎన్నికల వ్యూహంతోనే  బీజేపీ పాలిత రాష్ట్రాల తగ్గింపులు !?


అయితే కేంద్రం, రాష్ట్రాలు ఈ పెట్రో ధరల తగ్గింపు కేవలం ఎన్నికల వ్యూహంతో చేస్తున్నారన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. తగ్గింపు అనేది రాజకీయ ప్రయోజనాల కోసమేనని అనుమానిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్,  అలాగే పంజాబ్‌తో పాటు మరో మూడు కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలుజరుగుతాయి. ఫలితాలు తేడా వస్తే బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అందుకే ముందు జాగ్రత్తగా కేంద్రం కాస్త పన్నులను తగ్గించి..  రాష్ట్రాలను తగ్గించాలని కోరింది. ఇదే సందుగా ఉత్తరప్రదేశ్ సీఎం పెద్ద ఎత్తున ఎక్సైజ్ ట్యాక్స్ కట్ చేశారు. ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే చేస్తున్నాయి. పెద్ద ఎత్తున పన్నులను తగ్గిస్తున్నాయి. పెట్రోల్ ధరను వంద కంటే తక్కువ స్థాయికి తెస్తున్నాయి. కానీ బీజేపీ వ్యతిరేకపక్షాలు ఉన్న రాష్ట్రాలు మాత్రం తగ్గింపుపై ఇంకా ఆలోచిస్తున్నాయి.


Also Read : షారుక్ ఖాన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ.. ఎందుకో తెలుసా?


తగ్గిస్తే ఆర్థిక సమస్యలు.. తగ్గించకపోతే విమర్శలు ! రాష్ట్రాలకు ఇబ్బందే !


తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉన్నాయి. రాజకీయం కోసమో.. మరో కారణమో కాని అలవి మాలిన అప్పులు చేసి ఆదాయం పెంచుకునే పరిస్థితి లేక అప్పులపై ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రో ధరలపై పన్ను తగ్గిస్తే ఆ భారం ఎక్కువగా ఉంటుంది. అలా చేస్తే మరింత ఆర్థిక కష్టాల్లో ఇరుక్కుపోతారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పన్ను తగ్గిస్తే ఎంత నష్టం వస్తుందో లెక్కలేసుకుంటున్నాయి. వాటిని ఎలా అయినా భర్తీ చేయగలమో లేదో చూసుకుంటున్నాయి. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఏపీ ప్రభుత్వం అసలు అలాంటి ఆలోచన చేసే పరిస్థితే లేదని అక్కడి ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తగ్గించకుండా సైలెంట్‌గా ఉంచితే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే భారీగా రేట్లు ఉంటాయి. అదే జరిగితే పారిశ్రామిక అభివృద్ధి పైనా ప్రభావం పడుతుంది. అందుకే ఇప్పుడు రాష్ట్రాలకు పెట్రోల్ రేట్ల అంశం ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది.


Also Read: 100% Covid Vaccine: 'వ్యాక్సినేషన్‌లో అలసత్వం వహిస్తే.. మరో ముప్పు తప్పదు.. జాగ్రత్త'


రాజకీయాలూ మామూలే !


ఓ వైపు ఆర్థిక సమస్యలు.. రాష్ట్రానికి అభివృద్ధి ఇబ్బందులు మాత్రమే కాదు.. రాజకీయ సమస్యలూ వెంటాడుతాయి.  పన్నులు తగ్గించాలని విపక్ష పార్టీలు ఉద్యమాలు ప్రారంభిస్తాయి. ప్రజలు కూడా వారితో జత కలిస్తే అధికార వ్యతిరేకత అమాంతం పెరిగిపోతుంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు దీపావళి పండుగ రోజు నుంచి తగ్గిస్తారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రారంభించాయి. ఏపీలోనూ ప్రభుత్వంపై విపక్షాలు చూస్తున్నాయి. ప్రజలు కూడా ఆశగా చూస్తున్నారు. స్పందించకపోతే రాజకీయ రచ్చ కూడా ఖాయమే. 


Also Read : పెట్రో రేటు తగ్గింపు సరే.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి