సీఎం జగన్ ఒడిశా వెళ్లనున్నారు. జలవివాదాల పరిష్కారం కోసం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చిస్తారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న జల జగడం పరిష్కారం కోసం చర్చలు జరుపనున్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎంతో చర్చలు చేస్తారని తెలుస్తోంది. అదే రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
పోలవరం, జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యలపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. రెండు రాష్ట్రాల్లో వెనక బడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే.. నేరెడి బ్యారేజీ నిర్మాణంపైనా చర్చ జరుగుతుంది. చర్చల కోసం సమయం ఇస్తే రావడానికి సిద్ధమని.. ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. లేఖపై నవీన్ పట్నాయక్ స్పందించారు. చర్చలకు సానుకూలత వ్యక్తం చేస్తూ.. జగన్ ను ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ చేయాలంటే ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లలో ముంపు సమస్యను పరిష్కరించాలి. ఈ పరిస్ధితుల్లో నీటిని నిల్వ చేసేందుకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎంతో వైఎస్ జగన్ చర్చలు జరపనున్నారు.
గతంలో రాసిన లేఖలో జగన్ ఏం ప్రస్తావించారంటే..
వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో సీఎం జగన్ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో ఒడిశా రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనివల్ల ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్‌సీల నీటిని నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చని గతంలో రాసిన లేఖలో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు.
Also Read: Nellore: నెల్లూరులో టపాసుల విక్రయాలు అంతంతమాత్రమే.. వ్యాపారులు లబోదిబో, కారణం ఏంటంటే..
Also Read: Weather Updates: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ